అణుబాంబులకు భయపడం.. పాకిస్థాన్‌కు మరోసారి భారత్ హెచ్చరిక
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం.. అణ్వాయుధ బెదిరింపులపై భారత్ మరోసారి తన కఠిన వైఖరిని స్పష్టం చేసింది.
By: A.N.Kumar | 24 Sept 2026 11:58 PM ISTపాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం.. అణ్వాయుధ బెదిరింపులపై భారత్ మరోసారి తన కఠిన వైఖరిని స్పష్టం చేసింది. సరిహద్దుల్లో శత్రుపూరిత చర్యలకు దిగినా లేదా అణు బెదిరింపులకు పాల్పడినా ఇకపై ఎంతమాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. గురువారం నిర్వహించిన ‘డెఫ్ కాన్ 2026’ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా భారత్ తన వ్యూహాత్మక రక్షణ విధానంలో తీసుకొచ్చిన చారిత్రాత్మక మార్పులను ప్రపంచానికి స్పష్టంగా చాటిచెప్పామని వెల్లడించారు.
‘న్యూక్లియర్ బ్లాక్‌మెయిల్’ను సహించేది లేదు
పాకిస్థాన్ దశాబ్దాలుగా ప్రయోగిస్తున్న అణు బెదిరింపు వ్యూహాలకు భారత్ ఇక లొంగదని రాజ్‌నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. "ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ చేసిన అణు బెదిరింపులకు భారత్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఇకపై ఎలాంటి 'న్యూక్లియర్ బ్లాక్‌మెయిల్'ను భారతదేశం ఎంతమాత్రం సహించదు" అని ఆయన స్పష్టం చేశారు. మన జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ పాకిస్థాన్ నుంచి ఏ రకమైన దురాక్రమణ లేదా కుట్ర జరిగినప్పటికీ.. దానికి తీవ్ర స్థాయిలోనే సమాధానం ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు.
ఉగ్రవాదం ఉన్నంతవరకు చర్చలు, వాణిజ్యం అసాధ్యం
పాకిస్థాన్‌తో సంబంధాల పునరుద్ధరణపై భారత్ వైఖరి అత్యంత స్పష్టంగా ఉందని రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. ఒకవైపు సరిహద్దుల వెనుక నుంచి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, మరోవైపు శాంతి చర్చలు జరపడం సాధ్యం కాదు. ఉగ్రవాద చర్యలు కొనసాగుతున్నంత కాలం పాక్‌తో ఎలాంటి వ్యాపార, వాణిజ్య సంబంధాలు నెరపడం జరగదు. సాధారణ దౌత్య సంబంధాలు కొనసాగాలంటే పాకిస్థాన్ మొదట తన భూభాగంలో ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా మట్టుబెట్టాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
సింధూ జలాలు, పహల్గామ్ ఘటనపై ఘాటు వ్యాఖ్యలు
“రక్తం, నీరు ఒకేసారి కలిసి ప్రవహించలేవు” అనే కఠిన సూత్రాన్ని భారత్ ఆచరణలో చూపిందని రక్షణ మంత్రి గుర్తుచేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం ద్వారా భారత్ తన సార్వభౌమాధికారాన్ని చాటుకుందని తెలిపారు. 2025 ఏప్రిల్‌లో పహల్గామ్‌లో 26 మంది నిరాపరాధుల ప్రాణాలను బలిగొన్న క్రూరమైన ఉగ్రదాడితో పాకిస్థాన్ తన ‘లక్ష్మణ రేఖ’ను దాటిందని, అందుకే భారత్ అత్యంత కఠినమైన ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టిందని వివరించారు. ఈ సైనిక చర్యలో భాగంగా పాకిస్థాన్ తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలు, శిక్షణా శిబిరాలపై భారత దళాలు ఖచ్చితమైన వ్యూహాత్మక దాడులు జరిపి ధ్వంసం చేశాయని చెప్పారు.
రక్షణ వ్యూహంలో విప్లవాత్మక మార్పు.. ‘డిటరెన్స్ బై పనిష్‌మెంట్’
భారతీయ సైనిక సిద్ధాంతంలో వచ్చిన ప్రధాన మార్పును రాజ్‌నాథ్ సింగ్ ఈ సందర్భంగా విశ్లేషించారు. ఇప్పటివరకు భారత్ అనుసరించిన ‘డిటరెన్స్ బై డినయల్’ ప్రత్యర్థి దాడిని కేవలం అడ్డుకోవడం విధానం నుండి ‘డిటరెన్స్ బై పనిష్‌మెంట్’ చర్యలకు దిగితే కోలుకోలేని విధంగా శిక్షించడం వైపు సైన్యం అడుగులు వేసిందని ఆయన వెల్లడించారు.
భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు వీలుగా త్రివిధ దళాల (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) మధ్య పూర్తి సమన్వయాన్ని సాధిస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భారత రక్షణ వ్యవస్థను మునుపెన్నడూ లేనివిధంగా ఆధునికీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. మొత్తంగా డెఫ్ కాన్ 2026 వేదికగా రక్షణ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు, సరిహద్దు భద్రత, ఉగ్రవాద నిర్మూలన విషయంలో భారత్ ఎంతటి కఠిన వైఖరితో ఉందో పునరుద్ఘాటించాయి.
