Begin typing your search above and press return to search.

టాక్సీ ప్రయాణాల్లోనూ ఇన్సూరెన్స్ ఆప్షన్.. ప్రభుత్వం స్పందిస్తుందా?

ర్యాపిడో ప్రయాణంలో జరిగిన ఈ ఘటనతో, రైడ్ షేరింగ్ యాప్‌లలో కచ్చితమైన ఇన్సూరెన్స్ సదుపాయం ఉండాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

By:  Madhu Reddy   |   7 Aug 2026 1:05 PM IST
టాక్సీ ప్రయాణాల్లోనూ ఇన్సూరెన్స్ ఆప్షన్.. ప్రభుత్వం స్పందిస్తుందా?
X

రోజూ ఆఫీసులకు, సొంత పనులకు క్యాబ్‌లు, బైక్ టాక్సీలపై వెళ్లేవారి సంఖ్య బాగా పెరిగింది. అయితే ఈ ప్రయాణాలు ఎంతవరకు సురక్షితం అనే ప్రశ్న మళ్లీ మొదలైంది. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ సాని కృష్ణకు ఎదురైన ఘోర ప్రమాదం, ఆ తర్వాత ఆమె పడిన వేదన ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. ర్యాపిడో ప్రయాణంలో జరిగిన ఈ ఘటనతో, రైడ్ షేరింగ్ యాప్‌లలో కచ్చితమైన ఇన్సూరెన్స్ సదుపాయం ఉండాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

కలవరపెడుతున్న ఘోర ప్రమాదం:

కేరళకు చెందిన సాని కృష్ణ బెంగళూరులో ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. జూన్ 17న ఆమె బైరాసంద్ర నుంచి డొమ్లూర్ ఆఫీస్‌కు వెళ్లడానికి ర్యాపిడో బైక్ టాక్సీ బుక్ చేసుకున్నారు. మార్గమధ్యలో రైడర్ తీవ్ర నిర్లక్ష్యంతో ట్రాక్టర్‌ను ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించడంతో బైక్ అదుపుతప్పింది. ఈ ఘోర ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు.

ఆస్పత్రి బిల్లులు.. కోలుకోలేని దెబ్బ:

ఈ ప్రమాదంలో సాని కృష్ణ తొమ్మిది పక్కటెముకలు విరగడం, భుజం దెబ్బతినడం, ఊపిరితిత్తులు పాడవడం వంటి తీవ్ర గాయాలకు గురయ్యారు. అత్యవసర పరిస్థితిలో ఆమె ప్లీహం తొలగించాల్సి వచ్చింది. ఇక ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేశారు. బెంగళూరు, కేరళలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందేసరికి దాదాపు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఖర్చయింది.

కంపెనీ వైఖరిపై తీవ్ర నిరసన:

మహిళల భద్రత అని ప్రచారం చేసుకునే సంస్థ, ప్రమాదం జరిగిన తర్వాత తనను పూర్తిగా వదిలేసిందని సాని సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రూ. 1 లక్ష ఇన్సూరెన్స్ ఇచ్చి చేతులు దులుపుకుందని, పెద్ద మొత్తంలో ఆసుపత్రి బిల్లులు తామే భరించాల్సి వచ్చిందని తెలిపారు. ఇక న్యాయం కోసం ఆమె కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించడానికి సిద్ధమయ్యారు.

ఇన్సూరెన్స్ ఆప్షన్ కచ్చితం కావాలి:

మనం బస్సు లేదా రైలు టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు స్వల్ప రుసుముతో ఇన్సూరెన్స్ ఆప్షన్ ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ నిత్యం వేలాది మంది ప్రయాణించే క్యాబ్‌లు, బైక్ టాక్సీలలో అలాంటి బలమైన భద్రతా కవచం లేదు. ఇక కేవలం నామమాత్రపు బీమా కాకుండా, వైద్య ఖర్చులు పూర్తిగా కవర్ అయ్యేలా సమగ్ర ఇన్సూరెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

రైడ్ షేరింగ్ కంపెనీలు కేవలం లాభాలు, ప్రచారాలపైనే కాకుండా ప్రయాణికుల ప్రాణాలకు బాధ్యత వహించాలి. ఈ దిశగా ప్రభుత్వం తక్షణమే స్పందించి, టాక్సీ ప్రయాణాల్లో కచ్చితమైన ఇన్సూరెన్స్ ఆప్షన్‌ను నిబంధనగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు సరైన భరోసా లభిస్తుంది.