Begin typing your search above and press return to search.

మమ్మల్ని ఆ జిల్లాలో కలపండి రామచంద్రా !

ఇక జిల్లాల పునర్ విభజన అన్నది ఎపుడైతే తెర మీదకు వచ్చిందో అనేక కొత్త డిమాండ్లు ముందుకు వస్తున్నాయి.

By:  Satya P   |   8 Nov 2025 9:05 AM IST
మమ్మల్ని ఆ జిల్లాలో కలపండి రామచంద్రా !
X

ఏపీలో కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్ విభజన విషయంలో తీవ్ర కసరత్తు చేస్తోంది. దీని మీద రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన మంత్రి వర్గ ఉప సంఘం కూడా ఈ మధ్య కాలంలో వరసగా సమావేశం అయి అనేక విషయాలు చర్చించింది. రెవిన్యూ డివిజన్లు అన్నీ ఒకే చోట ఉండాలని పరిపాలనా సౌలభ్యం కోసం ఈ పునర్ విభజన చేస్తున్నామని పేర్కొంది. ఇక తొందరలో దీని మీద తుది నివేదికను తయారు చేసి మంత్రి మండలిలో పెట్టి ఆమోదించి కొత్త ఏడాది అమలు చేయడానికి చూస్తున్నారు మంత్రి వర్గ ఉప సంఘానికి అనేక ఫిర్యాదుకు వినతులు సూచనలు కూడా దీని మీద వచ్చాయి. వీటిని చాలా నిశితంగా మంత్రి వర్గ ఉప సంఘం పరిశీలిస్తోంది.

కొత్త డిమాండ్ :

ఇక జిల్లాల పునర్ విభజన అన్నది ఎపుడైతే తెర మీదకు వచ్చిందో అనేక కొత్త డిమాండ్లు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాలో కూడా కలకలం రేగుతోంది. అక్కడ రాజకీయంగా చైతన్యం కలిగిన ఒక ముఖ్యమైన అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఉన్న జిల్లా నుంచి వేరే జిల్లాకు మార్చాలని ఉద్యమిస్తున్నారు. ఇది కాస్తా రాజకీయంగా వేడిని రాజేస్తోంది. రామచంద్రపురం నియోజకవర్గాన్ని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంచారు. 2022లో కొత్త జిల్లాలు చేసినపుడు తూర్పు గోదావరిలో ఉన్న ఈ జిల్లాను అలా కలిపారు అన్న మాట.

వద్దు అంటూనే :

అయితే ఆనాడు తమను అలా కలపవద్దు అంటూనా లోక్ సభ నియోజకవర్గాల వారీగా చేసిన విభజన వల్ల ఇది జరిగిందని అంటున్నారు. అందువల్ల తమకు ఇబ్బందులు ఉన్నాయని ఇపుడు ఎటూ కొత్త జిల్లాల పునర్ విభజన అంశం పరిశీలనలో ఉంది కాబట్టి తమ వినతిని సానుకూల వైఖరితో పరిశీలించాలని కోరుతున్నారు. రామచంద్రపురం నియోజకవర్గాన్ని కోనసీమ జిల్లా నుంచి తొలగించి కాకినాడ జిల్లాలో విలీనం చేయాలన్న డిమాండ్ తో ఉద్యమిస్తున్నారు.

జేఏసీ తో ఊపు :

ఇక ఈ అంశం మీద ఏకంగా జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఏర్పాటు అయింది ఈ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు కూడా చేపడుతున్నారు. అలాగే ప్రజలను కూడా కూడగట్టుకుని జేఏసీ ఆధ్వర్యంలోఆందోళనలు నిర్వహిస్తున్నారు. తమది న్యాయమైన డిమాండ్ గా చెబుతున్నారు రామచంద్రాపుప్రం నియోజకవర్గాన్ని పరిపాలన సౌలభ్యం దృష్ట్యా కాకినాడ జిల్లాలో చేర్చడమే ఉత్తమమని అంటున్నారు అలా చేస్తేనే అందరికీ పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుందని జేఏసీ నేతలు చెబుతున్నారు.

జిల్లా కేంద్రం బహు దూరం :

ఇక రామచంద్రాపురానికి కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం చాలా దూరం అని అంటున్నారు. ఏకంగా అది సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉందని జేఏసీ నేతలు గుర్తు చేస్తున్నారు. దాంతో తాము జిల్లా కేంద్రానికి వెళ్ళడం కష్టం అవుతోందని ఇది అసంబద్ధమైన విలీనం అని వారు అంటున్నారు. ఇక కాకినాడ జిల్లాలో కనుక కలిపినట్లు అయితే కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే జిల్లా కేంద్రం ఉంటుందని తమకు ఎంతో వెసులుబాటుగా ఉంటుందని వారు అంటున్నారు.

అనుబంధాలు ఎక్కువ :

కేవలం విలీనం మాత్రమే కాదని భౌగోళికంగా, వాణిజ్యపరంగా కూడా రామచంద్రాపురానికి కాకినాడతోనే ఎక్కువ సంబంధాలున్నాయని స్థానిక ప్రజలు చెబుతున్నారు. అయితే తమ న్యాయమైన డిమాండ్ ప్రభుత్వ పెద్దల చెవికి ఎక్కకుండా కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని జేఏసీ నాయకులు ఫైర్ అవుతున్నారు. మొత్తం మీద చూస్తే ఈ డిమాండ్ కీలకంగా మారుతోంది. గోదావరి జిల్లాలు అంటేనే చైతన్యం ఎక్కువ. మరి దీనిని మంత్రి వర్గ ఉప సంఘం ఎలా రిసీవ్ చేసుకుని పరిష్కరిస్తుందో చూడాల్సి ఉంది.