క్రూరత్వం- హింస: 'రాప్తాడు ఘటన' కు సినిమాలనే నిందించడం సరైనదేనా?
కొంతమంది ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఈ క్రూరమైన ఘటనపై స్పందిస్తూ సినిమాలే ఈ నేరానికి కారణమని నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు.
By: Sivaji Kontham | 1 Nov 2026 10:44 AM ISTఅనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన దారుణ ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై క్లాస్‌రూమ్‌లోనే ఎలక్ట్రిక్ రంపంతో ఓ వ్యక్తి జరిపిన దాడి యావత్ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ అమానుష ఘటనలో బాధితురాలిని కాపాడబోయిన మరో విద్యార్థిని కూడా తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్న బాధితురాలి పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుండగా..ఈ ఘటన తర్వాత సమాజంలో తీవ్రమైన చర్చ మొదలైంది.
ఈ దారుణం వెలుగులోకి వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో సినిమాల్లో పెరుగుతున్న హింసపై పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. తెరపై ప్రదర్శించే హింసాత్మక దృశ్యాలు.. యువత ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయా? సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో హింసను గ్లామరైజ్ చేయడం సరైనదేనా? అనే ప్రశ్నలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఇటీవలి కాలంలో భారతీయ భాషల్లోని పలు చిత్ర పరిశ్రమల్లో హింసాత్మక సన్నివేశాలు శృతిమించుతున్న మాట వాస్తవమే అయినా.. కేవలం దీనివల్లనే ఇలాంటి నేరాలు జరుగుతున్నాయా? అనే కోణంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొంతమంది ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఈ క్రూరమైన ఘటనపై స్పందిస్తూ సినిమాలే ఈ నేరానికి కారణమని నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. సినిమాల్లోని నేర ప్రవృత్తిని చూసే ఆ టీనేజీ యువకుడు ఇలా ప్రవర్తించాడని ఆరోపిస్తున్నారు. అయితే సమాజంలో ఏ ఉత్పాతం సంభవించినా దానికి కేవలం సినిమా వాళ్లే బాధ్యత వహించాలని ఒకే వైపు తోసేయడం ఎంతమాత్రం సమంజసం కాదు. సినిమాలు సమాజంపై కొంత ప్రభావాన్ని చూపవచ్చు కానీ.. వాటిని మాత్రమే ఏకైక కారణంగా నిర్ధారించడం శాస్త్రీయంగానూ, తార్కికంగానూ సరైనది కాదు.
ఈ ఘటనకు సంబంధించి నిందితుడి వ్యక్తిగత కారణాలు, ఆలోచనా విధానం, మానసిక పరిణతి, కుటుంబ నేపథ్యం .. అతని చుట్టూ ఉన్న వాతావరణం వంటి ఎన్నో అంశాలపై లోతైన విచారణ జరగాలి. ఒక నేరానికి అసలు కారణాలు ఏమిటో లోతుగా పరిశోధించకుండా సినిమాలను మాత్రమే నిందించడం ఎంత తప్పో, అలాగే సినిమాల ప్రభావంపై అసలు చర్చే అవసరం లేదనడం కూడా అంతే తప్పు. ఒక ఘటనా క్రమాన్ని కేవలం ఒకే కోణంలో చూడటం వల్ల అసలు సమస్య పరిష్కారం కాదు.
సినిమాల్లో హింసను విమర్శించడానికి ఈ ఘటనను ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు తప్ప.. ఇదే మూలకారణమని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. సినిమాల ప్రభావంపై చర్చ జరిగేటప్పుడే.. సమాజంలో పెరుగుతున్న హింస, విద్యార్థినుల భద్రత, ఇలాంటి దాడులను ముందుగానే అడ్డుకునే వ్యవస్థల పటిష్టతపై కూడా సమగ్రంగా చర్చించాలి. ఏ ఒక్క అంశానికో పరిమితం కాకుండా.. విభిన్న కోణాలను బేరీజు వేసుకుంటూ సమగ్ర దృక్పథంతో సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు పడాలి. రాప్తాడు ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా సమాజం, పోలీస్ వ్యవస్థ కూడా మరింత కట్టుదిట్టంగా మారాల్సి ఉంటుంది.
