ర్యాపిడో ‘Ownly’ షురూ.. ఫుడ్ డెలివరీలో కొత్త విప్లవం
అప్పటికే విజయవంతమైన బిజినెస్ మోడల్ ను అనుసరిస్తూ ఆ రంగంలోకి వచ్చే వారికి ఒక పెద్ద తలనొప్పి ఉంటుంది.
By: Garuda Media | 4 March 2026 10:39 AM ISTఅప్పటికే విజయవంతమైన బిజినెస్ మోడల్ ను అనుసరిస్తూ ఆ రంగంలోకి వచ్చే వారికి ఒక పెద్ద తలనొప్పి ఉంటుంది. అప్పటికే ఆ రంగంలో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించే వారితో పోటీ పడటం అంత తేలికైన విషయం కాదు. ఈ విషయాన్ని తన వినూత్న ప్లానింగ్ తో ఎంట్రీ ఇవ్వటమే కాదు.. సక్సెస్ కావటం.. అంతకు ముందున్న వారిని సైతం అధిగమించేలా చేయటం మామూలు విషయం కాదు. ఊబర్.. ఓలాకు పోటీగా రంగంలోకి దిగిన ర్యాపిడో.. అప్పటికే ఆ రంగంలో ఉన్న గేమ్ రూల్స్ ను ఇట్టే మార్చేయటం తెలిసిందే. ఇప్పుడు అదే ర్యాపిడో ఫుడ్ డెలివరీ మీద ఫోకస్ చేసింది. ఇప్పటికే ఆ రంగంలో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించే జొమాటో.. స్విగ్గీ లకు పోటీగా Ownly (ఓన్ లీ) పేరుతో ఫుడ్ డెలివరీని స్టార్ట్ చేసింది.
మరి.. దీని ప్రత్యేకత ఏమిటి అంటే.. అత్యంత తక్కువ ధరలకే కోరుకున్న ఫుడ్ ను రెస్టారెంట్ల నుంచి డెలివరీ చేయటం దీని ప్రత్యేకత. ఇప్పటివరకు ఫుడ్ డెలివరీ యాప్ లైన స్విగ్గీ.. జొమాటో విషయానికి వస్తే.. ఇవి సదరు రెస్టారెంట్ల నుంచి కొంత కమిషన్ తీసుకోవటమే కాదు.. ఫుడ్ ఆర్డర్ చేసిన వినియోగదారుల నుంచి ఛార్జీల రూపంలో వసూలు చేయటం కనిపిస్తుంది. అయితే..ర్యాపిడో Ownly మాత్రం సరికొత్త బిజినెస్ మోడల్ ను తీసుకొచ్చింది. ఇందులో ఫ్లాట్ ఫారమ్ ఫీజులు లేకపోవటం.. ఉన్నవి చాలా తక్కువ ధరలకు ఉండటంతో.. మిగిలిన యాప్ లతో పోలిస్తే దాదాపు 15 నుంచి 20 శాతం వరకు తక్కువ ధరలకే కోరుకున్న ఆహారం లభించే వీలుందని చెబుతున్నారు.
ర్యాపిడో Ownly మోడల్ లో కీలకమైన అంశం ఏమంటే.. రెస్టారెంట్ల నుంచి భారీ కమిషన్లు వసూలు చేయకుండా.. కేవలం నిర్ణీత సబ్ స్క్రిప్షన్ తరహాలో కానీ.. అతి తక్కువ ఫీజును తీసుకొని తన సేవల్ని అందించేలా ప్లాన్ చేశారు. ఈ కొత్త మోడల్ ను టెస్టు చేసుకోవటం కోసం తొలుత బెంగళూరులో తమ సేవల్ని షురూ చేశారు. బెంగళూరులోని కోరమంగళ.. హెచ్ ఎస్ ఆర్ లే అవుట్.. బీటీఎం లేఅవుట్ లాంటి ప్రాంతాల్లో అందుబాటులో ఉండేలా చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని నగరాలకు.. ముఖ్యంగా టైర్ 1 సిటీస్ లో ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సేవల కోసం Ownly యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
జొమాటోకానీ స్విగ్గీ కానీ రెస్టారెంట్ల నుంచి 20-30 శాతం వరకు కమిషన్ వసూలు చేస్తుంటాయి. అయితే.. ర్యాపిడో Ownly మాత్రం రెస్టారరెంట్ల నుంచి ప్రతి ఆర్డర్ కు కమిషన్ తీసుకోదు. ఇప్పటివరకు స్విగ్గీ.. జొమాటో లు వసూలు చేసే కమిసన్లకు అనుగుణంగా.. డెలివరీ మెనూ ధరలు వేరుగా ఉండటంతో పాటు.. కాస్త ఎక్కువగా ఉంటాయి. ఈ అంశంపై ర్యాపిడో Ownly ఫోకస్ చేసింది. దీంతో.. మెనూ లో ధరలు మారకుండా ఉంటాయి. ప్రతి ఆర్డర్ మీద కమిషన్ తీసుకోదుకాబట్టి.. వారి మీద అదనపు భారం పడదు. దీంతో.. రెస్టారెంట్ లో ఏ ధరలకు అయితే అమ్ముతారో.. అదే ధరలకు ఆన్ లైన్ వినియోగదారులకు అమ్మే వీలు ఉంటుంది.దీంతో.. ఛార్జీల భారం పడదు.
ఇప్పటివరకు ఉన్నయాప్ లలో వాతావరణ పరిస్థితులు.. డిమాండ్ కు అనుగుణంగా డెలివరీ ఛార్జీలు పెరగటం లాంటివి ఉంటాయి. ఇందులో మాత్రం ఛార్జీలు స్థిరంగా ఉంటాయి. రూ.వంద లోపు ఆర్డర్ మీద రూ.20, అదే రూ.100 నుంచి రూ.400 లోపు ఆర్డర్ల మీద రూ.25, రూ.400 పైన ఆర్డర్ మీద రూ.50 చొప్పున డెలివరీ ఛార్జీలు వసూలు చేస్తారు. ఏ టైంలో అయినా.. ఒకే తరహా ఛార్జీలు వసూలు చేయటం వల్ల వినియోగదారుల మీద భారం అన్నది లేకుండా పోతుంది. చాలా యాప్ లలో ప్లాట్ ఫారమ్ ఫీజు.. ప్యాకేజింగ్ ఫీజు లాంటివి వేస్తారు. ఇందులో అలాంటివేమీ లేకుండా జాగ్రత్తలు తీసుకోవటం గమనార్హం.
Ownly యాప్ ఫోకస్ మొత్తం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండటం.. రూ.150 కంటే తక్కువ ధరకు లభించే మీల్ మీదనే ఫోకస్ పెడుతుంది. దీంతో.. సామాన్యులు మాత్రమే కాదు స్టూడెంట్లు.. మిడిల్ క్లాస్ వారికి అనుకూలంగా మారుతుంది. అన్ని బాగున్నాయి కానీ.. ఎలాంటి నెగిటివ్ పాయింట్లు లేవా? అంటే కొన్ని ఉన్నాయనే చెప్పాలి. కొత్త యాప్ కావటంతో.. డెలివరీ సమస్యలు కొన్ని ఉన్నాయి.
అంతేకాకుండా ఈ ప్లాట్ ఫాంతో పెద్ద ఎత్తున రెస్టారెంట్లు భాగస్వాములుకాలేదు. కాలం ఈ తరహా గ్యాప్ ను పూడుస్తుంది. అదే సమయంలో కస్టమర్ సపోర్టు టీం అంచనాలకు తగ్గట్లు లేదన్న విమర్శ ఉంది. అయితే.. కొత్తగా మార్కెట్ లోకి వచ్చినప్పుడు ఈ తరహా సమస్యలు మామూలే. కొద్ది నెలల్లో వీటిని అధిగమించే వీలుందన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ యాప్ లో 20 వేల రెస్టారెంట్లు ఉన్నాయి.
రెస్టారెంట్ల సంఖ్య ఎంత భారీగా పెరిగితే.. అన్ని ఆప్షన్లు వినియోగదారులకు ఉంటాయి.దీనికి తోడు డెలివరీలో వేగం పెంచటంతో పాటు.. కస్టమర్ కేర్ ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ అంశం మీద ప్రత్యేక ఫోకస్ చేయాల్సి అవసరం ఉంది. బెంగళూరు తర్వాత ఢిల్లీ.. ముంబయిలో ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. జీరో కమిషన్ మోడల్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ యాప్.. బడ్జెట్ ధరల్లో భోజనం అందించేలా ప్లాన్ చేసిన వైనం ఆకర్షిస్తోంది. మొత్తంగా ఫుడ్ డెలివరీ యాప్ బిజినెస్ గేమ్ రూల్స్ ను Ownly యాప్ మార్చేస్తుందన్న మాట బలంగా వినిపిస్తోంది.
