Begin typing your search above and press return to search.

50 పైసలు గుర్తు చేసిన ఆర్బీఐ

అయితే దేశంలో 50 పైసల నాణెంను చెలామణి నుండి ఉపసంహరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నాణేల చట్టం కింద ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని అంటున్నారు.

By:  Satya P   |   8 Dec 2025 11:45 PM IST
50 పైసలు గుర్తు చేసిన ఆర్బీఐ
X

కాలం అన్నింటినీ ఒక పెద్ద తెర వేసి మరుగున పెట్టేస్తుంది. అలా కాలగర్భంలో కలసిపోయినవి చాలా ఉన్నాయి. ఇక ఆర్బీఐ ముద్రించిన నాణేలు ఎన్నో విలువ తగ్గి ఇక ఇపుడు చలామణీలో లేకుండా పోయాయి. ప్రస్తుతానికి జనం చేతిలో కనిపించే అతి తక్కువ విలువ గల నాణెం ఏమిటి అంటే రూపాయి మాత్రమే. అయినా దానిని యాచకుడు సైతం తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఒక కీలకమైన ప్రకటన చేసింది.

క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ :

దేశంలో 50 పైసల నాణెం ఇప్పటికీ చట్టబద్ధమైనది అంతే కాదు ఒక రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు 10 విలువ వరకు లావాదేవీలకు దీనిని అంగీకరించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా స్పష్టం చేసింది . దీని చెల్లనితనం గురించిన పుకార్లను నమ్మవద్దని ఆర్బీఐ ప్రజలకు మరియు బ్యాంకులకు విజ్ఞప్తి చేసింది. నాణేల చట్టం, 2011 ప్రకారం 10 రూపాయలకు మించని మొత్తానికి 50 పైసల నాణెం చెల్లుబాటు అయ్యే చెల్లింపు రూపంగా ఉంటుందని పేర్కొంది. . ఈ మొత్తం కంటే ఎక్కువ లావాదేవీలకు, అంగీకారం స్వచ్ఛందంగా ఉంటుందని వెల్లడించింది.

కేవలం అపోహ:

ఇక 50 పైసలు గురించి దానికి అధికారిక చట్టపరమైన హోదా ఉన్నప్పటికీ, ఈ నాణెం రోజువారీ లావాదేవీలలో చాలా అరుదుగా ఉపయోగించబడుతుందన్నది వాస్తవం. అంతే కాదు జూన్ 2011 లో ఉపసంహరించబడిన 25 పైసల నాణెం మాదిరిగానే 50 పైసలు కూదా డీమోనిటైజ్ చేయబడిందనే అపోహ కారణంగా దేశంలో దీనిని పెద్ద సంఖ్యలో జనాలు తిరస్కరిస్తున్నారు. అలాగే విక్రేతలు ప్రజల నుండి విస్తృతమైన తిరస్కరణను ఎదుర్కొంటున్న నాణెంగా 50 పైసలు ఉంది.

ఆ నోటిఫికేషన్ లేదు:

అయితే దేశంలో 50 పైసల నాణెంను చెలామణి నుండి ఉపసంహరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నాణేల చట్టం కింద ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని అంటున్నారు. ఇది చట్టబద్ధమైన టెండర్‌గా ఈ రోజుకీ ఉందని ఆర్బీఐ చెబుతొంది. ఇక లావాదేవీలు లేదా మార్పిడి కోసం 50 పైసల నాణేలతో సహా అన్ని డినామినేషన్ల నాణేలను సంకోచం లేకుండా బ్యాంకులు అంగీకరించాలని ఆర్బీఐ అన్ని బ్యాంకు శాఖలకు సూచించింది. ఒకవేళ దీనిని ఉల్లంఘించినట్లు అయితే కనుక ఆర్బీఐ సూచనల ఉల్లంఘనగా పరిగణించబడుతుందని కూడా హెచ్చరించింది.

ముద్రణ విషయంలో :

ఇదిలా ఉంటే దేశంలో నాణేల ముద్రణకు భారత ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. అధిక ఉత్పత్తి ఖర్చులు తక్కువ డిమాండ్ కారణంగా కొత్త 50 పైసల నాణేల ముద్రణ సంవత్సరాలుగా ముద్రణలో తక్కువగా ఉన్నప్పటికీ వివిధ డిజైన్లు, పరిమాణాలు ఇతివృత్తాలు కలిగిన 50 పైసలు ప్రస్తుతం నాణేలుగా చట్టబద్ధంగా కొనసాగుతున్నాయని చెబుతున్నారు. అంతే కాదు ఆర్బీఐ ఇటీవల ఈ విషయంలో తప్పుడు సమాచారం పై ఆధారపడవద్దని అన్ని చెల్లుబాటు అయ్యే నాణేలను అంగీకరించడం కొనసాగించాలని ప్రజలను కోరుతోంది.

విలువ కోల్పోయిందా :

అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 50 పైసలకు విలువ ఉందని చెబుతోంది. కానీ అది చలామణీలో తక్కువగా ఉంటోంది. అదే సమయంలో 50 పైసలకు కనీసం ఏమీ రాని పరిస్థితి ఉంది. అదే విధంగా ఎవరూ దానిని అసలు పట్టించుకోవడం లేదు అన్న మాట ఉంది. దాంతోనే అది బలం కోల్పోయిందని అంటున్నారు. మొత్తం మీద 50 పైసలకు చలామణీలో విలువ అయితే ఉందని అర్ధం అవుతోంది.