ఎల్‌వోసీ ఎత్తేస్తే లండన్ వెళ్లిపోతా.. నా భర్త రాగానే ఆయనను విచారించండి : యూట్యూబర్ నందన
ముందుగా ఇచ్చిన నోటీసుల ప్రకారం సెప్టెంబర్ 16న హాజరుకావాల్సి ఉన్నప్పటికీ.. న్యాయవాదుల సూచన మేరకు ఒకరోజు ముందుగానే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విచారణలో పాల్గొన్నట్లు సమాచారం.
By: A.N.Kumar | 16 Sept 2026 11:50 AM ISTప్రముఖ యూట్యూబర్, ‘నందూస్ వరల్డ్’ ఛానల్ నిర్వాహకురాలు రమానందనకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని.. వీసాలు, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ ఇప్పిస్తామని చెప్పి పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రమానందన తాజాగా మరోసారి ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ముందుగా ఇచ్చిన నోటీసుల ప్రకారం సెప్టెంబర్ 16న హాజరుకావాల్సి ఉన్నప్పటికీ.. న్యాయవాదుల సూచన మేరకు ఒకరోజు ముందుగానే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విచారణలో పాల్గొన్నట్లు సమాచారం.
లుకౌట్ సర్క్యులర్ ఎత్తివేయాలని విజ్ఞప్తి
విచారణ సందర్భంగా రమానందన పోలీసుల ముందు కీలక అభ్యర్థన చేసినట్లు తెలుస్తోంది. తనపై జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ (ఎల్.ఓసీ)ను రద్దు చేయాలని.. తిరిగి లండన్ వెళ్లేందుకు నిరభ్యంతర పత్రం (ఎన్.ఓసీ) జారీ చేయాలని ఆమె కోరినట్లు సమాచారం. తనపై నమోదైన కేసులో వాస్తవాలు లేవని.. అందువల్ల లండన్‌కు తిరిగి వెళ్లేందుకు అనుమతించాలని పోలీసులను కోరినట్లు తెలుస్తోంది.
గత విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు కూడా ఆమె తన న్యాయవాది సమక్షంలో లిఖితపూర్వకంగా సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఎన్.ఓసీపై పోలీసులు వెంటనే నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న అనంతరం తదుపరి చర్యలు చేపట్టాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
‘డెస్టినీ కన్సల్టెన్సీతో నాకు సంబంధం లేదు’
విచారణలో రమానందన చేసిన మరో కీలక వాదనపై కూడా చర్చ జరుగుతోంది. ‘డెస్టినీ కన్సల్టెన్సీ’కి సంబంధించిన ఆర్థిక లావాదేవీలతో తనకు ప్రత్యక్ష సంబంధం లేదని ఆమె పోలీసులకు తెలిపినట్లు సమాచారం. కన్సల్టెన్సీ కార్యకలాపాలు, వీసాలు, స్పాన్సర్‌షిప్ ఫీజులు తదితర వ్యవహారాలను తన భర్త మధుకర్, ఆయన అకౌంటెంట్ చూసుకునేవారని ఆమె వివరించినట్లు తెలుస్తోంది.
తన భర్త మధుకర్ లండన్ నుంచి భారత్‌కు వచ్చిన తర్వాత ఆయనను నేరుగా విచారించాలని కూడా ఆమె పోలీసులను కోరినట్లు సమాచారం. కేసులో తన పాత్ర లేదని రమానందన చెబుతున్నప్పటికీ.. దర్యాప్తు అధికారులు మాత్రం అందుబాటులో ఉన్న ఆధారాలు, ఆర్థిక లావాదేవీలు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
అసలు కేసు ఏంటి?
విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని, వీసాలు కల్పిస్తామని, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ అందిస్తామని నమ్మించి పలువురి నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు రమానందన దంపతులపై ఉన్నాయి. ఈ వ్యవహారంలో క్రాంతికుమార్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైనట్లు సమాచారం. అనంతరం దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో రమానందన విదేశాల్లో ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆమెపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేసినట్లు తెలుస్తోంది.
విమానాశ్రయంలో అదుపులోకి..
ఈ కేసులో భాగంగానే గత నెల 8న రమానందన లండన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం ఆమెను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. అప్పట్లో పోలీసులు ఆమెను విచారించారు. తాజాగా మరోసారి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయడంతో ఆమె ముందుగానే పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.
ప్రస్తుతం రమానందన కోరిన ఎల్.ఓసీ రద్దు, లండన్ వెళ్లేందుకు ఎన్.ఓసీ అంశం పోలీసుల పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు కేసు దర్యాప్తు కొనసాగుతున్నందున రమానందన చేసిన వాదనలు.. ఆమెపై వచ్చిన ఆరోపణలపై తుది నిర్ధారణ దర్యాప్తు పూర్తయ్యే వరకు ఉండనుంది.
