Begin typing your search above and press return to search.

UPI లో 3000 పైగా మ‌నీ ట్రాన్జాక్ష‌న్ల‌పై బాదుడు నిజ‌మేనా?

ఆర్బీఐ యూపిఐ ట్రాన్సాక్షన్ల చార్జెస్ పై క్లారిటీ ఇచ్చింది. ఇప్పటివరకు 3000 రూపాయలు గనక UPI ట్రాన్సాక్షన్ జరిగితే.. ఆ తర్వాత నుండి చార్జెస్ అప్లై అవుతాయి అంటూ చాలా కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి.

By:  Sivaji Kontham   |   5 Aug 2026 9:22 AM IST
UPI లో 3000 పైగా మ‌నీ ట్రాన్జాక్ష‌న్ల‌పై బాదుడు నిజ‌మేనా?
X

ఆర్బీఐ యూపిఐ ట్రాన్సాక్షన్ల చార్జెస్ పై క్లారిటీ ఇచ్చింది. ఇప్పటివరకు 3000 రూపాయలు గనక UPI ట్రాన్సాక్షన్ జరిగితే.. ఆ తర్వాత నుండి చార్జెస్ అప్లై అవుతాయి అంటూ చాలా కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే కేంద్రం అలాగే ఆర్బీఐ రెండూ ఒక క్లారిటీ ఇచ్చాయి. అస‌లు దీనిపై చ‌ట్టం ఎలా ఉంది? దీంతో ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది ఏదైనా ఉందా? అనే కోణంలో వివ‌ర‌ణ ఇచ్చింది ఆర్బీఐ.

యూపీఐ లావాదేవీలపై అదనపు ఛార్జీలు వసూలు చేస్తారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ..ర‌క‌ర‌కాల‌ మాధ్యమాల్లో అనేక రకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ప్రత్యేకించి రూ. 3000 కంటే ఎక్కువ మొత్తంలో జరిపే ప్రతి యూపీఐ ట్రాన్సాక్షన్ పై ఇకపై సర్ఛార్జీలు లేదా అదనపు రుసుములు వర్తిస్తాయని ప్రచారం జరగడంతో డిజిటల్ చెల్లింపులు వాడే సాధారణ ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం - ఆర్‌బీఐ స్పందిస్తూ స్పష్టమైన ప్రకటన విడుదల చేశాయి.

యూపీఐ ట్రాన్సాక్షన్లపై అదనపు ఛార్జీలు వసూలు చేస్తారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కేంద్రం, ఆర్‌బీఐ స్పష్టం చేశాయి. వినియోగదారులు జరిపే సాధారణ యూపీఐ చెల్లింపులు పూర్తి ఉచితమని తేల్చిచెప్పాయి. 2007 నాటి పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 10ఏ నిబంధనల ప్రకారం.. బ్యాంకులు కానీ.. పేమెంట్ సర్వీస్ సంస్థలు కానీ వినియోగదారుల నుంచి ఎలాంటి అదనపు రుసుములను వసూలు చేయకూడదని రూల్స్ స్పష్టంగా పేర్కొంటున్నాయి.

అయితే కొన్ని ప్రత్యేకమైన ఇంటర్ ఛేంజ్ లావాదేవీలకు మాత్రం నియమ నిబంధనల ప్రకారం చిన్నపాటి ఛార్జీలు వర్తిస్తాయి. ముఖ్యంగా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (పీపీఐ) అయిన డిజిటల్ వాలెట్ల ద్వారా జరిపే చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. వాలెట్లలో రూ. 2,000 వరకు జరిపే లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు ఉండవు కానీ రూ. 2000 కంటే ఎక్కువ మొత్తంలో వాలెట్ ద్వారా లావాదేవీలు నిర్వహించినప్పుడు మాత్రం 1.1 శాతం వరకు ఇంటర్ ఛేంజ్ ఛార్జీలు పడతాయని స్పష్టం చేశారు.

అందువల్ల రూ. 3,000 దాటితే యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు పడతాయని వస్తున్న వార్తలను వినియోగదారులు ఎవరూ నమ్మవద్దని అధికారులు సూచించారు. బ్యాంక్ ఖాతాల నుండి నేరుగా జరిపే సాధారణ యూపీఐ డిజిటల్ చెల్లింపులన్నీ ఎప్పటిలాగే పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయి. కాబట్టి ప్రచారంలో ఉన్న పుకార్లను నమ్మకుండా.. నిశ్చింతగా డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చని వెల్లడించారు.