Begin typing your search above and press return to search.

నాలుగు నెలల్లో 22 మరణ శిక్షలు.. యూపీ జడ్జి తీర్పులతో 'రేరిస్ట్ ఆఫ్ రేర్'పై చర్చ

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి రవి కుమార్ దివాకర్ తీర్పులు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

By:  A.N.Kumar   |   17 Aug 2026 11:11 PM IST
నాలుగు నెలల్లో 22 మరణ శిక్షలు.. యూపీ జడ్జి తీర్పులతో రేరిస్ట్ ఆఫ్ రేర్పై చర్చ
X

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి రవి కుమార్ దివాకర్ తీర్పులు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కేవలం నాలుగు నెలల వ్యవధిలో ఆయన 10 వేర్వేరు కేసుల్లో 22 మంది దోషులకు మరణశిక్ష విధించడం న్యాయవర్గాల్లోనూ ప్రజల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతంలో బరేలీలో పనిచేసిన సమయంలో మరో 13 మందికి మరణశిక్ష విధించిన నేపథ్యంలో.. ఇప్పటివరకు జడ్జి దివాకర్ మరణశిక్ష విధించిన దోషుల సంఖ్య 35కు చేరినట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదించింది.

ముజఫర్‌నగర్‌లో దివాకర్ మరణశిక్ష తీర్పుల పరంపర ఏప్రిల్ 6న ప్రారంభమైంది. న్యాయవాది సమీర్ సైఫీ హత్య కేసులో ముగ్గురు దోషులకు ఆయన మరణశిక్ష విధించారు. అనంతరం ఏప్రిల్ 28న జరిగిన మరో హత్య కేసులో ఒక మహిళతో పాటు ఆమె ముగ్గురు కుమారులకు ఉరిశిక్ష విధించారు. మే 30న మరో వ్యక్తికి, జూన్ 20న ఇద్దరికి మరణశిక్ష పడింది.

జూలైలోనూ తీర్పులు కొనసాగాయి. జూలై 2న ఒకరికి, జూలై 6న ఇద్దరికి, జూలై 17న మరో నలుగురికి మరణశిక్ష విధించారు. ఆగస్టులో ఆగస్టు 12న ఒకరికి, ఆగస్టు 13న మరో నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పులు వెలువడ్డాయి.

ఈ కేసుల్లో 2020లో విధి నిర్వహణలో ఉన్న హోంగార్డును హత్య చేసిన కేసు కూడా ఉంది. అలాగే 2011లో జరిగిన హైవే దోపిడీ, హత్య కేసులో నలుగురికి ఇటీవల మరణశిక్ష విధించారు. బరేలీలో ఉన్న సమయంలో 2014లో జరిగిన ట్రిపుల్ మర్డర్, దోపిడీ కేసులో ఛైమర్ హసన్ గ్యాంగ్‌కు చెందిన ఎనిమిది మందికి కూడా దివాకర్ మరణశిక్ష విధించారు.

‘రేరిస్ట్ ఆఫ్ రేర్’ సిద్ధాంతంపై చర్చ

ఇంత తక్కువ వ్యవధిలో పెద్ద సంఖ్యలో మరణశిక్షలు విధించడంపై ‘రేరిస్ట్ ఆఫ్ రేర్’ అత్యంత అరుదైన, అత్యంత తీవ్రమైన సిద్ధాంతం ఎలా వర్తింపజేస్తున్నారనే దానిపై చర్చ మొదలైంది. మరణశిక్ష అనేది అత్యంత తీవ్రమైన శిక్ష కావడంతో దానిని విధించే ముందు అన్ని అంశాలను లోతుగా పరిశీలించాలని ఒక న్యాయవాది అభిప్రాయపడ్డారు.

అయితే బాధిత కుటుంబాల కోణంలో చూస్తే ఈ తీర్పులు న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతున్నాయని ముజఫర్‌నగర్‌కు చెందిన జైలు హక్కుల కార్యకర్త నాదిర్ రానా పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగిన భావన కలుగుతోందని ఆయన అన్నారు.

అయితే సెషన్స్ కోర్టు విధించిన మరణశిక్ష తుది తీర్పు కాదు.. బీఎన్ ఎస్ లోని సెక్షన్ 407(1) ప్రకారం సెషన్స్ కోర్టు విధించే ప్రతి మరణశిక్షను హైకోర్టు ధ్రువీకరణ కోసం పంపాలి. హైకోర్టు ఆమోదం లేకుండా ఆ శిక్షను అమలు చేయడం సాధ్యం కాదు.

జ్ఞానవాపి కేసుతో జాతీయ స్థాయిలో గుర్తింపు

జడ్జి రవి కుమార్ దివాకర్ పేరు దేశవ్యాప్తంగా వినిపించడానికి ప్రధాన కారణం 2022లోని జ్ఞానవాపి కేసు. వారణాసిలో సివిల్ జడ్జిగా పనిచేస్తున్న సమయంలో జ్ఞానవాపి మసీదు సముదాయంలో వీడియో చిత్రీకరణతో కూడిన సర్వే నిర్వహించేందుకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. శృంగార్ గౌరీ స్థలంలో పూజకు అనుమతి కోరుతూ ఐదుగురు హిందూ మహిళలు దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి.

2022 మే 16న జరిగిన సర్వే సందర్భంగా వుజూఖానాలో ఒక స్థూపాకార వస్తువు కనిపించింది. హిందూ పిటిషనర్లు దానిని శివలింగంగా పేర్కొనగా ముస్లిం పక్షం ఆ వాదనను వ్యతిరేకించింది. అనంతరం ఆ ప్రాంతాన్ని సీల్ చేశారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు వారణాసి జిల్లా జడ్జికి బదిలీ చేసింది.

జ్ఞానవాపి కేసు నేపథ్యంలో దివాకర్‌కు బెదిరింపులు వచ్చినట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి. 2022లో ఇస్లామిక్ ఆగాజ్ మూవ్‌మెంట్ పేరుతో చేతిరాతలో బెదిరింపు లేఖ వచ్చినట్లు ఆయన పోలీసులకు తెలిపారు. 2025లో చిత్రకూట్‌లో పనిచేస్తున్న సమయంలోనూ తన నివాస భద్రతను పెంచాలని కోరారు.

యోగి వ్యాఖ్యలతోనూ వివాదం

2024లో బరేలీలో అదనపు సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్న సమయంలోనూ దివాకర్ పేరు వివాదంలోకి వచ్చింది. 2010 బరేలీ అల్లర్లకు సంబంధించిన కేసులో మౌలానా తౌకీర్ రజా ఖాన్‌ను సమన్లు జారీ చేస్తూ ఇచ్చిన ఆదేశాల్లో అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ఆయన ప్రశంసాత్మక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న మతపరమైన వ్యక్తి మంచి ఫలితాలు ఇస్తారని పేర్కొంటూ యోగిని ప్లేటో చెప్పిన ‘ఫిలాసఫర్ కింగ్’ భావనకు ఉదాహరణగా అభివర్ణించారు. అయితే ఈ వ్యాఖ్యలను అలహాబాద్ హైకోర్టు తర్వాత తొలగించింది. రాజకీయ ఛాయలున్న అవసరం లేని వ్యాఖ్యలుగా వాటిని హైకోర్టు పేర్కొంది.

ప్రస్తుతం ముజఫర్‌నగర్‌లో వరుసగా వెలువడుతున్న మరణశిక్ష తీర్పులతో రవి కుమార్ దివాకర్ మరోసారి జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఒకవైపు తీవ్రమైన నేరాలకు కఠిన శిక్షలు అవసరమనే వాదన వినిపిస్తుండగా.. మరోవైపు మరణశిక్ష విధించే విషయంలో ‘రేరిస్ట్ ఆఫ్ రేర్’ ప్రమాణాలను అత్యంత జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తుది నిర్ణయం మాత్రం సంబంధిత కేసుల్లో హైకోర్టు ధ్రువీకరణ ప్రక్రియపైనే ఆధారపడి ఉంటుంది.