హైదరాబాద్ లో ఆ జడ్జిగారి పెద్ద మనసు..అంబులెన్సు వద్దే విచారణ
అవును.. ఒక అరుదైన సన్నివేశానికి సాక్ష్యంగా నిలిచింది హైదరాబాద్ లోని ఒక కోర్టు ప్రాంగణం.
By: Garuda Media | 14 Sept 2025 9:19 AM ISTఅవును.. ఒక అరుదైన సన్నివేశానికి సాక్ష్యంగా నిలిచింది హైదరాబాద్ లోని ఒక కోర్టు ప్రాంగణం. బాధితుడు అంబులెన్సులో ఉండటం.. కోర్టు వద్దకు రాలేని పరిస్థితుల్లో ఉన్న విషయాన్ని తెలుసుకున్న జడ్జి.. చొరవ తీసుకొని అంబులెన్సు వద్దకు తానే స్వయంగా వెళ్లి విచారణ జరపటమే కాదు.. తగిన ఆదేశాలు జారీ చేసిన ఉదంతం చోటు చేసుకుంది. న్యాయసేవా సమితి ఆధ్వర్యంలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా ఈ పరిస్థితి చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..
ములుగు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ఫర్టిలైజర్ షాపులో గుమస్తాగా పని చేస్తుంటారు ఆయన భార్య రైతు కూలీగా పని చేస్తుంటారు. వీరికి ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు దీక్షిత్ బాచుపల్లిలో ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. 2023 ఆగస్టు 12న తన ఫ్రెండ్స్ తో కలిసి అనంతగిరి హిల్స్ కు టూర్ గా వెళ్లాడు అద్దె కారులో. దారి మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దీక్షిత్ తలకు తీవ్రగాయమైంది. దీంతో అతడి శరీరం చచ్చుపడింది.
తమ స్థోమతకు మించి కొడుకు ఆరోగ్యం బాగోవాలన్న ఉద్దేశంతో అప్పు చేసి మరీ రూ.60 లక్షలు వరకు ఖర్చు చేసి చికిత్స చేయించారు. బాధితుడికి రూ.1.50 కోట్ల పరిహారంఇవ్వాలంటూ గో డిజిట్ బీమా సంస్థపై కేసు వేశారు. తాజాగా జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో ఈ కేసు విచారణకు వచ్చింది. బాధితుడి ఆరోగ్యం గురించి తెలుసుకున్న న్యాయ సేవా సమితి ఛైర్ పర్సన్, 12వ అదనపు చీఫ్ జడ్జి షౌకత్ జహాన్ సిద్ధిఖీ నేరుగా బాధితుడు ఉన్న అంబులెన్సు వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. విచారణ జరిపారు. ఈ సందర్భంగా నెల వ్యవధిలో రూ.కోటి పరిహారం చెల్లించాలని.. ఆ మొత్తాన్ని బాధితుడి ఖాతాలో జమ చేయాలని బీమా సంస్థను ఆదేశించారు. అందుకు సదరు సంస్థ అంగీకరించారు.
మరో కేసు విచారణ సందర్భంగా ఇంకో న్యాయమూర్తి వాట్సప్ ద్వారా కేసు విచారణను పూర్తి చేసి పరిష్కరించటం ఆసక్తికరంగామారింది. దీనికి నిజామాబాద్ కోర్టులో జరిగిన లోక్ అదాలత్ వేదికైంది. న్యాయస్థానంలో విచారణలో ఉన్న ఒక కేసుకు సంబంధించి ఇరు వర్గాలు రాజీకి వచ్చాయి. లోక్ అదాలత్ లో భాగంగా కేసు రాజీకి ఫిర్యాదుదారు ఒప్పుకున్నట్లుగా నిందితుడు నిజామాబాద్ జిల్లా మొదటి అదనపు కోర్టు మేజిస్ట్రేట్ కుష్బూ ఉపాధ్యాయకు విన్నవించారు.
అందుకు స్పందించిన ఆమె.. పోలీసు అధికారుల సహకారంతో వాట్సప్ ద్వారా ఫిర్యాదుదారుతో మాట్లాడారు. తాను దూర ప్రాంతంలో ఉన్నకారణంగా హాజరు కాలేకపోయానని.. ఈ కేసుకు సంబంధించి తనకు రాజీ సమ్మతమేనని జడ్జికి తెలిపారు. దీంతో స్పందించిన న్యాయమూర్తి కేసును పరిష్కరిస్తున్నట్లుగా పేర్కొన్నారు. వాట్సప్ ద్వారా కేసును పరిష్కరించిన తీరు అందరూ మాట్లాడుకునేలా చేసింది. శనివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా అన్ని కోర్టుల్లో కలిపి 11.06 లక్షల కేసులు పరిష్కారం కావటం గమనార్హం.
