Begin typing your search above and press return to search.

తగ్గనున్న వైసీపీ...కూటమి ఫుల్ జోష్

ఈ ఏడాది రాజకీయ ఆశావహులకు ఎంతో మేలు చేసేదిగా భావిస్తున్నారు. రెండేళ్ళకు ఒకసారి జరిగే రాజ్యసభ ఎన్నికల్లో మూడో వంతు మంది సభ్యులు రిటైర్ అవుతారు.

By:  Satya P   |   10 Jan 2026 11:00 AM IST
తగ్గనున్న వైసీపీ...కూటమి ఫుల్ జోష్
X

ఈ ఏడాది రాజకీయ ఆశావహులకు ఎంతో మేలు చేసేదిగా భావిస్తున్నారు. రెండేళ్ళకు ఒకసారి జరిగే రాజ్యసభ ఎన్నికల్లో మూడో వంతు మంది సభ్యులు రిటైర్ అవుతారు. ఆ విధంగా చూస్తే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఏకంగా 73 మంది రాజ్యసభ ఎంపీలు ఈ ఏడాది పదవీ విరమణ చేసి మాజీలు కానున్నారు. అందులో దిగ్గజ నేతలు కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఏపీ నుంచి చూసుకుంటే కనుక వైసీపీ నుంచే ముగ్గురు ఎంపీలు రిటైర్ అవుతున్నారు. వారే అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ సత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్. అలాగే టీడీపీ నుంచి సానా సతీశ్ రిటైర్ అవుతున్నారు. వీరంతా జూన్ లో మాజీలు అవుతారు. ఈ ఏడాది రిటైర్ అయ్యే వారి లిస్ట్ తో కూడిన ఒక జాబితాను రాజ్యసభ సచివాలయం తాజాగా విడుదల చేసింది

కాంగ్రెస్ పెద్దాయన సైతం :

కాంగ్రెస్ అఖిల భారత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె కూడా ఇదే ఏడాది రిటైర్ అయ్యే వారిలో ఉండడం విశేషం. అలాగే ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కేంద్రమంత్రులు హర్దీప్ సింగ్ పూరీ, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్‌ల పదవీ కాలం కూడా ఇదే ఏడాది పూర్తి అవుతోంది. అయితే వీరిలో చూస్తే ఖర్గే కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు అలాగే రాజ్యసభలో అపొజిషన్ లీడర్ పైగా ఆయన సొంత రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మళ్లీ ఆయన పెద్దల సభకు ఎన్నిక కావడం లాంచనం అంటున్నారు. మిగిలిన వారిలో అత్యధిక శాతం మాత్రం మాజీలుగానే ఉండాల్సిందే అంటున్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి సురేశ్ రెడ్డి కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను ఏప్రిల్ 9న రిటైర్ అవుతున్నారు.

బీజేపీకే చాన్స్ :

ఈ ఏడాది రిటైర్ అవుతున్న వారి జాబితా చూస్తే గుజరాత్ నుంచి నలుగురు, మధ్యప్రదేశ్ నుంచి ముగ్గురు, రాజస్థాన్ నుంచి ముగ్గురు, ఉత్తర ప్రదేశ్ నుంచి పదిమంది, హర్యానా నుంచి ఇద్దరు, ఒడిశా నుంచి నలుగురు, అసోం నుంచి ముగ్గురు, బీహార్ నుంచి ఐదుగురు, ఛత్తీస్‌గఢ్ నుంచి ఇద్దరు, మహారాష్ట్ర నుంచి నలుగురు, తమిళనాడు నుంచి ఆరుగురు, , పశ్చిమ బెంగాల్ నుంచి ఐదుగురు, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒకరు, ఝార్ఖండ్ నుంచి ఇద్దరు, కర్ణాటక నుంచి నలుగురు, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఒక్కరు ఉన్నారు. ఈ లిస్ట్ మొత్తం చూస్తే బీజేపీ నుంచి తిరిగి ఎన్నికయ్యే వారు అధికంగా కనిపిస్తున్నారు గుజరాత్ మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీ, హర్యానా, ఒడిషా, అసోం, బీహార్, ఛత్తీస్‌గఢ్ ఒడిశా , మణిపూర్, మేఘాలయ, మిజోరాం, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ మహారాష్ట్రలలో బీజేపీ దాని మిత్ర పక్షాలే అధికారంలో ఉన్నాయి. దాంతో సగానికి సగం బీజేపీ ఎన్డీయే ఖాతాలో పడడం ఖాయమని చెబుతున్నారు.

ఏపీ నుంచి కూటమి :

ఇక ఏపీలో చూస్తే నాలుగు ఎంపీ సీట్లు ఖాళీ అయితే అవన్నీ కూటమికే దక్కుతాయి. వైసీపీకి ఇప్పటికే నలుగురు గుడ్ బై చెప్పారు. దాంతో బలం ఏడుకు పడిపోయింది. తాజాగా చూస్తే మరో ముగ్గురి పదవీ విరమణతో ఆ బలం నాలుగుకు తగ్గిపోతుంది. ఇక ఏపీ నుంచి రాజ్యసభలో కూటమి బలం ఏడుకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్యసభకు కూటమి నుంచి చూస్తే పోటీ చాలా ఎక్కువగా ఉంది, ఎవరికి టికెట్లు దక్కుతాయి అన్నది తెలియదు కానీ జనసేన బెజేపీ టీడీపీలకు చెందిన వారే ఎంపీలు కావడం మాత్రం ఖాయం.