పరిటాల వారసుడికి భద్రత...సీరియస్ మ్యాటరేనా ?
ఇక ఇదే అనంతపురం జిల్లాలో ధర్మవరం రాప్తాడు కీలక నియోజకవర్గాలుగా ఉన్నాయి. ఇవి దివంగత నేత మాజీ మంత్రి పరిటాల రవీంద్రకు ఎంతో పలుకుబడి ఉన్న ప్రాంతాలు.
By: Satya P | 17 Sept 2025 9:17 AM ISTరాయలసీమలో ఫ్యాక్షనిజం అన్నది చాలా కాలంగా ఉంటూ వస్తోంది. అక్కడ ఫ్యాక్షనిజం రాజకీయం కలగలిసిపోయి చాలా కాలం రాజ్యమేలాయి. అయితే చంద్రబాబు సీఎం అయ్యాక పరిస్థితిలో మార్పు బాగా వచ్చింది. అయితే ఇప్పటికీ కీలక నియోజకవర్గాల్లో మాత్రం కక్షలు కార్పణ్యాలు అలా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక అనంతపురంలో చూస్తే కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు సున్నితమైనవిగా చెబుతూ ఉంటారు. అందులో తాడిపత్రి ఒకటి. అక్కడ జేసీ ఫ్యామిలీ వర్సెస్ వైసీపీ నేత పెద్దారెడ్డి కధ అందరికీ తెలిసిందే.
పరిటాల పట్టున్న చోటు :
ఇక ఇదే అనంతపురం జిల్లాలో ధర్మవరం రాప్తాడు కీలక నియోజకవర్గాలుగా ఉన్నాయి. ఇవి దివంగత నేత మాజీ మంత్రి పరిటాల రవీంద్రకు ఎంతో పలుకుబడి ఉన్న ప్రాంతాలు. రవీంద్ర ప్రజా ఉద్యమాలలో ఉంటూ ఎదిగారు. ఒక దశలో నక్సలైట్ ఉద్యమంలో కూడా పనిచేసి ప్రజా నాయకుడిగా వెలిగారు. ఆ తరువాత దివంగత ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి టీడీపీలో చేరారు. ఆయనకు ఎన్టీఆర్ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా మంత్రిగా చేశారు. అలా కార్మిక మంత్రిగా పరిటాల కొంత కాలం పనిచేశారు. అయితే రాజకీయ ప్రత్యర్ధులతో ఆయనకు నిరంతర పోరాటం సాగేది. అలా 2005లో జనవరి 25న ఆయన హత్యకు గురి అయ్యారు.
యువ నేతగా ఉంటూ :
పరిటాల రవీంద్ర మరణంతో ఆయన సతీమణి సునీత రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె 2014లో రాప్తాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా అయిదేళ్ళ పాటు పనిచేశారు. తల్లికి అండగా ఉంటూ యువ నేతగా పరిటాల వారసుడు శ్రీరాం ఆనాడే ప్రజా జీవితంలోకి వచ్చారు. అప్పట్లో ఆయనకు ప్రభుత్వం 2 ప్లస్ 2 గన్ మెన్ లతో సెక్యూరిటీ ఇచ్చింది. ఎందుకంటే సున్నితమైన ప్రాంతాలు కావడంతో ఆయన భద్రతను సీరియస్ గానే తీసుకుంది. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో గన్ మెన్లను శ్రీరాం కి తొలగించింది.
ధర్మవరం పై ఫోకస్ :
ఇక 2019లో వైసీపీ గెలిచి టీడీపీ ఓటమి పాలు కావడంతో ధర్మవరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బీజేపీలోకి వెళ్ళిపోయారు. దాంతో ధర్మవరం బాధ్యతలు శ్రీరాం కి టీడీపీ అప్పగించింది. అలా అయిదేళ్ళ పాటు ఆయన పోరాటాలు చేశారు. 2024లో ఎమ్మెల్యేగా టికెట్ ఖాయం అనుకున్న వేళ పొత్తులలో భాగంగా బీజేపీకి ఆ సీటు వెళ్ళింది. సత్య కుమార్ యాదవ్ గెలిచి మంత్రి కూడా అయ్యారు. అయితే ధర్మవరం ఇంచార్జిగా శ్రీరాం ఈ రోజుకీ కొనసాగుతున్నారు. అక్కడ చూస్తే రాజకీయం ఒక రేంజిలో ఉంటోంది. దాంతో వైసీపీ వర్సెస్ టీడీపీ మారి సెగలూ పొగొలూ కూడా పోతోంది.
భద్రత ఇచ్చిన ప్రభుత్వం :
ఈ నేపధ్యంలో శ్రీరాం కి భద్రతని పునరుద్ధరించాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. శ్రీరాం కి గతంలో ఉండేది, మధ్యలో పోయింది. ఇపుడు ఆయన మళ్ళీ సాధించుకున్నారు. రాయలసీమలో రాజకీయం కత్తి మీద సాము లాంటిది. అందునా పరిటాల కుటుంబంలో అంతా పోరాటంలోనే అసువులు బాసారు. దాంతో సెక్యూరిటీ అవసరంగా మారింది. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలతో కూటమి ప్రభుత్వం ఆయనకు భారీ భద్రతను కల్పించింది. దీంతో ఇక మీదట మరింత దూకుడుగా శ్రీరాం ధర్మవరం తో పాటు రాప్తాడు రాజకీయాలను చేస్తారు అని అంతా అంటున్నారు.
