Begin typing your search above and press return to search.

ఈఎంఐ కట్టకపోతే ఫోన్ లాక్.. 2027 నుంచి కొత్త రూల్స్.. ఆర్బీఐ కీలక నిర్ణయం

మనదేశంలో ఐఫోన్ లేదా ఒక మంచి స్మార్ట్‌ఫోన్ కొనే ముచ్చట రాగానే సగం మందికి గుర్తొచ్చే ఏకైక మాట ఈఎంఐ.

By:  A.N.Kumar   |   7 Aug 2026 5:30 PM IST
ఈఎంఐ కట్టకపోతే ఫోన్ లాక్.. 2027 నుంచి కొత్త రూల్స్.. ఆర్బీఐ కీలక నిర్ణయం
X

మనదేశంలో ఐఫోన్ లేదా ఒక మంచి స్మార్ట్‌ఫోన్ కొనే ముచ్చట రాగానే సగం మందికి గుర్తొచ్చే ఏకైక మాట ఈఎంఐ. నెలకు వెయ్యో రెండు వేలో కడితే చాలు.. చేతిలో కొత్త ఫోన్ మెరిసిపోతుంది కదా అని డబ్బా కొట్టుకుంటూ షాప్ నుంచి బయటకు వస్తుంటాం. తొలి నెల డౌన్ పేమెంట్ కట్టేసి ఫోన్ పట్టుకెళ్లాక ఆ తర్వాత వచ్చే నెలానెలా వాయిదాలను కాస్త తేలిగ్గా తీసుకునే 'మహా మేధావులకు' భారతీయ రిజర్వ్ బ్యాంక్ గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇన్నాళ్లూ ఈఎంఐలు కట్టకపోతే రికవరీ ఏజెంట్లు పదే పదే ఫోన్లు చేసి విసిగించేవారు.. లేదా ఇంటికి వచ్చి రచ్చ చేసేవారు. కానీ 2027 జనవరి 1 నుంచి ఈ రికవరీ సీన్ పూర్తిగా మారిపోబోతోంది. మీరు గనుక క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించకపోతే బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు డైరెక్ట్‌గా మీ చేతిలో ఉన్న ఫోన్‌నే ఊచల వెనక్కి నెట్టేస్తాయి. అంటే నాన్-పేమెంట్ బ్యాచ్‌కు చెక్ పెట్టడానికి ఆర్బీఐ రిమోట్ డివైజ్ లాకింగ్ అనే కొత్త మార్గదర్శకాలను రంగంలోకి దించుతోంది.

ఈ కొత్త నిబంధనల వెనుక ఉన్న టైమ్‌లైన్ చూస్తే ఎవరైనా సరే వాయిదాల విషయంలో కాస్త భయపడాల్సిందే. మీరు ఈఎంఐ కట్టడంలో విఫలమై మొదటి 30 రోజులు దాటితే మీ ఫోన్‌కు పాక్షికంగా పక్షవాతం వస్తుంది. అంటే ఆర్బీఐ భాషలో దీనిని పార్షియల్ లాక్ అంటారు. ఈ దశలో ఫోన్‌లోని కొన్ని ముఖ్యమైన ఫీచర్లు, యాప్‌లు పనిచేయడం మానేస్తాయి. ఒకవేళ మొదటి నెల పోతే పోయిందిలే అని రెండో నెల కూడా ‘చూద్దాంలే’ అంటూ నిర్లక్ష్యం చేసి 60 రోజులు దాటేశారో ఇక అంతే సంగతులు. సదరు ఫైనాన్స్ కంపెనీలు మీ ఫోన్‌ను పూర్తిగా లాక్ చేసేస్తాయి. ఫోన్ మాత్రమే కాదు.. మీరు లోన్‌పై తీసుకున్న ల్యాప్‌టాప్, టాబ్‌లకు కూడా ఇదే డిజిటల్ తాళం వర్తిస్తుంది.

అయితే వినియోగదారుల అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ కాస్త దయ తలచింది. ఫోన్ పూర్తిగా లాక్ అయినప్పటికీ ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్ లు, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ సేవలు మాత్రం యధాతథంగా పనిచేస్తాయి. దీనివల్ల లాభం ఏంటంటే అప్పు ఇచ్చిన కంపెనీ వాడు ఫోన్ చేసి "ఏరా బాకీ ఎప్పుడు కడతావ్?" అని తిట్టడానికి మీతో మాట్లాడటానికి లైన్ ఎప్పుడూ క్లియర్‌గానే ఉంచుతారన్నమాట.

ఇక అందరినీ వేధించే ప్రధాన సందేహం ఏంటంటే ఫోన్ లాక్ చేస్తే లోపలున్న పర్సనల్ సమాచారం ఏమైపోతుంది అని.. దీనిపై ఆర్బీఐ చాలా స్పష్టమైన హామీ ఇచ్చింది. డివైజ్ లాక్ చేసే ప్రక్రియలో లెండర్లకు వినియోగదారుల వ్యక్తిగత డేటాపై ఎలాంటి యాక్సెస్ ఉండదు. మీ ఫోన్‌లో ఉన్న ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు, కాంటాక్ట్స్, బ్యాంకింగ్ యాప్స్ లేదా ఇతర గోప్యమైన సమాచారాన్ని చూడటానికి కానీ సేకరించడానికి కానీ ఫైనాన్స్ కంపెనీలకు అస్సలు అనుమతి లేదు. వాళ్లకు కావాల్సిందల్లా మీరు కట్టాల్సిన బాకీ పైసలు మాత్రమే తప్ప మీ పర్సనల్ ముచ్చట్లు కాదని ఆర్బీఐ స్పష్టం చేసింది.

ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రావడానికి ఇంకా సమయం ఉన్నందున ఇకపై లోన్ ఇచ్చే ముందే "నాయనా.. నువ్వు సమయానికి ఈఎంఐ కట్టకపోతే నీ ఫోన్‌ను రిమోట్‌గా లాక్ చేస్తాం" అని కంపెనీలు కస్టమర్లకు ముందే స్పష్టంగా చెప్పి వారి అంగీకారం తీసుకోవడం తప్పనిసరి. ప్రస్తుతం దేశంలో 'బై నౌ – పే లేటర్' సంస్కృతి విపరీతంగా పెరిగిపోయి చాలామంది జేబులో రూపాయి లేకపోయినా ఖరీదైన గ్యాడ్జెట్స్ కొనేస్తున్నారు. ఈ కొత్త విధానంతో 2027 నుంచి ఈ "బై నౌ – పే లేటర్" కాస్త "బై నౌ – పే కరెక్ట్‌లీ.. లేకపోతే డబ్బా గోవిందా"గా మారబోతోంది. కాబట్టి స్మార్ట్‌ఫోన్లతో షో చేసే మహానుభావులు ఇప్పటినుంచే నెలానెలా ఈఎంఐలు కట్టే మంచి అలవాటు చేసుకుంటే మంచిది.. లేదంటే మీ చేతిలో ఉన్న ఆ ప్లాటినం ఫోన్ కేవలం ఒక సమాధి రాయిలా మారిపోవడం ఖాయం..