జగన్ కేసులు పరిష్కారం ఎప్పటికి: రాజ్యసభలో నిలదీత
కానీ, ఏపీలో ఉన్న పరిణామాలను గమనిస్తే.. సామాన్యులు సైతం అవాక్కయ్యేలా పరిణామాలు ఉన్నాయని విజయ్ పాత్రుడు అన్నారు.
By: Garuda Media | 6 Aug 2026 10:03 AM IST``వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై నమోదైన అక్రమాస్తుల కేసులు ఎప్పటికి పరిష్కారం అవుతాయో చెప్పగలరా? ఇప్పటి కే 13 ఏళ్లుగా ఆయా కేసులు న్యాయస్థానాల్లో గడప కూడాదాటని పరిస్థితి నెలకొంది. ఇది ఎలాంటి సంకేతాలను ఇస్తోందో అం దరూ పరిశీలించాలి. న్యాయమూర్తులు బదిలీ అవుతున్నారు. కేసులు పట్టుకునేందుకు భయపడుతున్నారు. ఇది చాలా తీవ్ర మైన అంశం. ఇలాంటి పరిస్థితి సామాన్యులకు ఉంటుందా? దీని వెనుక ఏం జరుగుతోందన్నది అందరూ ఆలోచన చేయాలి.`` అని టీడీపీ రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్‌పాత్రుడు పెద్దల సభలో ప్రశ్నించారు.
సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతూ తీసుకువచ్చిన సవరణ బిల్లుపై బుధవారం సుదీర్ఘంగా రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ చర్చలో వైసీపీ, టీడీపీ సహా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు పాల్గొన్నారు. ఈ సమయంలో విజయ్ పాత్రుడు మాట్లాడుతూ.. న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని చెప్పారు. సామాన్యులకు సత్వర న్యాయం అందించేదిశగా ఈ బిల్లు దోహదపడుతుందన్నారు. సామాన్యులైనా పెద్దవారైనా న్యాయం, చట్టం, రాజ్యాంగం ముందు సమానులేనన్న స్ఫూర్తిని మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
కానీ, ఏపీలో ఉన్న పరిణామాలను గమనిస్తే.. సామాన్యులు సైతం అవాక్కయ్యేలా పరిణామాలు ఉన్నాయని విజయ్ పాత్రుడు అన్నారు. మాజీ సీఎం జగన్‌పై రాష్ట్ర విభజనకు ముందే కేసులు నమోదయ్యాయని, 16 నెలల పాటు ఆయన జైల్లో కూడా ఉండి వచ్చారని, ఆ తర్వాత ఇప్పటి వరకు ఆయనపై నమోదైన కేసుల్లో ఎక్కడా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని పైగా డిశ్చార్జ్ పిటిషన్లతో చాలా మంది తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే.. సత్వరమే వాటిపై విచారణ చేపట్టాల్సి ఉంటుందన్నారు. పైగా ఇప్పటి వరకు బెయిల్ కొనసాగించడం కూడా చర్చనీయాంశం అయిందని వివరించారు.
వైసీపీ ఎదురు దాడి..
విజయ్ ఈ ప్రస్తావన చేసినప్పుడు సభలోనే ఉన్న వైసీపీ సభ్యులు ఎదురు దాడి చేశారు. చంద్రబాబుపై కూడా అనేక కేసులు ఉన్నాయని వాటి సంగతి ఏంటని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు ఏమైందని వారు ప్రశ్నించారు. పైగా బిల్లుపై చర్చ సందర్భా నికి.. విజయ్‌ప్రస్తావిస్తున్న అంశాలకు ఎక్కడా సంబంధం లేదని వ్యాఖ్యానించారు. విజయ్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని చైర్మన్‌ను కోరారు. మరోవైపు.. కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష సభ్యులు.. జంతర్ మంతర్ వద్ద పోలీసులు విద్యార్థులపై జరిపిన లాఠీ చార్జీని నిరసిస్తూ.. ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసనలు, ఆందోళన మధ్యే సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పారు.
