Begin typing your search above and press return to search.

రాఖీ ఎపుడు కట్టాలి...చంద్ర గ్రహణం ఉందా ?

రాఖీ పండుగ చాంద్రమానం ప్రకారం చూస్తే ఈ నెల 28న శుక్రవారం వచ్చింది. ఆ రోజున ఉదయం వేళలో పూర్ణిమ తిథి ఉంది.

By:  Satya P   |   28 Aug 2026 8:27 AM IST
రాఖీ ఎపుడు కట్టాలి...చంద్ర గ్రహణం ఉందా ?
X

రాఖీ పండుగ చాంద్రమానం ప్రకారం చూస్తే ఈ నెల 28న శుక్రవారం వచ్చింది. ఆ రోజున ఉదయం వేళలో పూర్ణిమ తిథి ఉంది. దాంతో రాఖీ పండుగను ఈ రోజే చేసుకోవాలి అని పండితులు నిర్ణయించారు. అయితే 27వ తేదీనే పౌర్ణమి అధిక భాగం గడచిపోయింది. మరి రాఖీ కట్టేందుకు ఏది మంచిది అన్న మీమాంస వస్తుంది. అలాగే చంద్రగ్రహణం ఉంది కదా ఎలా అన్న మరో చర్చ ఉంది. వీటన్నింటికీ పండితులు పరిష్కారాలను సమాధానాలను చెప్పారు. రాఖీ పండుగ వేళ సోదరులకు ఉదయం 5.57 నుంచి 9.48 వరకూ రాఖీని కట్టేందుకు శుభ ముహూర్తం ఉందని అంటున్నారు. అలాగే రాహు కాలం ఉదయం 10.46 నుంచి 12.22 దాకా ఉంటుంది. మరో వైపు అభిజిత్ ముహూర్తం ఉదయం 11.56 నుంచి 12.56 దాకా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో రాఖీ కట్టినా తప్పు లేదని అంటున్నారు. ఇక చంద్రగ్రహణం ఈ నెల 28న ఉంది అన్నది నిజమే కానీ అది భారత్ లో కనిపించదని అందువల్ల ఎటువంటి సంశయాలు లేకుండా రాఖీ జరుపుకోవచ్చు అని పండితులు సూచిస్తున్నారు.

అద్భుత సందేశంగా వేడుక :

హిందూ సంప్రదాయంలో ప్రతీ పండుగకు ఒక విశిష్టత ఉంది. అంతే కాదు అంతర్లీనంగా అద్భుతమైన సందేశం కూడా ఉంటుంది. అలాంటి ముఖ్యమైన పండుగలలో రక్షా బంధన్ ఒకటి. రాఖీ పండుగగా వాడుకలో పిలిచే ఈ వేడుక ఎంతో గొప్పది. పురాణేతి కాలం నుంచి కొనసాగుతూ వస్తోంది. కేవలం ఒక దారం కట్టడమే రాఖీ పండుగ అనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి లేదు. నిజానికి అది దారం కాదు అసలైన బంధానికి ఆధారం. అది సోదర బంధం మాత్రమే కాదు ఏ రకమైన బంధం అయినా ఒక గొప్ప భరోసాగా నిలిచి ఉండాలన్నదే ఈ వేడుక ముఖ్య ఉద్దేశ్యంగా ఉంటుంది.

సోదరుడు ఇచ్చే మాట :

నిజానికి రాఖీ పండుగ అంటే సోదర ప్రేమకు నిదర్శనంగా చెబుతారు. అన్న తమ్ముడు ఎవరైనా కావచ్చు. వారు తమ సోదరికి అన్ని విధాలా అండగా తాము ఉన్నామని చాటి చెప్పే ముఖ్య సూత్రంగా ఈ రక్ష రేకు నిలుస్తుంది. కష్టాలలో తాను తప్పక వెన్నంటి ఉండి తోడుగా నిలిచి పరిష్కరిస్తాను అని చెప్పే అందమైన హామీ కూడా ఇందులో ఇమిడి ఉంది. ఇది ఎంత గొప్ప స్పూర్తి అనంది కూడా ఆలోచించాల్సిందే. అలాగే సోదరులకు సోదరి కూడా ఇచ్చే ఒక ప్రేమ పూర్వకమైన అండ కూడా ఇందులో కనిపిస్తుంది. సోదరుల బాగుని కోరుకుంటూ వారికి తాను ఉన్నాను అని స్పష్టం చేయడమే సోదరీమణి చేసేదిగా ఇందులో కనిపిస్తుంది.

సమాజానికే సందేశం :

కేవలం అన్నా చెల్లెలు లేదా అక్కా తమ్ముడు మాత్రమే రాఖీ కట్టాలని ఏదీ నిబంధన లేదు. ఎవరికైనా స్త్రీ రాఖీ కట్టవచ్చు. తనకు అండగా ఉంటూ సోదర ప్రేమను చూపించే ఎవరైనా కూడా రాఖీ కట్టించుకోవడానికి అర్హులే అని కూడా చెప్పాల్సి ఉంటుంది. అంతే కాకుండా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అవ్యాజమైన సోదర భావాన్ని కలిగించేదే రాఖీ పండుగ పరమార్ధం. ఆ విధంగా చెప్పాలీ అంటే సమాజానికే సోదర భావం పెంపొందించే వేడుకగా దీనిని చెబుతారు. ఇక చరిత్రలోకి ఒక్కసారి వెళ్తే కనుక లో రాణి కర్ణావతి మొఘల్ చక్రవర్తి హుమాయూన్‌కు రాఖీ పంపి సహాయం కోరినప్పుడు ఆయన పరమతస్థుడైనప్పటికీ సోదర బాధ్యతతో వచ్చి ఆమెను కాపాడాడని చెబుతారు. అలాగే స్త్రీలను గౌరవించాలన్న ఉత్తమ భావన ఈ పండుగ అందిస్తుంది. కుటుంబ సంబంధాలను మరింత గట్టి పరచే వేడుకగా కూడా చెప్పుకోవాలి. ఎవరికి వారుగా ఉద్యోగాలు, వ్యాపారాల వల్ల దూరంగా ఉండే కుటుంబ సభ్యులు రాఖీ వేడుక ఈ రోజున ఒక చోటకు చేరుకోవడం ఇందులో కనిపిస్తుంది.