ప్రత్యేక రాయలసీమ నినాదం ఎవరిది ?
ఉమ్మడి ఏపీ కాస్తా రెండుగా మారింది. ఇక విభజన జరిగి కూడా దశాబ్దం దాటింది. ఏపీ ఇంకా కుదురుకోలేదు.
By: Satya P | 11 Aug 2025 12:00 PM ISTఉమ్మడి ఏపీ కాస్తా రెండుగా మారింది. ఇక విభజన జరిగి కూడా దశాబ్దం దాటింది. ఏపీ ఇంకా కుదురుకోలేదు. ఈ రోజుకి కూడా రాజధాని అన్నది లేదు. కేంద్ర ప్రభుత్వం అయితే అధికారికంగా అమరావతిని రాజధానిగా గుర్తించాల్సి ఉంది. అమరావతి రాజధానికి ఒక రూపూ రేఖా రావాలని అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నానా ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ మధ్యలో మరోసారి ప్రాంతీయ ఉద్యమాలకు తెర లేచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాయలసీమ మొదటి నుంచి :
ఏపీలో రాయలసీమ కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాలు మూడు ప్రధాన రీజియన్లుగా ఉన్నాయి. ఇందులో కోస్తా ఉత్తరాంధ్ర మొదటి నుంచి ఒకే మాట మీద ఉంటున్నాయి. రాయలసీమ కూడా అలాగే ఉంటోంది కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం వేరే స్వరం వినిపించింది. ఇక 1953లో ఉమ్మడి మద్రాస్ నుంచి అప్పటి పదకొండు జిల్లాల ఆంధ్ర రాష్ట్రం విడిపోయినపుడు రాయలసీమ మేము మద్రాస్ లోనే ఉంటామని చెప్పడం జరిగింది అని చరిత్రకారులు చెబుతారు. తమకు మద్రాస్ తోనే బాగుందని అభివృద్ధి కూడా సాగుతుందని సీమ నేతలు నాడు పట్టుబట్టారు అంటారు.
ఎన్నో ఒప్పందాలతో అలా :
అయితే రాయలసీమ కలవకపోతే కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాలు చిన్నవిగా అయిపోతాయి. అలా చిన్న రాష్ట్రం ఇవ్వడానికి కేంద్రం కూడా అంగీకరించేది ఉండదన్న ఆలోచనతో సీమను కలుపుకునిపోయేందుకు చాలా మంది నాయకులు ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో అనేక ఒప్పందాలు కూడా ముందు పెట్టుకుని చర్చించారు. అలా శ్రీభాగ్ ఒప్పందాన్ని చేసుకున్నారు. ఆ మీదటనే రాయలసీమ కోస్తాంధ్రాతో కలిసేందుకు ముందుకు వచ్చింది అన్నది చరిత్ర చెబుతున్న విషయం. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టు కానీ రాజధాని కానీ ఏదో ఒకటి రాయలసీమకు ఇవ్వాలని.
మూడునాళ్ళ ముచ్చటగా :
మరో వైపు చూస్తే 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయింది. సీమ వాసుల కోరిక మేరకు కర్నూల్ రాజధాని అయింది. హైకోర్టు కోస్తాకు దక్కింది. అలా గుంటూరులో ఏర్పాటు చేశారు. ఇక ఏయూ విశాఖలో ఉత్తరాంధ్రా కోసం ఏర్పాటు చేశారు. ఇలా సాగుతున్న నేపధ్యంలో మూడేళ్ళు తిరగకుండానే విశాలాంధ్రా అంటూ నాటి హైదరాబాద్ స్టేట్ లో ఆంధ్ర రాష్ట్రం కలిసింది. దాంతో ఆంధ్ర ప్రదేశ్ 1956 నవంబర్ 1న అవతరించింది. దాంతో రాజధానిగా హైక్దరాబాద్ అయింది. హైకోర్టు కూడా హైదరాబాద్ కి తరలివెళ్ళింది.
మళ్ళీ అన్నీ అక్కడే :
ఇక 2014లో ఉమ్మడి ఏపీ విభజన జరిగింది. దాంతో 13 ఉమ్మడి జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అయితే రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. హైకోర్టు అక్కడే ఉంది. దాంతో తమకు ఏమి ఒరిగింది అన్నదే రాయలసీమ వాసుల ఆవేదన అంటున్నారు. కోస్తా జిల్లాలతో తమను కలపవద్దు అని రాయల తెలంగాణా ఏర్పాటు చేయమని కూడా తెలంగాణా ఉద్యమ సమయంలో రాయలసీమ ప్రముఖ నేతలు కోరిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. దాంతో మరోసారి ప్రత్యేక రాయలసీమ అని నినాదం మొదలైంది.
తమకో రాష్ట్రం అంటూ :
రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా చేయమని రాయలసీమ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కుంచం వెంకట సుబ్బారెడ్డి కోరుతున్నారు. లేదా కేంద్ర పాలిత ప్రాంతం అయినా రాయలసీమకు ఇవ్వాలని ఆయన అంటున్నారు. ఈ మేరకు తమ తీర్మానాన్ని పార్లమెంట్ లో చర్చకు పెట్టి ఆమోదించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి వినతిపత్రం కూడా ఇచ్చామని ఆయన చెబుతున్నారు. సాగునీటి విషయంతో పాటు విద్యా ఉపాధి పరంగా తమకు తీరని అన్యాయం జరుగుతోందని అందుకే ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నామని అంటున్నారు.
ఆ జిల్లాలన్నీ సీమకేనట :
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి రాయలసీమ విడిపోయేటపుడు ఉన్న జిల్లాలు తరువాత కాలంలో తమిళనాడు కర్ణాటకలో కలసిపోయాయి. అయితే ఆ జిల్లాలను కూడా వెనక్కి తెచ్చి రాయలసీమలో కలపమని ఆయన కోరుతున్నారు. 1952లో ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి మద్రాస్ నుంచి వేరు పడినపుడు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, వేలూరు క్రిష్ణగిరి, బళ్ళారి, రాయచూరు, చిత్రగిరి కోలార్ వంటివి కలిపి 12 జిల్లాలు రాయలసీమ లో ఉండేవని ఆయన గుర్తు చేశారు. అందువల్ల వాటితో కలిపి కొత్త రాష్ట్రం చేస్తే తమ మానన తాము ఉంటామని అంటున్నారు.
ఇదంతా అయ్యే పనేనా :
తమిళనాడు, కర్ణాటకలో కలిపిన జిల్లాలను వెనక్కి ఇవ్వడం జరిగేది కాదు, ఇక నెల్లూరు ప్రకాశం కోస్తాలోనే ఉన్నాయని అంటున్నారు. మరి ఇవన్నీ అయ్యే పనేనా అని అంటున్నారు. పైగా విభజన గాయాలు ఇంకా పచ్చిగానే ఏపీలో ఉన్నాయని ఇపుడు మరో రాష్ట్ర డిమాండ్ సమంజసమేనా అని అంటున్నారు. అయితే 2029 లోగా తమకు కొత్త రాష్ట్రం కావాలని ఆయన కోరుతున్నారు. చూడాలి మరి ఇది కొందరి నినాదం అవుతుందా లేక భావోద్వేగాలు ఇందులో జత కూడుతాయా అన్నది.
