Begin typing your search above and press return to search.

పాత చిత్రం.. ఒక కొత్త చరిత్ర.. తమిళనాడులో సంచలనం రేపుతున్న ఆర్జీవీ ట్వీట్

రాజకీయాల్లో ఏ క్షణం ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. కొన్ని దశాబ్దాల క్రితం తీసిన ఒక ఫోటో, నేటి రాజకీయ పరిణామాలకు అద్దం పడుతుండడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

By:  Tupaki Political Desk   |   5 May 2026 3:42 PM IST
పాత చిత్రం.. ఒక కొత్త చరిత్ర.. తమిళనాడులో సంచలనం రేపుతున్న ఆర్జీవీ ట్వీట్
X

రాజకీయాల్లో ఏ క్షణం ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. కొన్ని దశాబ్దాల క్రితం తీసిన ఒక ఫోటో, నేటి రాజకీయ పరిణామాలకు అద్దం పడుతుండడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ చిత్రంలో ఒక కుర్రాడు ఎంతో అమాయకంగా, దిగ్గజ నాయకుడి వెనుక నిలబడి ఉన్నాడు. కాలం గడిచింది.. ఆ కుర్రాడు వెండితెరపై ‘దళపతి’గా ఎదిగాడు. ఇప్పుడు అదే కుర్రాడు ఏకంగా ఆ దిగ్గజ నాయకుడు నిర్మించిన సామ్రాజ్యాన్నే సవాల్ చేస్తూ, కొత్త చరిత్రను లిఖించాడు. ఒకప్పుడు నీడలా నిలబడిన వ్యక్తే, నేడు ఆ వృక్షానికే సవాల్‌గా మారడం రాజకీయాల్లో ఉండే విచిత్రమైన మలుపులకు నిదర్శనం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ, ఒకప్పటి ఆ అరుదైన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఆర్జీవీ శైలిలో ‘కలైంగర్’ విశ్లేషణ

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే (TVK) పార్టీ అధినేత విజయ్ సాధించిన అద్భుత విజయంపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ) తనదైన శైలిలో స్పందించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి వెనుక విజయ్ తన యుక్తవయస్సులో నిలబడి ఉన్న పాత ఫోటోను ఆయన ‘X’ (ట్విట్టర్)లో షేర్ చేశారు. ‘తన వెనుక ఉన్న ఆ కుర్రాడు ఒకరోజు తన పార్టీని నాశనం చేస్తాడని కలైంగర్ (కరుణానిధి) కలలో కూడా ఊహించి ఉండడు’ అంటూ ఆర్జీవీ రాసుకొచ్చారు. డీఎంకే వంటి బలమైన పార్టీని విజయ్ ఓడించడాన్ని ఉద్దేశిస్తూ వర్మ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

వారసత్వానికి తగిలిన గట్టి దెబ్బ

ఆర్జీవీ తన పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా, డీఎంకే పార్టీకి కరుణానిధి ఆద్యుడైతే, ప్రస్తుతం ఆ పార్టీ బాధ్యతలను ఆయన కుమారుడు ఎంకే స్టాలిన్ భుజాన వేసుకున్నారు. అయితే, తాజాగా ముగిసిన ఎన్నికల్లో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకేను విజయ్ తన టీవీకే పార్టీతో మట్టికరిపించారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు తమిళ రాజకీయాలను శాసించిన ఒక కుటుంబ వారసత్వానికి, ఒక సినీ నటుడు చెక్ పెట్టడం అసాధారణమైన విషయమని వర్మ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా డీఎంకేకు కంచుకోటలాంటి నియోజకవర్గాల్లో విజయ్ జయకేతనం ఎగురవేయడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది.

వైరల్‌గా మారిన ఫోటో

రాంగోపాల్ వర్మ షేర్ చేసిన ఫోటోలో విజయ్ తన తల్లిదండ్రులు ఎస్ఏ చంద్రశేఖర్-శోభతో కలిసి ఒక రిబ్బన్ కటింగ్ వేడుకలో కరుణానిధి వెనుక నిలబడి ఉన్నారు. అప్పుడు ఎంతో సాధారణంగా ఉన్న ఆ యువకుడే, ఇప్పుడు తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తాడని ఎవరూ అనుకోలేదు. ఈ ఫోటోను చూసి విజయ్ అభిమానులు ‘రియల్ హీరో’ అని కొనియాడుతుండగా, ఆర్జీవీ మాత్రం డీఎంకే శ్రేణులకు మింగుడుపడడం లేదు. వర్మ తన పోస్ట్ ద్వారా విజయ్ సాధించిన విజయం ఎంతటి తీవ్రమైనదో చెప్పకనే చెప్పారు.

మారుతున్న సమీకరణాలు

విజయ్ విజయం కేవలం ఒక ఎన్నికల గెలుపు మాత్రమే కాదు, అది ద్రవిడ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పునకు సంకేతం. స్టాలిన్ వంటి అనుభవజ్ఞుడైన నాయకుడిని కాదని ప్రజలు విజయ్‌కి పట్టం కట్టడం వెనుక లోతైన కారణాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. దీనితో పాటు రెండు ‘ద్రవిడ’ పార్టీలకు చెక్ పెట్టడం ఒకెత్తు. ఈ క్రమంలోనే ఆర్జీవీ వంటి వారు చేసే కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి.