వెంటాడుతున్న ర్యాగింగ్ భూతం.. చొక్కా బటన్ పెట్టుకోలేదని!
ప్రస్తుత జనరేషన్ లో కూడా ర్యాగింగ్ కల్చర్ అనేది ఎంతలా పాతుకుపోయింది అంటే కాలేజీలోకి అడుగుపెడదామంటే చాలు విద్యార్థుల్లో ర్యాగింగ్ భయం పట్టుకుంటుంది.
By: Madhu Reddy | 13 Sept 2025 4:07 PM ISTప్రస్తుత జనరేషన్ లో కూడా ర్యాగింగ్ కల్చర్ అనేది ఎంతలా పాతుకుపోయింది అంటే కాలేజీలోకి అడుగుపెడదామంటే చాలు విద్యార్థుల్లో ర్యాగింగ్ భయం పట్టుకుంటుంది. ముఖ్యంగా పేరుగాంచిన కాలేజీలలో కూడా ఇలాంటి ర్యాగింగ్ భూతం ఎంతోమంది విద్యార్థులను చదువులకు దూరం చేస్తోంది. ఇప్పటికే ర్యాగింగ్ వల్ల ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు కొంతమంది ప్రాణాలు కూడా వదిలారు.. కొత్తగా కాలేజీకి వెళ్దామంటే చాలు సీనియర్లు జూనియర్లను చేసే ర్యాగింగ్ మాటల్లో చెప్పలేనిది.ఒకప్పుడు జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చాలా చక్కగా కలిసి మెలిసి ఉండేవారు. చాలామంది సీనియర్లు.. జూనియర్లకు సపోర్ట్ చేస్తూ ఉండేవారు. కానీ జనరేషన్ మారుతున్న కొద్దీ జూనియర్లు, సీనియర్లు అనే తేడాలు చూపిస్తూ కొత్తగా కాలేజీకి వచ్చిన వారిపై అజమాయిషీ చలాయించాలి అని, సీనియర్లు వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు.
ఈ సీనియర్లు చేసే ర్యాగింగ్ కొన్ని కాలేజీలలో చాలా దారుణంగా ఉంటుంది. సీనియర్ ల ర్యాగింగ్ లకి ప్రాణాలు వదిలిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. అయితే తాజాగా ఓ కాలేజీలో షర్ట్ బటన్ పెట్టుకోనందుకు జూనియర్ పై సీనియర్లంతా పడి దాడి చేశారు. మరి అది ఎక్కడ జరిగింది అనే వివరాలు చూస్తే.. కర్నూలు జిల్లాలోని రాయలసీమ యూనివర్సిటీలో బీటెక్ ఫస్టియర్ చదివే విద్యార్థి రోజులాగే ఒక రోజు కాలేజీకి వచ్చాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న కొంతమంది సీనియర్లు షర్ట్ పై బటన్ పెట్టమని వార్నింగ్ ఇచ్చారట. అయితే సీనియర్ లు ఇచ్చిన వార్నింగ్ కి ఆ జూనియర్ విద్యార్థి.. ఆ సరేలే పెడతాను"అని కాస్త భయం లేనట్లుగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో సీనియర్లు కోపంతో ఊగిపోయారు.
ఎలాగైనా జూనియర్ కి బుద్ధి చెప్పాలి అని కొత్త వసతి గృహంలోని 136వ నెంబర్ గదిలోకి తీసుకువెళ్లి అందరూ మూకుమ్మడిగా కలిసి పిడుగుద్దులతో దాడి చేశారు. దాంతో గాయాల పాలైన ఆ జూనియర్ విద్యార్థి వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేద్దామని నిర్ణయించుకోగా.. మధ్యలో విద్యార్థి సంఘాలు కల్పించుకొని జూనియర్ విద్యార్థికి, సీనియర్లకి మధ్య రాజీ కుదిర్చడానికి ట్రై చేశారు.కానీ దెబ్బల పాలైన ఆ జూనియర్ విద్యార్థి మాత్రం విద్యార్థి సంఘాల నాయకులు చెప్పే మాటలు వినిపించుకోకుండా దెబ్బలు తగిలింది నాకు కచ్చితంగా నేను దీనిపై యాక్షన్ తీసుకుంటాను అని గట్టిగా చెప్పడంతో విద్యార్థి సంఘ నాయకులు ఆ జూనియర్ విద్యార్థితో చర్చలు జరిపారట.
అయితే ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి కావడంతో మిగతా విద్యార్థులు అందరూ భయాందోళనకు గురవుతున్నారట. అయితే ఇదే విషయంపై వీసీ వెంకట బసవరావుని అడగగా..విద్యార్థులు గొడవపడ్డ విషయం మా వరకు రాలేదు. అయితే ఈ విషయం ఇప్పుడే తెలిసింది. కాబట్టి ఇలాంటి గొడవలు ఇంకొకసారి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామంటూ తెలియజేశారు. ఏది ఏమైనప్పటికీ ర్యాగింగ్ పేరుతో జూనియర్లపై సీనియర్లు చేసే అరాచకాలకు అడ్డు అదుపూ లేకుండా పోతుంది అని, ఈ విషయం తెలిసిన కొంతమంది మండిపడుతూ సమాజంలో ఉండే ఈ ర్యాగింగ్ భూతం పై కఠిన చర్యలు తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.
