Begin typing your search above and press return to search.

రాజీవ్ సర్కార్ ని ఇబ్బందుల్లోకి నెట్టిన బాంబు లాంటి తొలి లేఖ !

రాజీవ్ గాంధీ. భారత దేశానికి అయిదేళ్ళ పాటు ప్రధానిగా సేవలు అందించిన వారు. గాంధీల మూడవ తరం వారసుడు.

By:  Satya P   |   8 Sept 2025 5:00 AM IST
రాజీవ్ సర్కార్ ని  ఇబ్బందుల్లోకి నెట్టిన బాంబు లాంటి  తొలి లేఖ !
X

రాజీవ్ గాంధీ. భారత దేశానికి అయిదేళ్ళ పాటు ప్రధానిగా సేవలు అందించిన వారు. గాంధీల మూడవ తరం వారసుడు. కేవలం ఎంపీగా ఉంటూ ఏ మంత్రి పదవిని నిర్వహించకుండా నేరుగా ప్రధాని అయి రికార్డు సృష్టించిన వారు రాజీవ్ గాంధీ. అసలు రాజకీయాల పట్ల ఆసక్తి లేని ఆయన ఏకంగా పదేళ్ళ పాటు బిజీ బిజీగా రాజకీయాల్లో మునిగి తేలారు 1980లో తన తమ్ముడు సంజయ్ గాంధీ మరణంతో రాజకీయాల్లోకి వచ్చారు రాజీవ్ గాంధీ. తమ్ముడు ప్రాతినిధ్యం వహించిన సీటు అమేధీ నుంచి ఆయన ఉప ఎన్నికల్లో గెలిచి ఎంపీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ తల్లి అనాటి ప్రధాని ఇందిరాగాంధీకి వెన్ను దన్నుగా నిలిచారు.

ఇంకా పట్టు సాధించకుండానే :

తల్లి ఇందిరాగాంధీ కేబినెట్ లో మంత్రి పదవిని ఆయన కోరుకోలేదు. పార్టీ పదవిలోనే ఉంటూ వచ్చారు. అయితే అనూహ్యంగా 1984లో ఇందిరమ్మ దారుణ హత్యకు గురి కావడంతో ఎంపీగా ఉన్న రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు. ఆ వెంటనే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి కనీ వినీ ఎరగని మెజారిటీ దక్కింది. అలా 400 కి పైగా ఎంపీ సీట్లతో రాజీవ్ గాంధీ బలమైన యువ ప్రధానిగా చరిత్రకు ఎక్కారు. ప్రధాని అయ్యేనాటికి ఆయన వయసు జస్ట్ 42 ఏళ్ళు మాత్రమే.

రాష్ట్రపతితో దూరం :

ఇక ఇందిరాగాంధీ హయాంలో రాష్ట్రపతి అయిన వారు జ్ఞానీ జైల్ సింగ్. ఆయనే రాజీవ్ చేత ప్రధానిగా రెండు సార్లు ప్రమాణం చేయించారు. అయితే మొదట్లో అంతా బాగానే ఉన్నా ఆ తరువాత కాలంలో రాష్ట్రపతి జైల్ సింగ్ కి రాజీవ్ కి మధ్య పొరపొచ్చాలు ఉండేవని చెబుతారు. దాంతో రాష్ట్రపతి భవన్ కి రాజీవ్ వెళ్లడం కూడా తగ్గించేశారు. రాజీవ్ గాంధీ తన విదేశీ పర్యటనల తరువాత బ్రీఫింగ్ ఇవ్వడం కూడా చేయకుండా ఒక ప్రోటోకాల్ ని సైతం పాటించేవారు కాదని అంటారు దాంతో పాటు అనేక విషయాలలో కూడా రాష్ట్రపతి భవన్ కి దూరంగానే ఉన్నారని అంటారు. రాష్ట్రపతిగా ఉన్న జైల్ సింగ్ ఈ విషయం మీద మధన పడుతూ తన బాధను ఒక లేఖ రూపంలో రాయాలని ఆనాటి తనను కోరారని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త తుగ్లక్ పత్రిక ఎస్ గురుమూర్తి తాజాగా పేర్కొన్నారు. ఆ లేఖ 1987 మార్చి 31న ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ప్రచురితం అయింది అని గురుమూర్తి చెప్పారు. అదే రాజీవ్ గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పేలిన తొలి బాంబు అని గురుమూర్తి చెప్పారు.

వరస ఇబ్బందులతో :

అది లగాయితూ వరస ఇబ్బందులలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం కూరుకుపోయిందని ఆయన చెప్పారు ఈ లేఖ ప్రచురితం అయిన వారం రోజులకే ఫెయిర్ ఫ్యాక్స్, ఆ వెంటనే హెచ్ డీ డబ్య్లూ లంచాల కుంభకోణం, ఆ మీదట రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఆర్ధిక మంత్రిగా ఉంటూ నంబర్ టూ గా ఎదిగిన వీపీ సింగ్ రాజీనామా అదే వరసలో బోఫోర్స్ కుంభకోణం ఇలా ఇవన్నీ రాజీవ్ సర్కార్ ని సంక్షోభంలోకి నెట్టాయి అని గురుమూర్తి అంటున్నారు .

ఓడిన రాజీవ్ సర్కార్ :

ఇది జరిగిన తరువాత విపక్షాలు అన్నీ వీపీ సింగ్ నాయకత్వంలో ఒక్కటి కావడం 1988 నాటికి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చకచకా జరిగిపోయాయి. అలా కామ్రేడ్స్ కమలం ఇతర మధ్యేవాద పార్టీలు అన్నీ కలసి 1989లో పోటీకి దిగి అనాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని ఓడించాయి. దాంతో రాజీవ్ అయిదేళ్ళకే మాజీ ప్రధాని అయిపోయారు. ఆనాటి విషయాలను తాజాగా గురుమూర్తి చెబుతూ రాజీవ్ గాంధీ ఆనాడు రాష్ట్రపతితో వ్యవహరించిన తీరుతో పాటు ఆయన రాజ్యాంగ వ్యవస్థల పట్ల కొంత తేలిక భావంతో ముందుకు సాగడం వల్లనే తన పతనాన్ని తానే కోరి తెచ్చుకున్నారు అని విశ్లేషించారు.

ఏది ఏమైనా రాజీవ్ గాంధీ తొలి మూడేళ్ళ పాలన సవ్యంగా సాగగా చివరి రెండేళ్ళు సంక్షోభాల నడుమ ముగిసింది. ఇక 1991లో తిరిగి కాంగ్రెస్ పుంజుకుని అధికారంలోకి వచ్చే సమయానికి తమిళనాడు శ్రీపెరుంబుదూర్ లో రాజీవ్ దారుణ హత్యకు గురి అయ్యారు. మొత్తం మీద చూస్తే రాజీవ్ గాంధీ హయాంలో అనేక మంచి కార్యక్రమాలు జరిగిగా రాజకీయంగా ఇంకా రాటు దేలకపోవడం ఎంతో మంది సీనియర్లు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఆయన కలసి ముందుకు సాగకపోవడం వల్లనే ఒక యువ ప్రధాని మరింత కాలం దేశాన్ని పాలించాల్సిన చాన్స్ ని మిస్ చేసుకున్నారు అన్నది విశ్లేషకులు చెప్పే మాట.