జీ20 సదస్సు నిర్వహించటం ఎంత కష్టమో చెప్పి నవ్వించిన దేశాధినేత
ఈ సదస్సు నిర్వహణ కోసం భారతదేశం తమకు ఎంత సాయం చేసిందన్న విషయాన్ని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసో తన మాటలతో చెప్పేశారు.
By: Garuda Media | 24 Nov 2025 10:02 AM ISTదక్షిణాఫ్రికా అతిధ్యమిస్తున్న జీ20 సదస్సు ఆదివారం ముగిసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సదస్సు నిర్వహణ ఎంత కష్టమన్న విషయాన్ని చెప్పిన దక్షిణాఫ్రికా దేశాధ్యక్షుడు.. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అందరిని నవ్వులు పూయించటమే కాదు.. ఆ దేశానికి భారత్ ఎంత దన్నుగా నిలిచిందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసింది. ఈ సదస్సు నిర్వహణ కోసం భారతదేశం తమకు ఎంత సాయం చేసిందన్న విషయాన్ని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసో తన మాటలతో చెప్పేశారు.
జీ20 సదస్సు నిర్వహించటం చాలా కష్టమైన పనిగా చెప్పిన ఆయన.. ‘ఇంత కష్టంగా ఉంటుందని భారత్ మాకు చెప్పి ఉంటే.. మేం బహుశా పారిపోయేవాళ్లం. సదస్సు నిర్వహణ విషయంలో భారత్ నుంచి చాలా నేర్చుకున్నాం. మాకు భారత్ ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు. దక్షిణాఫ్రికాలో జీ20 సదస్సుకు భారత్.. బ్రెజిల్.. ఇండోనేషియాలు పునాది వేశాయి. భారత్ లో నిర్వహించిన జీ20 సదస్సు ప్రాంగణం చాలా గొప్పగా ఉంది. మా వేదిక చాలా చిన్నది’’ అని వ్యాఖ్యానించారు.
దీనికి స్పందించిన ప్రధాని మోడీ ‘ఇలాంటి వేదికలే ఎల్లప్పుడు అందంగా ఉంటాయి’ అని పేర్కొన్నారు. 2023లో ఢిల్లీ వేదికగా భారత్ మండపంలో జీ 20 సదస్సును నిర్వహించటం తెలిసిందే. జీ20 సదస్సును దక్షిణాఫ్రియా తొలిసారి నిర్వహించింది. ఈ సదస్సు ముగింపు సందర్భంగా ఇండియా - బ్రెజిల్ - దక్షిణాఫ్రికా అధినేతల సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కొత్త ప్రతిపాదనల్ని తెర మీదకు తీసుకొచ్చారు.అందులో కీలకమైనది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
అంతర్జాతీయ సంస్థల్లో మార్పులు తీసుకురావాల్సిందేనన్న మోడీ.. ‘‘నేడు ప్రపంచ దేశాల మధ్య విభజనలు.. అడ్డుగోడలు కనిపిస్తున్నాయి. ఇలాంటి వేళలో మా కూటమి ఐక్యత.. సహకారం.. మానవతా సందేశాన్ని ఇస్తోంది. మూడు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవటానికి జాతీయ భద్రతా సలహాదారుల సదస్సు నిర్వహించాలి. ఉగ్రవాదంపై పోరాటంలో సహకారం పెంచుకోవాలి. ఉగ్రవాదం లాంటి కీలకమైన అంశాలపై ద్వంద ప్రమాణాలకు తావు లేదు’ అంటూ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా.. భారత్.. బ్రెజిల్.. దక్షిణాఫ్రికాతో కూడిన ఇబ్సా డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రతిపాదించారు. ఈ కొత్త కూటమిలో యూపీఐ.. కోవిన్.. సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్ వర్కు లాంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను పంచుకోవటం లాంటి అంశాలున్నాయి. ఇబ్సా నిధి అంశం కూడా చర్చకు రావటం.. ఆ నిధులతో ఇప్పటికే 40 దేశాల్లో విద్యా.. వైద్యం.. మహిళల డెవలప్ మెంట్.. సౌరవిద్యుత్ లాంటి అంశాలపై పని చేయటాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించారు. ఇబ్సా కూటమి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వంటి ప్రపంచ స్థాయి సంస్థల్లో రావాల్సిన మార్పుల అవసరాన్ని గుర్తు చేస్తుందన్న మోడీ మాటలు ఇప్పుడు కీలకంగా మారాయి. మరి.. దీనిపై అగ్రరాజ్యాలు ఎలా రియాక్టు అవుతాయో చూడాలి.
