యూట్యూబర్ రమానందన వ్యవహారంలో ఊహించని ట్విస్ట్
ఇదిలా ఉండగా యూకే పౌరసత్వం కలిగిన రమానందన ప్రస్తుతం బిగ్‌బాస్ షోకు సంబంధించిన ఎంపికల కోసం హైదరాబాద్‌కు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
By: A.N.Kumar | 12 Sept 2026 11:28 AM ISTఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కన్సల్టెన్సీ ద్వారా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ రమానందనకు మరోసారి పోలీసుల నుంచి నోటీసులు అందాయి. ఇప్పటికే ఓ ఉద్యోగాల మోసం కేసులో విచారణకు హాజరైన ఆమెపై తాజాగా అద్దంకి పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం అద్దంకి పోలీసులు రమానందనకు నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అద్దంకి మండలం పేరాయపాలేనికి చెందిన ఉప్పలపాటి శ్రీనివాసరావు తన కోడలికి యూకేలో ఉద్యోగం ఇప్పించేందుకు గుంటూరులో ప్రైవేటు కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న రమానందన మామ జె. మోహనరావును 2023లో సంప్రదించారు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పడంతో తొలుత అడ్వాన్స్‌గా రూ.లక్ష చెల్లించినట్లు బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం అవసరమైన పత్రాల ప్రక్రియ పూర్తయిన తర్వాత మరో రూ.9.60 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. మొత్తంగా రూ.10.60 లక్షలు చెల్లించినప్పటికీ ఉద్యోగం ఇప్పించలేదని.. తీసుకున్న డబ్బును కూడా తిరిగి ఇవ్వలేదని బాధితుడు ఆరోపించారు.
చాలా కాలం ఎదురుచూసినా ఉద్యోగం రాకపోవడంతో పాటు నగదు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో శ్రీనివాసరావు ఈ ఏడాది జూన్‌లో అద్దంకి పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో కన్సల్టెన్సీ నిర్వాహకుడు జె. మోహనరావుతో పాటు ఆయన భార్య ఝాన్సీలక్ష్మి, కుమారుడు మధుకర్, కోడలు రమానందన, రమానందన తల్లిపై కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా యూకే పౌరసత్వం కలిగిన రమానందన ప్రస్తుతం బిగ్‌బాస్ షోకు సంబంధించిన ఎంపికల కోసం హైదరాబాద్‌కు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఇండియాకు వచ్చిన నేపథ్యంలో అద్దంకి పోలీసులు ఆమెకు నోటీసులు అందజేశారు. శుక్రవారం రమానందన తన న్యాయవాదిని వెంటబెట్టుకుని అద్దంకి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి నోటీసులు తీసుకున్నట్లు సీఐ సుబ్బరాజు తెలిపారు.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారించి, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై పూర్తి వివరాలను సేకరించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి భారీ మొత్తంలో నగదు తీసుకున్నారనే ఆరోపణలు నిజమా? బాధితుడి డబ్బులు ఏ విధంగా చెల్లించారు? ఉద్యోగం ఎందుకు రాలేదు? తదితర అంశాలపై దర్యాప్తులో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ కేసులో రమానందన పాత్రపై పోలీసులు దర్యాప్తు అనంతరం మరింత స్పష్టత ఇవ్వనున్నారు.
