పాక్‌తో ముచ్చట్లు ఉండవ్.. పీవోకే కోసమే భవిష్యత్తు చర్చలు : రాజ్ నాథ్ కీలక వ్యాఖ్యలు
కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు చూపిన తెగువను, త్యాగాలను స్మరించుకుంటూ రక్షణ మంత్రి ప్రసంగం కొనసాగింది.
By: Tupaki Political Desk | 26 July 2026 1:35 PM ISTమిలట్రీకి మిలిటెన్సీకి తేడా లేని పాకిస్థాన్ తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 27వ కార్గిల్ విజయ్ దివస్ వేడుకల సందర్భంగా లడఖ్‌లోని ద్రాస్ లో ఉన్న కార్గిల్ వార్ మెమోరియల్ ను ఆయన ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ పొరుగు దేశం పాకిస్థాన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాకిస్థాన్ తన నైజాన్ని, వక్రబుద్ధిని ఎప్పటికీ మార్చుకోలేదని, భారత్‌కు వ్యతిరేకంగా పరోక్ష యుద్ధాలు (ప్రాక్సీ వార్), ఉగ్రవాదాన్ని ప్రొత్సహిస్తూనే ఉందని ఆయన మండిపడ్డారు. దేశ సరిహద్దుల రక్షణలో భారత సాయుధ బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, శత్రువుల ఏ చిన్న దుశ్చర్యకైనా వారి ఊహకు కూడా అందని రీతిలో గట్టి బదులిస్తామని హెచ్చరించారు.
కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు చూపిన తెగువను, త్యాగాలను స్మరించుకుంటూ రక్షణ మంత్రి ప్రసంగం కొనసాగింది. 1999 నాటి ఆ యుద్ధంలో మైనస్ డిగ్రీల చలిలో, ఆక్సిజన్ కొరత ఉన్న కఠినమైన పర్వత ప్రాంతాల్లో సైతం మన జవాన్లు శత్రువుల భరతం పట్టారని కొనియాడారు. కార్గిల్ శిఖరాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన ఆ వీర సైనికుల సాహసం దేశ ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుందని స్పష్టం చేశారు. నేడు దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంటే, పాకిస్థాన్ మాత్రం ఉగ్రవాదాన్ని పెంచిపోషించడమే పరమావధిగా పెట్టుకుందని విమర్శించారు.
భారత్, పాకిస్థాన్ ల మధ్య ఉన్న వైవిధ్యాన్ని వివరిస్తూ రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, డిజిటలైజేషన్ వంటి కార్యక్రమాలతో అభివృద్ధి బాటలో పయనిస్తుంటే.. పాకిస్థాన్ మాత్రం అక్రమ చొరబాట్లు, ఉగ్రవాద డిజైన్ల తయారీపైనే దృష్టి పెట్టిందని ఎద్దేవా చేశారు. భారత్ అధునాతన యుద్ధ నౌకలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని డిజైన్ చేస్తుంటే, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని డిజైన్ చేయడంలో నిమగ్నమైందని ఆయన ఘాటుగా విమర్శించారు. దేశాభివృద్ధిని చూసి ఓర్వలేక కుట్రలు పన్నుతున్న శక్తులకు భారత సైన్యం తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.
పాకిస్థాన్‌తో భవిష్యత్తులో జరిగే చర్చల స్వభావంపై రక్షణ మంత్రి స్పష్టమైన వైఖరిని ప్రకటించారు. ఆ దేశంతో ఇకపై ఎలాంటి సాధారణ ద్వైపాక్షిక చర్చలకు అవకాశం లేదని, ఒకవేళ భవిష్యత్తులో చర్చలు జరిగితే అది కేవలం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) గురించే ఉంటాయని తేల్చిచెప్పారు. పీవోకే అనేది చట్టవిరుద్ధంగా పాక్ చెరలో ఉన్న భారత భూభాగమని, దానిని తిరిగి పొందే అంశంపైనే చర్చలు ఉంటాయని స్పష్టం చేశారు. పాకిస్థాన్ ప్రభుత్వ విధానంలోనే ఉగ్రవాదం ఒక భాగంగా మారిపోయిందని, అక్కడ సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య ఎలాంటి తేడా లేకుండా పోయిందని ఆరోపించారు. ఉగ్రవాద సంస్థలను పాక్ ప్రభుత్వమే కాపాడుతూ, దగ్గరుండి నడిపిస్తోందని ఆయన దుయ్యబట్టారు.
ఈ వేడుకల్లో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ తదితర ప్రముఖులు పాల్గొని వీరజవాన్లకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ద్రాస్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబ సభ్యులను స్వయంగా కలుసుకుని సత్కరించారు. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన వారి త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. దేశం రక్షణ రంగంలో 'ఆత్మనిర్భర్ భారత్' దిశగా అడుగులు వేస్తోందని, స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక ఆయుధాలను తయారు చేసుకుంటున్నామని తెలిపారు. రాబోయే కాలంలో ప్రపంచంలోనే అత్యుత్తమ బలమైన సైన్యంగా మన త్రివిధ దళాలు నిలుస్తాయని ఆయన పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.
