Begin typing your search above and press return to search.

హోమ్ లోన్, పర్సనల్ లోన్ తీసుకున్నవారికి కొత్త టెన్షన్..!

ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో డిసెంబర్‌లో ఆర్బీఐ రెపో రేటును పెంచే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 25 నుంచి 50 బేసిస్ పాయింట్ల వరకు పెంపు ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం అమలైతే హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లపై వడ్డీ భారం పెరిగే అవకాశముంది. డిసెంబర్ పాలసీ సమావేశంలో దీనిపై స్పష్టత రానుంది.

By:  Priya Chowdhary Nuthalapti   |   29 Nov 2026 4:25 PM IST
హోమ్ లోన్, పర్సనల్ లోన్ తీసుకున్నవారికి కొత్త టెన్షన్..!
X

భారతీయ రిజర్వ్ బ్యాంక్ డిసెంబర్‌లో మరోసారి వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందనే అంచనాలు బలపడుతున్నాయి. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో.. ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకోవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా డిసెంబర్‌లో జరగనున్న ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశంపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఈ సమావేశంలో రెపో రేటును పెంచే అవకాశం ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

GoalFi వ్యవస్థాపకుడు, సీఈఓ రాబిన్ ఆర్య అభిప్రాయం ప్రకారం.. డిసెంబర్‌లో ఆర్బీఐ మరోసారి వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తోంది. అంతేకాకుండా..అక్టోబర్ నెలలో దేశ రిటైల్ ద్రవ్యోల్బణం 6.09 శాతానికి చేరింది. ఇది ఆర్బీఐ నిర్దేశించిన గరిష్ట పరిమితిని దాటింది. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు పెరగడం దీనికి ముఖ్యమైన కారణంగా మారింది.

ఈ క్రమంలో మార్కెట్లు ఇప్పటికే 25 బేసిస్ పాయింట్ల.. వడ్డీ రేటు పెంపును అంచనా వేస్తున్నాయని రాబిన్ ఆర్య తెలిపారు. నవంబర్ నెలలో బ్యాంక్ నిఫ్టీ సుమారు 15 శాతం పెరగడం కూడా వడ్డీ రేట్లపై ఉన్న అంచనాలను తెలుపుతోంది అని ఆయన వివరించాడు.

అంతేకాకుండా.. ఎస్బీఐ రీసెర్చ్ మాత్రం మరింత కీలకమైన అంచనాను వెల్లడించింది. డిసెంబర్ పాలసీ సమావేశంలో ఆర్బీఐ ఏకంగా 50 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచవచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 6 శాతానికి చేరిన నేపథ్యంలో 25 బేసిస్ పాయింట్ల పెంపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని తన నివేదికలో పేర్కొంది.

ఇక ఈ భారీ వడ్డీ రేట్ల పెంపు వల్ల బాండ్ మార్కెట్లు, విదేశీ మారక ద్రవ్య మార్కెట్లపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా రుణాలపై వడ్డీ భారం పెరగడం వల్ల హౌస్ లోన్స్, పర్సనల్ లోన్స్ తీసుకున్నవారితో పాటు చిన్న వ్యాపారాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే..దేశీయ ఆర్థిక వ్యవస్థలో కంపెనీల ఆదాయ వృద్ధి మధ్యస్థ స్థాయిలో కొనసాగుతుందని రాబిన్ ఆర్య అభిప్రాయపడ్డారు. కంపెనీల ఆదాయాలు 15 శాతం వరకు పెరగడం సాధ్యమేనని, అంతకంటే ఎక్కువ వృద్ధి సాధించాలంటే ప్రతి ఏడాది లాభాల మార్జిన్లు కూడా పెరగాల్సి ఉంటుందని తెలిపారు. ఇక వీటన్నిటి పైన క్లారిటీ రావాలి అంటే డిసెంబర్ మొదటి లేదా రెండు వారాల వరకు వెయిట్ చేయాల్సిందే.