Begin typing your search above and press return to search.

ఆర్బీఐ : వడ్డీ రేట్లు నడ్డి విరుస్తాయా ?!

దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీంతో వడ్డీరేట్లు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. ఆగస్టు 2026కు సీపీఐ (కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్) 4.8 శాతానికి పెరిగింది.

By:  Garuda Media   |   7 Oct 2026 11:45 AM IST
ఆర్బీఐ : వడ్డీ రేట్లు నడ్డి విరుస్తాయా ?!
X

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటిస్తూ కొత్త వడ్డీ రేట్లను వెల్లడించింది. రెపో (రీ పర్చేజ్ అగ్రిమెంట్) రేట్లు ఇప్పటి వరకు 5.25 శాతం ఉండగా, 25 బేసిస్ పాయింట్లు పెంచి దానిని 5.50 శాతం చేసింది. ఇది ఫిబ్రవరి 2023 తర్వాత మొదటి పెంపు రేటు. దీంతో ఎస్డీఎఫ్ (స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ) 5.25 శాతం, ఎంఎస్ఎఫ్ (మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ) 5.75 శాతానికి సర్దుబాటు అయ్యాయి.

దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీంతో వడ్డీరేట్లు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. ఆగస్టు 2026కు సీపీఐ (కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్) 4.8 శాతానికి పెరిగింది. సీపీఐ అంటే సాధారణ ప్రజలు రోజువారీగా కొనుగోలు చేసే వస్తువులు, మరియు సేవల ధరలు ఎంత పెరిగాయి ? ఎంత తగ్గాయి ? అని కొలిచే సూచిక. దీనిలో ఆహారం, ఇంధనం, ఇంటి అద్దె, విద్య, వైద్యం, వస్త్రాలు, రవాణ వంటి వాటి ధరల మార్పును కొలుస్తుంది.

ముఖ్యంగా ఆహారం, ఇంధనం గ్రూపులలో ఎక్కువ పెరుగుదల కనిపిస్తున్నది. యుద్దం మూలంగ క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయి ఆయిల్ బ్యారెల్ ధర వంద డాలర్లకు చేరింది. దేశంలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాలలో ఎల్ నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం కారణంగా ఆహార ధరలు పెరిగే ప్రమాదం పొంచి ఉంది.

దీంతో పాటు అంతర్జాతీయంగా యూఎస్ ఫెడరల్ మరియు ఇతర సెంట్రల్ బ్యాంకులు రేట్లు పెంచుతున్నాయి. రూపాయి బలహీనత కూడా ఇక్కడ వత్తిడి పెంచుతున్నది. ఆర్బీఐ అంచనాల ప్రకారం వీటన్నింటిని నియంత్రించడానికి వడ్డీ రేట్ల పెంపు అనివార్యం అని భావిస్తున్నది. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ రేటు పెంపును సహించగలదని అంచనా వేస్తున్నారు.

ఈ వడ్డీ రేట్ల పెంపు గృహ రుణాల మీద ప్రభావం చూపనుంది. ఉదాహరణకు రూ.50 లక్షల రుణం 25 ఏళ్ల కాలపరిమితికి గాను 7.50 శాతం వడ్డీకి తీసుకుని ఉంటే అది 7.75 శాతానికి పెరుగుతుంది. ప్రస్తుతం అది నెలకు ఈఎంఐ రూ.36,950 ఉంటే అది రూ.37,766కు పెరుగుతుంది. అంటే నెలకు రూ.817 పెరుగుదల ఉంటుంది. అదే విధంగా రూ.40 లక్షల రుణం ఉంటే రూ.654 పెరుగుదల ఉంటుంది. అయితే ఫిక్స్ డ్ రేట్ రుణాల మీద, ఇప్పటికే ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్ల మీద ఎలాంటి ప్రభావం ఉండదు.

ఇక ఈ వడ్డీ రేట్ల ప్రభావం ఇక నుండి తీసుకోబోయే వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలు, వ్యాపార రుణాలు, కార్పోరేట్ రుణాలు, రియల్ ఎస్టేట్, ఆటో మొబైల్ రుణాల మీద ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నందున పెరుగుదలకు పెద్ద నష్టం ఉండదని, హెచ్చు తగ్గుల నియంత్రణకు ఈ చర్య అవసరం అని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.