Begin typing your search above and press return to search.

రవి వర్మ చిత్రానికి 167 కోట్లు.. వేలంలో దక్కించుకున్న వారు సాధారణ వ్యక్తులు కాదు..

ముంబైలో జరిగిన ‘సాఫ్రాన్ ఆర్ట్స్ స్ప్రింగ్ లైవ్ ఆక్షన్’లో జరిగిన ఈ వేలం, గత రికార్డులను తుడిచిపెట్టేసింది. ఈ చారిత్రాత్మక వేలం గురించి తెలుసుకుంటే..

By:  Tupaki Political Desk   |   2 April 2026 3:36 PM IST
రవి వర్మ చిత్రానికి 167 కోట్లు.. వేలంలో దక్కించుకున్న వారు సాధారణ వ్యక్తులు కాదు..
X

భారతీయ చిత్రకళా చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం! 19వ శతాబ్దపు సుప్రసిద్ధ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన ఒక తైలవర్ణ చిత్రం ఏకంగా రూ. 167.2 కోట్లకు అమ్ముడుపోవడం అంటే, అది కేవలం వ్యాపారం కాదు.., భారతీయ సంస్కృతికి దక్కిన అపురూప గౌరవం. ముంబైలో జరిగిన ‘సాఫ్రాన్ ఆర్ట్స్ స్ప్రింగ్ లైవ్ ఆక్షన్’లో జరిగిన ఈ వేలం, గత రికార్డులను తుడిచిపెట్టేసింది. ఈ చారిత్రాత్మక వేలం గురించి తెలుసుకుంటే..

ఎం.ఎఫ్. హుస్సేన్ రికార్డు కనుమరుగు!

ఈ వేలం ద్వారా భారతీయ కళాఖండాల విలువ అంతర్జాతీయ స్థాయికి చేరుకుందని నిరూపితమైంది. ప్రపంచలో ఇప్పటి వరకు ఎంఎఫ్. హుస్సేన్ గీసిన పెయింటింగ్ రూ. 118 కోట్లతో అత్యంత ఖరీదైన భారతీయ కళాకృతిగా ఉండేది. తాజాగా రాజా రవివర్మ చిత్రం దానిని అధిగమించి అగ్రస్థానానికి చేరుకుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ పూనావాలా ఈ పెయింటింగ్‌ను దక్కించుకున్నారు. భారతీయ వారసత్వాన్ని కాపాడడం తన కర్తవ్యమని ఆయన పేర్కొనడం విశేషం.

చిత్రం విశిష్టత..

1890వ దశకంలో రాజా రవివర్మ గీసిన ఈ చిత్రంలో మాతృప్రేమ ఉట్టిపడుతోంది. యశోదమ్మ పాలు పితుకుతుండగా.. వెనుక వైపు చిన్ని కృష్ణుడు ఉన్న ఈ చిత్రం, పురాణ గాథలను సామాన్యులకు చేరువ చేసిన రవివర్మ శైలికి అద్దం పడుతోంది. పాశ్చాత్య దేశాల ఆయిల్ పెయింటింగ్ టెక్నిక్స్‌ను భారతీయ సంప్రదాయ అంశాలతో జోడించి రవివర్మ సృష్టించిన ఈ కళాఖండం ఇప్పటికీ రంగు తగ్గకుండా ఉండడం విశేషం.

భారతీయ చిత్రకళా పితామహుడు!

భారతీయ చిత్రకళను సామాన్యుల ఇళ్లలోకి తీసుకెళ్లిన ఘనత రవివర్మకే దక్కుతుంది. మనం ఈరోజు చూస్తున్న లక్ష్మీదేవి, సరస్వతి వంటి దేవతల రూపాలకు ప్రాణం పోసింది ఆయనే. అప్పట్లో ధనవంతులకే పరిమితమైన పెయింటింగ్స్‌ను, లితోగ్రాఫిక్ ప్రెస్ ద్వారా ప్రింట్లు వేయించి సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చారు. అందుకే ఆయనను ’రాజ రవివర్మ’ అని పిలుస్తారు.

పెరుగుతున్న క్రేజ్!

ఇటీవలి కాలంలో రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ తరహాలోనే ‘కళాఖండాల’పై పెట్టుబడి పెట్టడం ట్రెండ్‌గా మారిపోతోంది. అరుదైన పెయింటింగ్స్ కాలం గడిచేకొద్దీ భారీ లాభాలను తెచ్చిపెడతాయి. 140 ఏళ్ల క్రితం రవివర్మ చిత్రం నేడు 167 కోట్లు పలకడమే దీనికి నిదర్శనం. డబ్బు కంటే కూడా దేశపు గొప్పతనాన్ని చాటిచెప్పే ఇలాంటి చిత్రాలను సేకరించడం గొప్ప గౌరవంగా పారిశ్రామికవేత్తలు భావించడం ఆనందమనే చెప్పాలి.

రాజా రవివర్మ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన గీసిన గీతలు నేటికీ కోట్లాది రూపాయల విలువను కలిగి ఉన్నాయి. ఈ వేలం ద్వారా భారతీయ చిత్రకళకు ప్రపంచ వ్యాప్తం గుర్తింపు రావడమే కాకుండా, రాబోయే తరం చిత్రకారులకు ఇది ఒక పెద్ద ప్రోత్సాహకంగా నిలుస్తుంది. కళకు వెల కట్టలేం అంటారు కానీ, రవివర్మ చిత్రానికి దక్కిన ఈ గౌరవం ఆయన ప్రతిభకు దక్కిన అసలైన నీరాజనం.