Begin typing your search above and press return to search.

రూ.10 లక్షల విలువ చేసే బంగారం చోరీ.. గోల్డ్ షాప్ లో అసలు దొంగ ఎవరో తెలిస్తే షాక్!

కర్ణాటకలోని తుమకూరులోని ఓ ప్రముఖ బంగారు దుకాణంలో రోజువారీగా ఆభరణాలు మాయమవుతుండటంతో యజమాని తీవ్ర కలవరానికి గురయ్యాడు.

By:  Madhu Reddy   |   31 July 2026 1:22 PM IST
రూ.10 లక్షల విలువ చేసే బంగారం చోరీ.. గోల్డ్ షాప్ లో అసలు దొంగ ఎవరో తెలిస్తే షాక్!
X

కర్ణాటకలోని తుమకూరులోని ఓ ప్రముఖ బంగారు దుకాణంలో రోజువారీగా ఆభరణాలు మాయమవుతుండటంతో యజమాని తీవ్ర కలవరానికి గురయ్యాడు. షాపు తాళాలు సరిగ్గానే ఉన్నా నగలు మాయం కావడంపై అనుమానంతో సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా అసలు దొంగ ఎవరో తెలిసి షాకయ్యాడు. ఓ ఎలుక నగలను దొంగిలించి కలుగులో దాచుకున్న ఈ విచిత్ర ఘటనకు సంబంధించిన ఆసక్తికర విషయాలు చూద్దాం ..

మాయమవుతున్న ఆభరణాలు:

దుకాణం యజమాని ప్రతిరోజూ రాత్రివేళ యథాతథంగా తాళాలు వేసి ఇంటికి వెళ్లేవాడు. ఉదయాన్నే వచ్చి చూసేసరికి షాపులో ఉన్న నగలు కొద్దికొద్దిగా మాయమవుతుండేవి. తలుపులు తీసిన దాఖలాలు లేవు, దొంగతనం జరిగిన ఆధారాలూ లేవు. దీంతో మొదట పని చేసే సిబ్బందిపైనే అనుమానం వచ్చి యజమాని నిఘా పెట్టాడు.ఇక అప్పటికే షాపు నుంచి దాదాపు 10 బంగారు ఉంగరాలు, 3 గొలుసులు మాయమయ్యాయి. రోజురోజుకూ నష్టపోతుండటంతో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని యజమాని తలపట్టుకున్నాడు.

సీసీటీవీ ఫుటేజీతో అసలు నిజం:

విషయాన్ని తేల్చడానికి పోలీసులకు చెప్పాలి అనుకున్నాడు. ఇంతలో విషయం కనుక్కోటానికి వెంటనే షాపులోని సీసీటీవీ కెమెరా విజ్యువల్స్ చెక్ చేశాడు. అప్పుడే ఆయనకు అసలు దొంగ ప్రత్యక్షమయ్యాడు. ఓ ఎలుక మెల్లిగా బయటకు వచ్చి, ఒక్కో ఉంగరాన్ని, ఒక్కో చైన్‌ను నోటితో కరుచుకుని తన కలుగులోకి తీసుకెళ్తున్న దృశ్యాలు కెమెరాలో స్పష్టంగా కనిపించాయి.

కలుగులో లభ్యమైన ఖరీదైన నగలు:

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా యజమాని వెంటనే ఎలుక ఉన్న కలుగు దగ్గరకు వెళ్లి దాన్ని తవ్వి చూశాడు. అందులో ఉంగరాలు, గొలుసులతో పాటు ఒక అత్యంత విలువైన వజ్రాభరణం కూడా బయటపడింది. లభ్యమైన ఆభరణాల మొత్తం విలువ దాదాపు రూ. 10 లక్షలు ఉంటుందని యజమాని తెలిపారు.

నెట్టింట వైరల్ అవుతున్న వీడియో:

మనుషులు దొంగతనాలు చేయడం సాధారణమే కానీ, ఏకంగా రూ. 10 లక్షల విలువైన బంగారాన్ని ఎలుక దొంగిలించి దాచుకోవడం చూసి అంతా విస్తుపోతున్నారు. ఇక ప్రస్తుతం ఈ సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్న యజమాని, సీసీటీవీ చూడటంతో సమయానికి నిజం బయటపడి రూ. 10 లక్షల సొత్తు దక్కింది. ఇక దొంగతనం చేయడానికి మనుషులే కాదు, సమయం దొరికితే ఎలుకలు కూడా తక్కువ తినలేదని ఈ ఘటన నిరూపించింది.