దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి.. తెలంగాణకే గర్వకారణం
దేశంలోకెళ్ల మన రంగారెడ్డినే తోపు అంటే నమ్మగలరా? నిజంగా ఇది నిజం.. మన రంగారెడ్డి జిల్లాను మించిన రిచెస్ట్ జిల్లా దేశంలోనే లేదంటే అతిశయోక్తి కాదు.
By: A.N.Kumar | 17 Dec 2025 11:22 PM ISTదేశంలోకెళ్ల మన రంగారెడ్డినే తోపు అంటే నమ్మగలరా? నిజంగా ఇది నిజం.. మన రంగారెడ్డి జిల్లాను మించిన రిచెస్ట్ జిల్లా దేశంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. ఇది తెలంగాణకే గర్వకారణంగా చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రానికి మరో చారిత్రక గౌరవం రంగారెడ్డి జిల్లా ద్వారా దక్కింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను దేశంలోనే అత్యధిక వ్యక్తి ఆదాయం (పర్ క్యాపిటా జీడీపీ) కలిగిన జిల్లాగా రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 800 జిల్లాల మధ్య రంగారెడ్డి జిల్లా ఈ ఘనత సాధించడం తెలంగాణ ఆర్థిక శక్తిని స్పష్టంగా చాటుతోంది.
ఈ నివేదిక ప్రకారం రంగారెడ్డి జిల్లాలో సగటు వ్యక్తి వార్షిక ఆదాయం రూ.11.46 లక్షలుగా నమోదైంది. ఈ జాబితాలో రెండో స్థానంలో గురుగ్రామ్ (హర్యానా) , ఆ తర్వాత బెంగళూరు అర్బన్, గౌతమ్ బుద్దనగర్ (నోయిడా), హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లాలు ఉన్నాయి. ఆశ్చర్యకరంగా ముంబై, అహ్మదాబాద్ లాంటి నగర జిల్లాలు ఈ జాబితాలో చాలా వెనుకబడ్డాయి.
వెనుకడిన జిల్లా నుంచి దేశంలోనే నంబర్ వన్ వరకూ..
రంగారెడ్డి జిల్లా ప్రయాణం నిజంగా ప్రేరణాత్మకం.. 2006లో దేశంలోని 250 అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ జిల్లా.. కేవలం రెండు దశాబ్ధాల్లోనే దేశంలోనే అత్యంత సంపన్న జిల్లాగా ఎదగడం విశేషం. ఇది ప్రణాళికబద్దమైన అభివృద్ధి , పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక వసతుల విస్తరణకు నిదర్శనం.
ఐటీ, ఫార్మా రంగాలే అభివృద్ధికి ఇంజిన్
హైదరాబాద్ ఐటీ కారిడార్ విస్తరణ రంగారెడ్డి జిల్లాకు ప్రధాన బలం. గచ్చిబౌలి, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల ప్రభావంతో ఐటీ, ఐటీఈఎస్, స్టార్టప్ రంగాలు వేగంగా విస్తరించాయి. బహుళజాతి కంపెనీలు, హైపేయింగ్ ఉద్యోగాలు రావడంతో జిల్లా ఆదాయ స్థాయిలు భారీగా పెరిగాయి. అదేవిధంగా దేశంలోనే అతిపెద్ద ఫార్మాస్యూటికల్ , బయోటెక్నాలజీ హబ్ లలో ఒకటిగా రంగారెడ్డి జిల్లా నిలిచింది. పరిశోధన, తయారీ, ఎగుమతుల ద్వారా పరిశ్రమలకు స్థిరత్వం వచ్చింది. ఇది దీర్ఘకాలిక బలాన్ని అందించింది.
రియల్ ఎస్టేట్ , సేవల రంగానికి ఊపు
హైదరాబాద్ నగరం పరిమితికి చేరుకోవడంతో పరిశ్రమలు, నివాస ప్రాజెక్టులు రంగారెడ్డి జిల్లాలోకి విస్తరించాయి. దీనివల్ల రియల్ ఎస్టేట్ బూమ్, సేవల రంగాల్లో డిమాండ్ పెరిగింది. ఇది ఉపాధి అవకాశాలను మరింత పెంచింది.
మౌలిక వసతుల బలం
ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) , రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి కీలక మౌళిక వసతులు పెట్టుబడిదారులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించాయి. మెరుగైన కనెక్టివిటీ గ్లోబల్ యాక్సెస్ వల్ల రంగారెడ్డి జిల్లా దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందింది.
తెలంగాణ అభివృద్ధికి ప్రతీక
ఈ విజయం కేవలం ఒక జిల్లాకే కాదు.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మోడల్ కు ప్రతీక. సరైన విధానాలు, మౌలిక వసతులు, పరిశ్రమల ప్రోత్సాహం ఉంటే వెనుకబడిన ప్రాంతాలు కూడా దేశానికి ఆదర్శంగా మారగలవని రంగారెడ్డి జిల్లా నిరూపించింది.
