గోల్డ్ లోన్ ఇక ఈజీ కాదు.. ఆంక్షల చట్రం బిగించిన ప్రభుత్వం
బంగారం తనఖా రుణాలకు ఐటీ రిటర్న్స్ తప్పనిసరి చేయడంతో పాటు ఎంత రుణం ఇవ్వాలనేది కూడా స్పష్టంగా నిర్దేశించారు.
By: Tupaki Political Desk | 14 May 2026 4:55 PM ISTఎప్పుడు కావాలంటే అప్పుడు.. కేవలం కొద్ది నిమిషాల్లోనే లభించే గోల్డ్ లోన్ పొందడం ఇక నుంచి అంత సులువు కాదని అంటున్నారు. దీనికి బంగారు ఆభరణాలపై రుణాల మంజూరు ప్రక్రియకు ఆర్బీఐ విధించిన ఆంక్షలే కారణమని చెబుతున్నారు. బంగారు రుణాలపై ఆర్బీఐ విధించిన ఆంక్షలు సామాన్యులకు తీవ్ర ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొత్త నిబంధనలతో బంగారు ఆభరణాలను తనఖా పెట్టి లోన్ తీసుకోవడం చాలా కష్టతరమైన ప్రక్రియగా మారునుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్బీఐ సూచనలతో కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఇప్పటికే ఈ నిబంధనలను అమలులోకి తీసుకువచ్చినట్లు చెబుతున్నారు.
ఆర్బీఐ కొత్తగా తీసుకువచ్చిన నిబంధనల ప్రకారం ఇకపై రూ.2.50 లక్షలకు మించి రుణం కావాలంటే తప్పనిసరిగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సివుంటుందని అంటున్నారు. లేదంటే బంగారం తాకట్టుపై రుణం ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో రుణాల కోసం వ్యవసాయ భూములు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సివుంటుందని అంటున్నారు. ఆర్బీఐ సూచనలతో కొన్ని బ్యాంకులు ఇప్పటికే తమ సాఫ్ట్ వేర్ మార్చుకుని బంగారం రుణాలపై ఆంక్షలు అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. మిగిలిన బ్యాంకులు కూడా కొద్ది రోజుల్లో ‘పిన్నకిల్’ సాఫ్ట్ వేర్ అప్డేట్ చేసుకుని కొత్త నిబంధనలు పాటించాల్సివుంటుందని చెబుతున్నారు.
బంగారం తనఖా రుణాలకు ఐటీ రిటర్న్స్ తప్పనిసరి చేయడంతో పాటు ఎంత రుణం ఇవ్వాలనేది కూడా స్పష్టంగా నిర్దేశించారు. రూ.2.5 లక్షలు లోపు రుణం తీసుకుంటే బంగారం విలువలో 85 శాతం వరకు రుణంగా ఇస్తారని చెబుతున్నారు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణం కావాలంటే 80 శాతం ఇస్తారని, రూ.5 లక్షలపైగా రుణం అడిగే వారికి బంగారం విలువలో గరిష్టంగా 75 శాతం వరకు రుణంగా ఇస్తారని చెబుతున్నారు. ఇక రుణగ్రహీత ఆదాయం, అప్పులు, నెలవారీ ఈఎంఐ ఖర్చులను కూడా బ్యాంకులకు తెలియజేయాల్సివుంటుందని అంటున్నారు.
ఖాతాదారుడి ఆర్థిక పరిస్థితిని లెక్కించి తిరిగి చెల్లించగలడో లేదో సమీక్షించిన తర్వాతే బంగారంపై రుణం ఇవ్వాలని ఆర్బీఐ చేసిన సూచన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బంగారాన్ని తమ సురక్షిత పెట్టుబడిగా భావించడంతోపాటు డబ్బు అవసరం అయిన సందర్బంలో నిమిషాల్లో సమకూర్చకునే అవకాశం ఉంటుందనే ఆలోచనతో వినియోగదారులు తమ డబ్బును బంగారం రూపంలో దాచుకుంటున్నారు. ఇప్పుడు బంగారంపై రుణాలు పొందడాన్ని ఆర్బీఐ కఠినతరం చేయడంతో తమ అవసరాలను ఎలా తీర్చుకుంటామని మదన పడుతున్నారు.
కాగా, బంగారు రుణాలపై కొత్త నిబంధనలను రూపొందించిన ఆర్బీఐ రుణగ్రహీతలకు మరో షాక్ కూడా ఇచ్చిందని చెబుతున్నారు. కొత్త రూల్స్ ప్రకారం 18 నుంచి 22 క్యారెట్ల హాల్ మార్క్ గోల్డ్ పైనే లోన్ ఇవ్వాలనే సూచన తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ముడి బంగారు, బిస్కెట్లు, ప్రైమరీ గోల్డ్ పై రుణాలు ఇవ్వకూడదని ఆర్బీఐ స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. అదే సమయంలో బంగారం తనఖా పెట్టి తీసుకునే డబ్బుతో తిరిగి బంగారు ఆభరణాలు, నాణేలు కొనడానికి వీలు లేదని ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం మధ్య తరగతి ప్రజలను తీవ్ర ప్రభావితం చేస్తుందని అంటున్నారు.
