సీఈసీ : బీజేపీ గేరు మార్చిందా ?!
సర్ ప్రక్రియలో భాగంగా ఓట్ల నమోదులో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, దీనికి బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఆందోళనలు జరుగుతున్నాయి.
By: Garuda Media | 16 Oct 2026 10:00 PM ISTసర్ ప్రక్రియలో భాగంగా ఓట్ల నమోదులో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, దీనికి బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఆందోళనలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సీజేపీలు ఢిల్లీలో వరసగా ఆందోళనలు చేస్తున్నాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద కేంద్రం ఏకంగా నిషేధం విధించింది. దీని మీద దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది.
ఈ నేపథ్యంలో విపక్షాల మీద బీజేపీ ఎదురుదాడికి దిగిందా అంటే తాజాగా కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ లక్నోలో చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. ‘కాంగ్రెస్ ఎన్నికల కమీషన్ ను సవాల్ చేస్తూ ప్రజాస్వామ్యం పేరుతో మాట్లాడుతుంది. కానీ కాంగ్రెస్ తన చరిత్రను మరిచిపోవద్దు. 1993లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కమీషన్ ను మార్చేసింది. రాత్రికి రాత్రే కొత్త ఎన్నికల కమషనర్లను నియమించింద’ని గుర్తు చేశారు.
అప్పటి సీఈసీ ఎన్ గోపాలస్వామి నవీన్ చావ్లా గురించి రాష్ట్రపతికి లేఖ రాసి ఆయన ఎన్నికల కమీషన్ కు చెందిన సున్నితమైన సమాచారం ఇచ్చారని ఆరోపించినా కాంగ్రెస్ ఆయనను అప్పుడు కాపాడి ఆ తరువాత సీఈసీగా నియమించిందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. కేవలం గాంధీ, నెహ్రూ కుటుంబాలకు దగ్గరగా ఉన్నారని అలా చేశారని తెలిపారు.
ఢిల్లీలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ జరుగుతున్న ఆందోళనలు నిజంగా ఎన్నికల సంస్కరణల కోసం కాదని, యువతను అరాచకత్వ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని, బంగ్లాదేశ్ తరహాలో నాయకత్వ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని రాజ్ నాథ్ సింగ్ తీవ్రంగా ఆరోపించడం విశేషం.
రాహుల్ గాంధీ రాజకీయాల్లో అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రజాస్వామ్యం అంటే అరాచకత్వం సృష్టించడానికి లైసెన్స్ కాదని, రాజ్యాంగ సంస్థలను బలహీనపరచకూడదని, ప్రజల తీర్పును గౌరవించి స్వయ పరిశీలన చేయాలని రాజ్ నాథ్ సింగ్ సూచించారు. ఈ తాజా వ్యాఖ్యలను గమనిస్తే బీజేపీ ఖచ్చితంగా ఎదురుదాడికి దిగిందనే చెప్పాలి. మీ చరిత్రను ఒకసారి చూసుకోండి. మీరు హిపోక్రసీ చేస్తున్నారు. అరాచకత్వం సృష్టించి అధికారం కోసం ప్రయత్నిస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఆరోపించడం దీనికి సంకేతంగానే భావించాలి.
