ఆ లక్ష్యం కోసమే వచ్చా: రంగా కుమార్తె ఆశ
రాధా-రంగా మిత్రమండలిని ఏకం చేయడంతోపాటు.. తన తండ్రి రంగా ఆశయాలను సాధించేందుకే తాను ప్రజల్లోకి వచ్చినట్టు రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ వెల్లడించారు.
By: Garuda Media | 3 Dec 2025 8:12 PM ISTరాధా-రంగా మిత్రమండలిని ఏకం చేయడంతోపాటు.. తన తండ్రి రంగా ఆశయాలను సాధించేందుకే తాను ప్రజల్లోకి వచ్చినట్టు రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ వెల్లడించారు. బుధవారం విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. గత నెలలో తొలిసారి మీడియా ముందుకు వచ్చినప్పుడు కూడా ఆమె ఇదే మాట చెప్పారు. తాజాగా మరోసారి మీడియాతో మాట్లాడిన ఆశ మరింత వివరణ ఇచ్చారు.
రంగా మరణం తర్వాత.. అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయని.. దీంతో రాధా రంగా మిత్ర మండలి లో కొందరు..దూరమయ్యారని తెలిపారు. ఇప్పుడు వారందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి.. మిత్ర మండలి ద్వారా ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే తాను ప్రజల మధ్యకువచ్చాన న్నారు. అయితే.. రాజకీయ భవితవ్యంపై ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదని.. మిత్రమండలిలో పెద్దలను కలిసివారి సూచనలు సలహాలు తీసుకున్నాక నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు.
తన కుటుంబంలో ఎక్కడా విభేదాలు లేవన్న ఆశా కిరణ్.. అందరూ కలసి కట్టుగానే ఉన్నామని చెప్పారు. కొందరు మీడియాలో తను ఏదో పార్టీలో చేరుతున్నట్టు రాస్తున్నారని.. కానీ, దానిలో వాస్తవాలు లేవన్నారు. తనను ఎవరూ సంప్రదించలేదని, తాను కూడా ఏ పార్టీని కలుసుకోలేదని వివరణ ఇచ్చారు. ఎవరైనా చెప్పినా నమ్మవద్దన్నారు. తనరాజకీయ రంగ ప్రవేశంపై ఎలాంటి దాపరికం ఉండదన్న ఆమె.. ఈ విషయంలో ఏది ఉన్నా తప్పకుండా తెలియజేస్తానని చెప్పారు.
ఈ నెల 26న రంగా వర్ధంతిని పురస్కరించుకుని విజయవాడ నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు ఆశా కిరణ్ చెప్పారు. విజయవాడ నుంచి ఉయ్యూరు వరకు సాగే యాత్రలో వేలాది మంది రంగా అభిమా నులు పాల్గొంటున్నారని తెలిపారు. చట్టసభలో రంగా గొంతు వినిపించాలన్నది తన లక్ష్యమని.. దీనిని తానే నెరవేర్చాల్సిన అవసరం లేదని.. రంగా అభిమానులు కూడా ఆయన వారసులేనని చెప్పారు. ముందుగా.. రాధా-రంగా మిత్రమండలిని బలోపేతం చేయడంపైనే తన ఆలోచనలు ఉన్నాయని తెలిపారు.
