బ్రేకింగ్ : కేంద్రమంత్రి రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం
ఇప్పటివరకు ఆయన కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమలు, అలాగే రైల్వే శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు.
By: A.N.Kumar | 25 July 2026 12:09 AM ISTకేంద్ర రాజకీయాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన సమర్పించిన రాజీనామా పత్రాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వెంటనే ఆమోదించారు. ఇప్పటివరకు ఆయన కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమలు, అలాగే రైల్వే శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు.
రాజీనామాకు దారితీసిన పరిస్థితులేంటంటే?
రవ్‌నీత్ సింగ్ బిట్టూ రాజ్యసభ సభ్యత్వ పదవీకాలం ఇటీవల ముగియడమే ఈ రాజీనామాకు ప్రధాన కారణమని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం పార్లమెంట్ సభ్యత్వం లేకపోవడంతో ఆయన తన మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడైన రవ్‌నీత్ సింగ్ బిట్టూకు పంజాబ్ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎంపీగా గెలుపొందారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయాన్ని నమోదు చేశారు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్‌ను వీడి భారతీయ జనతా పార్టీ లో చేరారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ బిజెపి అధిష్ఠానం ఆయనకు రాజ్యసభ అవకాశం కల్పించి కేంద్ర సహాయ మంత్రిగా ప్రాధాన్యం ఇచ్చింది.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి
కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకున్న రవ్‌నీత్ సింగ్ బిట్టూ ఇకపై పూర్తి స్థాయిలో పంజాబ్ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది పంజాబ్‌లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో బిట్టూ ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం ఉంది. ఆ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఆయన ఇప్పటికే క్షేత్రస్థాయిలో చురుగ్గా శ్రమిస్తున్నారు.
పంజాబ్‌లో పార్టీకి బలమైన పునాది వేయడంతో పాటు రాబోయే ఎన్నికల్లో బీజేపీ తరఫున ఆయన అత్యంత కీలక పాత్ర పోషించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిణామంతో పంజాబ్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.
