పుచ్చకాయ తిని ఫ్యామిలీ మృతి.. ఫోరెన్సిక్ టెస్టుల్లో విస్తుపోయే నిజాలు..
గతవారం అందరినీ ఆశ్చర్యపరిచి, ఆలోచింపజేసిన విషయం ఒక కుటుంబం మృతి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు బిర్యానీ తిని , ఆ తర్వాత పుచ్చకాయ తిన్నారు.
By: Madhu Reddy | 8 May 2026 9:48 AM ISTగతవారం అందరినీ ఆశ్చర్యపరిచి, ఆలోచింపజేసిన విషయం ఒక కుటుంబం మృతి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు బిర్యానీ తిని , ఆ తర్వాత పుచ్చకాయ తిన్నారు. దీంతో ఫుడ్ పాయిజనింగ్ అయ్యింది. ఫలితంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఒక్క న్యూస్ తో బిర్యాని తిన్నాక పుచ్చకాయ తినడంపై పలు చర్చలు మొదలయ్యాయి.. ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు ఈ ఘటనతో కొన్ని ప్రాంతాలలో పుచ్చకాయ ధరలు కూడా భారీగా పడిపోయాయని నివేదికలు కూడా పేర్కొంటున్నాయి. అయితే ఆ కుటుంబ మరణానికి అసలు కారణం బిర్యాని తిన్నాక పుచ్చకాయ తినడం కాదు అని, ఫోరెన్సిక్ టెస్టుల్లో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా వారిపై విషప్రయోగం జరిగిందనే వార్త ఇప్పుడు కలకలం రేపుతోంది.
అసలు విషయంలోకెళితే.. ముంబైలో మొబైల్ యాక్సెసరీస్ దుకాణం నడిపే 45 సంవత్సరాలు అబ్దుల్లా డొకాడియా ఆయన భార్య , వారి ఇద్దరి అమ్మాయిలు శనివారం రాత్రి బంధువులతో కలిసి మొత్తం తొమ్మిది మంది మటన్ బిర్యానీ తిన్నారు. కొద్దిసేపటికి బంధువులు వెళ్లిపోయిన తర్వాత..ఆ కుటుంబం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పుచ్చకాయ తిన్నారు. ఉదయం ఐదు గంటలకల్లా వారంతా అస్వస్థతకు గురవడమే కాకుండా వాంతులు ,విరోచనాలు అయి.. ఫుడ్ పాయిజనింగ్ అయిన కొద్దిసేపటికే మరణించారు. ఇక ఈ విషయం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది
ఇక దీంతో బిర్యాని తిన్న వెంటనే పుచ్చకాయ తిన్నారని.. ఆరోగ్యానికి ఇది హానికరమని, పలు రకాల కథనాలు కూడా సోషల్ మీడియాలో వెలుపడ్డాయి.
అంతేకాదు బిర్యాని వంటి హెవీ ఆహార పదార్థాలను తిన్న తర్వాత నీటి శాతం ఎక్కువగా ఉండే వాటర్ మిలన్.. అందులోనూ రాత్రి సమయంలో తినకూడదు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వెలువడ్డాయి. అయితే తాజాగా వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపించగా అక్కడ మృతదేహాలకు నిర్వహించిన పోస్టుమార్టంలో ఫుడ్ పాయిజనింగ్ కంటే పెద్ద కారణం బయటపడింది. ఫోరెన్సిక్ టెస్టుల్లో ఎవరు ఊహించని నిజాలు బయటపడ్డాయని అధికారులు స్పష్టం చేశారు.
ముఖ్యంగా ఫోరెన్సిక్ పరీక్ష నివేదికల ప్రకారం.. ఈ నలుగురు ప్రాణాంతకమైన ఎలుకల మందు కారణంగా మరణించారట. అంటే ఈ బాధితులు తిన్న పుచ్చకాయలో ఎలుకల విషంలో వాడే విషపూరిత రసాయనం ఉందని పరీక్షల్లో తేలింది. ముఖ్యంగా బాధితుల మెదడు, గుండె , పేగులతో పాటు కొన్ని అవయవాలు ఆకుపచ్చగా మారినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే వారి శరీరాలలో జింక్ ఫాస్ఫేట్ ఉండడం వల్లే.. తక్కువ సమయంలోనే వారు మరణానికి కారణం అయ్యింది అని వైద్యులు తెలిపారు.
అయితే ఈ రసాయనం ప్రమాదవశాత్తు పుచ్చకాయలోకి చేరిందా? లేక ఉద్దేశపూర్వకంగానే ఎవరైనా చేర్చారా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా మరణాలు సంభవించిన వెంటనే కేసు నమోదు చేయగా ఫోరెన్సిక్ నివేదికలు ఈ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీనిపై ఇంకెన్ని నిజాలు బయటకు వస్తాయో చూడాలి. అయితే ఈ విషయం విన్న నెటిజన్స్ మాత్రం ఆహార పదార్థాలపై ముఖ్యంగా పండ్లపై రసాయనాలు అధికంగా వాడడం వల్లే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుని ఉండవచ్చు అనే కోణంలో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనా ఈ సంఘటన ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది.
