Begin typing your search above and press return to search.

రాయలసీమ ఇక 'రాయల్' సీమ.. సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్!

కరువు సీమ రాయలసీమ ఇక నుంచి ‘రాయల్’ సీమ కాబోతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By:  Tupaki Political Desk   |   8 May 2026 1:05 PM IST
రాయలసీమ ఇక రాయల్ సీమ.. సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్!
X

కరువు సీమ రాయలసీమ ఇక నుంచి ‘రాయల్’ సీమ కాబోతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకప్పుడు వర్షాభావంతో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కోవడమే కాకుండా, కరువుతో అల్లాడిన రాయలసీమ ప్రాంతం గత కొంతకాలంగా ఉద్యాన తోటలు, పారిశ్రామిక వాడలుగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ మెరుగైన మానవ వనరులతోపాటు భూమి కూడా లభిస్తుండటంతో ఆటోమొబైల్ సంస్థలు రాయలసమీకు క్యూ కడుతున్నాయి. గతంలో కియా మోటార్స్, ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ పెట్టుబడులను ఇందులో భాగంగానే చూస్తున్నారు.





తిరుపతి సమీపంలో రూ.2,200 కోట్లతో రాయల్ ఎన్ ఫీల్డ్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం రెండు రోజుల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం రాష్ట్ర పెట్టుబడులు, ప్రోత్సాహక మండలి సమావేశంలో ఈ మేరకు తీర్మానం ఆమోదించగా, గురువారం ‘ఏపీకి ఎవరొస్తున్నారో తెలుసా’ అంటూ మంత్రి లోకేశ్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. రాయల్ ఎన్ ఫీల్డ్ బులెట్ బండిపై స్టైలిష్ లుక్ లో లోకేశ్ కనిపించడంతో నెటిజన్లు కూడా ఆసక్తికర కామెంట్లు చేశారు. ఇక గురువారం కలెక్టర్ల సదస్సు ప్రారంభ సమావేశంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు రాయల్ ఎన్ఫీల్డ్ రాకను తెలియజేస్తూ ప్రకటన చేశారు.

తన కాలేజీ రోజుల్లో బులెట్ నడపడాన్ని ఓ గౌరవంగా భావించేవాడినని గుర్తు చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇప్పుడు ఆ పరిశ్రమను రాష్ట్రంలో స్థాపించేందుకు అడుగులు వేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఎక్స్ లో రాయలసీమను రాయల్ సీమ గా అభివర్ణిస్తూ సీఎం ట్వీట్ చేశారు. రాయలసీమను ‘రాయల్’సీమ అంటూ ముఖ్యమంత్రి చేసిన పద ప్రయోగం నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. కేవలం పరిశ్రమ రాకను మాత్రమే కాకుండా, ఆ ప్రాంతం సాధించబోతున్న పారిశ్రామిక పురోగతిని సీఎం తన ట్వీట్ లో తెలియజేశారని అంటున్నారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి పెద్ద బ్రాండ్ ఉన్న కంపెనీ రాకతో రాయలసీమ రూపురేఖలు మారనున్నాయని అంచనా వేస్తున్నారు. ఒకప్పుడు కరువు, ఫ్యాక్షనిజానికి చిరునామాగా భావించిన రాయలసీమ ప్రస్తుతం అంతర్జాతీయ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోందని విశ్లేషిస్తున్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ యూనిట్ స్థాపనతో వేలాది మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ఆనందం వ్యక్తమవుతోంది. ఒక పెద్ద ఆటోమొబైల్ ప్లాంట్ వస్తే, దాని వెంటే స్పేర్ పార్ట్స్ తయారీ చేసే వందలాది ఎంఎస్ఎంఈ యూనిట్లు వస్తాయని అంటున్నారు. దీనివల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ భారీగా పుంజుకుంటుందని చెబుతున్నారు.