Begin typing your search above and press return to search.

ఒకరి తర్వాత ఒకరు.. ఉరి వేసుకుని ముగ్గురు మిత్రుల ఆత్మహత్య!

ముగ్గురూ చిన్నప్పటి నుంచీ స్నేహితులు.. ముగ్గురిదీ ఒకటే గ్రామం.. పైగా హైస్కూల్లో ఆరు నుంచి పదో తరగతి వరకూ కలిసే చదువుకున్నారు.

By:  Raja Ch   |   25 Oct 2025 1:00 AM IST
ఒకరి తర్వాత ఒకరు.. ఉరి వేసుకుని ముగ్గురు మిత్రుల ఆత్మహత్య!
X

ముగ్గురూ చిన్నప్పటి నుంచీ స్నేహితులు.. ముగ్గురిదీ ఒకటే గ్రామం.. పైగా హైస్కూల్లో ఆరు నుంచి పదో తరగతి వరకూ కలిసే చదువుకున్నారు. ఇక్కడ అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే... మూడు రోజుల్లో ముగ్గురూ వేర్వేరుగా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ మిస్టరీ ఘటనలు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్‌ మండలం కోహెడ గ్రామంలో చోటు చేసుకున్నాయి.

అవును... ముగ్గురు స్నేహితులు, వరుసగా మూడు రోజుల్లో మృతి చెందారు, ముగ్గురూ ఉరి వేసుకునే బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో ఈ మరణాల విషయం మిస్టరీగా మారింది. ఆ ముగ్గురూ ఒకరి మరణాలను ఒకరు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఆత్మహత్యలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సీలింగ్‌ ఫ్యాన్‌ కు ఉరి వేసుకున్న వైష్ణవి!:

ఈ ముగ్గురు స్నేహితుల్లో ముందుగా బలవన్మరణానికి పాల్పడింది 18 ఏళ్ల గ్యారా వైష్ణవి. ఈమె కడుపు నొప్పితో బాధపడుతుండడంతో మంగళవారం సాయంత్రం ఆస్పత్రికి తీసుకెళ్లాలని తల్లిదండ్రులు భావించారు. అయితే.. స్నానం చేసి వస్తానని తల్లితో చెప్పిన వైష్ణవి బెడ్‌ రూమ్‌ లోకి వెళ్లి తలుపు వేసుకుంది. ఎంతకూ తలుపులు తెరవకపోవడంతో పగులగొట్టి చూస్తే.. సీలింగ్‌ ఫ్యాన్‌ కు ఉరి వేసుకుని కనిపించింది.

షట్టర్‌ రూమ్‌ లో ఉరేసుకున్న రాకేష్!:

మంగళవారం నాడు వైష్ణవి బలవన్మరణానికి పాల్పడగా.. ఆమె క్లాస్‌ మేట్‌ సతాలీ రాకేష్‌ బుధవారం రాత్రి 10:30 గంటలకు తన ఇంటికి సమీపాన ఉన్న షట్టర్‌ రూమ్‌ లో నిద్రించేందుకు బెడ్‌ షీట్‌ తీసుకుని వెళ్లాడు. గురువారం ఉదయం తల్లి ఊడ్చుతుండగా.. రాకేష్‌ ఉరి వేసుకుని కనిపించాడు. ఆమె కేకలు పెట్టడంతో పెద్ద కుమారుడు వెంకటేష్‌ వచ్చి తమ్ముడిని కిందకు దించి చూడగా.. అప్పటికే అతడు మరణించాడు.

ఉరేసుకొని వేలాడుతూ శ్రీజ!:

ఇదే గ్రామానికి చెందిన బుద్ధ నర్సింహ రెండో కుమార్తె శ్రీజ ది దాదాపు ఇదే కథ! గురువారం తెల్లవారుజామున 5 గంటలకు నర్సింహ విధులకు బయలుదేరే సమయానికి కుమార్తెలు నిద్రిస్తున్నారు. ఉదయం 11:45 గంటలకు దివ్యాంగురాలైన మూడో కుమార్తె నందిని వెళ్లి.. తన సోదరుడికి సైగలతో ఏదో చెప్పింది. అతడు వచ్చేసరికి గడియ పెట్టి ఉండటంతో.. తలుపులు విరగ్గొట్టి చూస్తే లోపల శ్రీజ ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది.