రూపాయి వెనుక సీక్రెట్: మీ జేబులో నోటు తయారు కావడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా?
మనం ప్రతీరోజూ వస్తువులు కొనడానికైనా, ప్రయాణాలు చేయడానికైనా నోట్లను ఉపయోగిస్తూనే ఉంటాం.
By: Madhu Reddy | 19 Sept 2026 2:00 PM ISTమనం ప్రతీరోజూ వస్తువులు కొనడానికైనా, ప్రయాణాలు చేయడానికైనా నోట్లను ఉపయోగిస్తూనే ఉంటాం. కానీ, మన చేతిలో ఉండే రూ. 10, రూ .100, లేదా రూ .500 నోటును అసలు ప్రింట్ చేయడానికి ఆర్బీఐ ఎంత ఖర్చు చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? నోటు విలువతో పోలిస్తే దాని తయారీ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. అసలు మన దేశంలో డబ్బు ఎలా తయారవుతుంది, ఏ నోటుకు ఎంత ఖర్చవుతుందో ఈ ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
నోట్లు ప్రింట్ చేసే ప్రెస్సులు ఎక్కడ ఉన్నాయి?:
భారతదేశంలో డబ్బులు ముద్రించే బాధ్యతను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చూసుకుంటుంది. మన దేశంలో నోట్లను ముద్రించడానికి మొత్తం నాలుగు ప్రత్యేకమైన ప్రింటింగ్ ప్రెస్సులు ఉన్నాయి. ఇవి నాసిక్, దేవాస్, మైసూర్, సల్బోనిలలో పనిచేస్తున్నాయి. ఇక ఇక్కడ వేర్వేరు విలువ కలిగిన నోట్లను అత్యంత భద్రతల నడుమ తయారు చేస్తారు.
నోట్ల తయారీకి ఎలాంటి కాగితం వాడతారు?:
నోట్లను ప్రింట్ చేయడానికి మనం సాధారణంగా వాడే కాగితాన్ని ఉపయోగించరు. దీని కోసం ప్రత్యేకమైన కాటన్ (పత్తి) తో తయారు చేసిన కాగితాన్ని వాడతారు. అందువల్లే నోట్లు నీటిలో తడిచినా వెంటనే చిరిగిపోవు. ఇక అంతేకాకుండా వీటిని తయారుచేసే ప్రత్యేకమైన సిరా, కాగితాలను కొన్నిసార్లు విదేశాల నుండి కూడా దిగుమతి చేసుకుంటారు.
నకిలీ నోట్లను అడ్డుకునే భద్రతా ఫీచర్లు:
నోటు తయారీ ఖర్చు పెరగడానికి ప్రధాన కారణం అందులో ఉండే భద్రతా ఫీచర్లే. ప్రతీ నోటులోనూ వాటర్‌మార్క్, సెక్యూరిటీ థ్రెడ్, మైక్రో లెటరింగ్, రంగు మారే ప్రత్యేకమైన ఇంక్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇక వీటి వల్ల సాధారణ ప్రజలు కూడా అసలు నోటు ఏదో, నకిలీ నోటు ఏదో సులభంగా గుర్తుపట్టడానికి వీలవుతుంది.
ఏ నోటు తయారీకి ఎంత ఖర్చవుతుంది?:
నోట్ల విలువను బట్టి వాటి తయారీ ఖర్చులో కూడా తేడాలు ఉంటాయి. ఆర్బీఐ నివేదికల ప్రకారం వివిధ నోట్ల అంచనా తయారీ వ్యయం ఇలా ఉంది:
రూ .10 నోటు: సుమారు రూ .0.96
రూ .20 నోటు: సుమారు రూ. 0.95
రూ. 50 నోటు: సుమారు రూ. 1.13
రూ. 100 నోటు: సుమారు రూ .1.77
రూ .200 నోటు: సుమారు రూ. 2.37 నుండి రూ .2.93
రూ .500 నోటు: సుమారు రూ. 2.29 నుండి రూ. 3.00
తక్కువ వ్యయంతో ఎక్కువ విలువ:
చిన్న విలువ కలిగిన రూ. 10, రూ .20 నోట్లను ముద్రించడానికి దాదాపు 1 రూపాయి వరకు ఖర్చు అవుతుంది. అదే సమయంలో పెరిగే భద్రతా ప్రమాణాల వల్ల పెద్ద నోట్ల తయారీకి రూ 2 నుండి రూ .3 వరకు వ్యయమవుతుంది. ప్రభుత్వం నోటుపై ముద్రించిన ముఖ విలువ కంటే దానిని తయారు చేసేందుకు అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉండటం విశేషం.
మనం చూసే చిన్న కాగితం ముక్క వెనుక ఎంతో సాంకేతికత, భద్రత, విదేశీ దిగుమతుల ఖర్చు దాగి ఉన్నాయి. ఇక ముద్రణ వ్యయం తక్కువే అయినప్పటికీ, ఆ నోటుకు ప్రభుత్వం ఇచ్చే గ్యారెంటీ వల్లనే దానికి అంత విలువ వస్తుంది. మన చేతిలో మెరిసే ప్రతీ నోటు వెనుక ఇన్ని సీక్రెట్లు ఉండటం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే.
