'రంగారెడ్డి'కి తిరుగులేదు.. ఆర్థిక వృద్ధి వేగం: డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్
దేశంలో అత్యంత వేగంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలో తెలంగాణలోని రంగారెడ్డికి చోటుదక్కింది
By: Garuda Media | 27 Aug 2026 8:00 AM ISTదేశంలో అత్యంత వేగంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలో తెలంగాణలోని రంగారెడ్డికి చోటుదక్కింది. ప్రతిష్టాత్మక సర్వే సంస్థ అయిన.. `డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్` తాజాగా విడుదల చేసిన నివేదికలో దక్షిణాది రాష్ట్రాల నుంచి రంగారెడ్డి జిల్లా మాత్రమే ఎంపిక కావడం గమనార్హం. ఈ జిల్లాకు తిరుగులేదని.. డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ నివేదిక స్పష్టం చేసింది. అంతేకాదు.. ఈ జిల్లాకు అనుకూలంగా ఉన్న అంశాలను కూడా వివరించింది. ఫ్యూచర్ సిటీ, విస్తరిస్తున్న వ్యాపారా,వాణిజ్య కార్యకలాపాలు వంటివి జిల్లాను ముందు వరుసలో నిలబెట్టాయని పేర్కొంది. ఒకప్పటికి..ఇప్పటికి రంగారెడ్డి జిల్లా రూపురేఖలు సంపూర్ణంగా మారాయని కూడా వెల్లడించడం గమనార్హం.
ఇక, దేశవ్యాప్తంగా 800 జిల్లాలపై `డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్` అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం ప్రకారం.. రాజస్థాన్‌లోని జైపుర్, మహారాష్ట్రలోని నాసిక్, గుజరాత్‌లోని సూరత్, ముర్షిదాబాద్‌తో పాటు రంగారెడ్డి జిల్లాలు ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతు న్నాయని తెలిపింది. ముఖ్యంగా ఒకప్పుడు హైదరాబాద్ అంటేనే ఇష్టపడే ప్రజలు ఇప్పుడు రంగారెడ్డిపై ఎక్కువగాదృష్టి పెట్టార ని పేర్కొనడం గమనార్హం. దీనికి రైలు, రోడ్డు కనెక్టివిటీ పెరగడంతోపాటు.. ప్రభుత్వం వేస్తున్న అడుగులు కూడా కారణమని పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య `డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్` దేశవ్యాప్తంగా చేసిన సర్వే, ప్రజలనుంచి తీసుకున్న అభిప్రా యాలను నివేదిక రూపంలో వెలువరించింది.
ఏంటీ సంస్థ ప్రత్యేకత!
దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులు రావాలన్నా.. ఒక రాష్ట్రం పరిస్థితిని తెలుసుకోవాలన్నా.. `డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్` నివేదికను ప్రామాణికంగా తీసుకుంటారు. సమగ్ర అంచనాలు.. స్థానిక పరిస్థితులను తులనాత్మకంగా అంచనా వేయడంతోపాటు.. ఎక్కడా ఎలాంటి పక్షపాతం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా నివేదికలు ఇవ్వడం డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ప్రతిష్టకు ప్రామాణికంగా మారింది. వ్యాపారాలకు వాణిజ్య డేటా, విశ్లేషణలను అందించే ప్రముఖ గ్లోబల్ సంస్థగా దీనికి పేరుంది. ఇది 1841లో ప్రారంభమైంది. 1995 నుంచి మన దేశంలో సేవలు అందిస్తోంది.
వ్యాపారాల రిస్క్ మేనేజ్‌మెంట్, క్రెడిట్ రేటింగ్, మార్కెటింగ్, సప్లై చైన్ ఆప్టిమైజేషన్, ఆర్థిక నిర్ణయాల కోసం కంపెనీలు ఈ సంస్థ సేవలను వినియోగించుకుంటున్నాయి. డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ కు గ్లోబల్ వ్యాపార సంబంధాలు, క్రెడిట్ ప్రొఫైల్, ప్రభుత్వ కాంట్రాక్టుల పొందడానికి ఉపయోగపడుతోంది. దీంతో ఈ సంస్థ ఇచ్చే నివేదికలకు అంతే ప్రాధాన్యం ఉంటుంది.
