వెండి నాణెం.. కొబ్బరి పరిమళం.. ప్రపంచంలోనే వింతైన కాయిన్ అమలాపురంలో..
అలాంటి అరుదైన నాణెం ఇప్పుడు అమలాపురం వాసి పుత్సా కృష్ణ కామేశ్వర్ నాణేల సేకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
By: A.N.Kumar | 4 Sept 2026 5:00 PM ISTసాధారణంగా నాణెం అంటే చేతిలో పట్టుకుని విలువ చూసుకుంటాం. అరుదైన నాణేలు అయితే వాటి చరిత్ర, తయారీ, లోహం, డిజైన్ ఆధారంగా సేకరణదారులను ఆకట్టుకుంటాయి. కానీ రుద్దితే సువాసన వెదజల్లే నాణెం అంటే మాత్రం ఆశ్చర్యమే. అలాంటి అరుదైన నాణెం ఇప్పుడు అమలాపురం వాసి పుత్సా కృష్ణ కామేశ్వర్ నాణేల సేకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నాణెం మాత్రమే కాదు.. ఓ అనుభూతి..
పుత్సా కృష్ణ కామేశ్వర్ నాణేల సేకరణలో 2009లో పలావు దేశం విడుదల చేసిన ‘సెంట్ ఆఫ్ ప్యారడైజ్’ అనే ప్రత్యేక నాణెం చేరింది. సాధారణంగా నాణేలను చూసి వాటి ప్రత్యేకతను గుర్తిస్తాం. కానీ ఈ నాణెం విషయంలో మాత్రం చూడటంతో పాటు వాసనను కూడా ఆస్వాదించొచ్చు. నాణెంపై స్వల్పంగా రుద్దితే కొబ్బరి సువాసన వెలువడుతుంది. ఇదే ఈ నాణెం ప్రత్యేకత. నాణేల ప్రపంచంలో ఇలాంటి సువాసనతో కూడిన నాణేలు చాలా అరుదుగా కనిపిస్తాయి.
వెండి నాణెంలో సముద్రతీర అందాలు
ఈ నాణెం 25 గ్రాముల 0.925 స్వచ్ఛమైన వెండితో తయారు చేశారు. దీనిపై పలావు దేశానికి సంబంధించిన సముద్రతీర వాతావరణాన్ని ప్రతిబింబించేలా డిజైన్ రూపొందించారు. నాణెంపై సముద్ర తీరం, కొబ్బరి చెట్లు, నౌక వంటి చిత్రాలు కనిపిస్తాయి. పలావు వంటి ద్వీప దేశం ప్రకృతి, సముద్ర జీవనశైలిని ఈ డిజైన్ ప్రతిబింబించేలా ఉంటుంది.
రుద్దితే సువాసన ఎలా వస్తుంది?
ఈ నాణెం తయారీలో ఉపయోగించిన మైక్రో-సెంట్ టెక్నాలజీనే అసలు విశేషం. నాణెం ఉపరితలంపై ప్రత్యేక పద్ధతిలో సువాసనను అందించే సాంకేతికతను ఉపయోగించారు. నాణేన్ని రుద్దినప్పుడు ఆ సువాసన విడుదలవుతుంది. అంటే ఒకవైపు ఇది విలువైన వెండి నాణెం కాగా.. మరోవైపు ప్రత్యేక సాంకేతికతను ఉపయోగించిన సువాసన నాణెం అన్నమాట.
రూ.5 డాలర్లు.. కానీ విలువ అంతకంటే ఎక్కువ
ఈ నాణెం ముఖ విలువ 5 డాలర్లు. అయితే నాణేల సేకరణదారులకు ఇలాంటి నాణేల అసలు విలువ కేవలం వాటిపై ముద్రించిన మొత్తంలో ఉండదు. వాటి అరుదైన రూపకల్పన, తయారీ సాంకేతికత, విడుదలైన సంవత్సరం.. పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉండటం వంటి అంశాలు వాటి సేకరణ విలువను నిర్ణయిస్తాయి. అందుకే కృష్ణ కామేశ్వర్ వంటి నాణేల సేకరణదారుల వద్ద ఇలాంటి ప్రత్యేక నాణేలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది.
అమలాపురం నుంచి అరుదైన నాణేల ప్రపంచానికి..
నాణేల సేకరణ అనేది కేవలం పాత నాణేలను దాచుకోవడం కాదు. ఒక్కో నాణెం వెనుక ఒక దేశం, ఒక కాలం, ఒక సంస్కృతి, ఒక సాంకేతికత దాగి ఉంటుంది. అలాంటి అరుదైన నాణేలను వెతికి సేకరించడం ద్వారా వాటి విశేషాలను భవిష్యత్ తరాలకు అందించే అవకాశం ఉంటుంది.
అమలాపురం వాసి కృష్ణ కామేశ్వర్ సేకరణలోని ఈ ‘సెంట్ ఆఫ్ ప్యారడైజ్’ మాత్రం మరో అడుగు ముందుకేసి.. నాణెం విలువను కళ్లతోనే కాదు.. ముక్కుతోనూ తెలుసుకునేలా చేస్తోంది.
