పేటీఎంకు ఆర్ బీఐ షాక్.. అసలేమైంది?
ఆర్ బీఐ ఇంతటి కఠినమైన నిర్ణయం వెనకున్న కారణాలు ఇవేనని చెబుతున్నారు. అవేమంటే..?
By: Garuda Media | 25 April 2026 10:56 AM ISTపేటీఎం.. పరిచయం చేయాల్సిన అవసరం లేని ఫిన్ టెక్ సంస్థ. దేశీయ డిజిటల్ చెల్లింపుల విప్లవానికి పేటీఎం పునాది లాంటిది. ఇప్పుడు గూగుల్ పే.. ఫోన్ పే తరహాలో ఎన్నో చెల్లింపుల ప్లాట్ ఫాంలు ఉన్నా.. వీటన్నింటికి ముందుగా శ్రీకారం చుట్టింది మాత్రం పేటీఎం. 2010లో విజయ్ శేఖర్ శర్మ పేటీఎంను మొబైల్ రీఛార్జ్ ఫ్లార్ ఫారమ్ గా ప్రారంభించి.. ఆ తర్వాత డిజిటల్ వాలెట్ కాన్సెప్టును భారతదేశంలో పాపులర్ చేశాడు. 2016లో పెద్దనోట్ల రద్దు వేళ.. పేటీఎం డిమాండ్ అమాంతం పెరిగింది. అప్పుడే.. ప్రతి చిన్న బంక్.. కిరాణా షాపులో కనిపించిన పేటీఎం క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి చెల్లింపులు జరపటం ద్వారా.. ఎటీఎంల మీద ఆధారపడే భారం తగ్గింది.
2015లో ఫోన్ పే ఎంట్రీ ఇవ్వటం.. 2016లో యూపీఐను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందుబాటులోకి వస్తే.. 2017లో గూగుల్ పే టేజ్ పేరుతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గూగుల్ పేగా మారింది. పేటీఎం కంటే లేటుగా వచ్చిన గూగుల్ పే.. ఫోన్ పేలు స్ట్రాంగ్ అయితే.. పేటీఎం మాత్రం రేసులో వెనుకబడటానికి కారణం.. ఆ సంస్థ ఫోకస్ మారటమే. పేటీఎం తనకంటూ సొంత బ్యాంకును ఏర్పాటు చేసుకొని.. వాలెట్ సిస్టం మీద ఎక్కువగా దృష్టి పెట్టింది. అదే సమయంలో గూగుల పే.. ఫోన్ పేలు బ్యాంక్ అకౌంట్లను లింక్ చేసే యూపీఐ మోడల్ ను ఫాలో అయ్యాయి.
ప్రజలు సైతం వాలెట్ లో డబ్బులు దాచుకునే కన్నా.. బ్యాంకు నుంచి నేరుగా డబ్బులు పంపే విధానానికి మొగ్గు చూపటంతో పేటీఎం వెనుకపడింది. ఇదంతా గతం. వర్తమానానికి వస్తే..పేటీఎంకు భారత రిజర్వు బ్యాంక్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్ ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్టు కింద ఇకపై బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది.
ఎందుకంటే.. డిపాజిటర్లు.. ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా బ్యాంకు మేనేజ్ మెంట్ వ్యవహరిస్తోందని ఆర్ బీఐ చెబుతోంది. అంతేకాదు.. పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రూల్స్ ను ఫాలో కావటం లేదని ఆర్ బీఐ స్పష్టం చేసింది. బ్యాంకింగ్ సేవల మూసివేతపై హైకోర్టును ఆశ్రయిస్తామని ఆర్ బీఐ చెప్పింది. డిపాజిటర్లకు చెల్లించేందుకు తగిన నగదు నిల్వలు పేటీఎం వద్ద ఉన్నట్లుగా పేర్కొంది,
కీలకమైన అంశం ఏమంటే.. గడిచిన కొన్నేళ్లుగా పేటీఎం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ వస్తోంది. కొత్త కస్టమర్లను చేర్చుకోవటంపై 2022 మార్చి 11న ఆంక్షలు విధిస్తే.. 2024లో డిపాజిట్లు స్వీకరించటంపై ఆంక్షలు విధించింది. తాజాగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్న కారణంగా ఇప్పుడు పూర్తిగా లైసెన్స్ రద్దు చేసింది. దీంతో.. ఏప్రిల్ 24 పని వేళలు ముగిసిన వెంటనే ఈ లైసెన్స్ రద్దు నిర్ణయం అమల్లోకి వచ్చింది. బ్యాంకును పూర్తిగా మూసివేసే ప్రక్రియ కోసం ఆర్ బీఐ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు చెబుతున్నారు.
ఆర్ బీఐ ఇంతటి కఠినమైన నిర్ణయం వెనకున్న కారణాలు ఇవేనని చెబుతున్నారు. అవేమంటే..?
- పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన లైసెన్స్ నిబంధనలను నిరంతరం ఉల్లంఘిస్తూ ఉండటం.
- ఖాతాదారుల ధృవీకరణ ప్రక్రియలో తీవ్రమైన లోపాలను ఆర్బీఐ గుర్తించటం.
- ఒకే పాన్ కార్డుకు వేల సంఖ్యలో ఖాతాలను అనుసంధానించడం.
- ప్రాథమిక కేవైసీ లేని ఖాతాల్లో రూ.కోట్ల మేర లావాదేవీలు జరగడం
- బ్యాంకు వ్యవహారాలు డిపాజిటర్ల ప్రయోజనాలకు, ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉండటం
- సమగ్ర ఆడిట్ తర్వాత బ్యాంకు నిర్వహణలో లోపాలు ఉన్నట్లు ఆర్బీఐ నిర్ధారించటం
- సరైన కేవైసీ నియమాలు పాటించకపోవడం. ఈ ఖాతాలు మనీలాండరింగ్ కు అవకాశం ఉందని భావించటం.
