Begin typing your search above and press return to search.

100, 173 సినిమాల హీరోలు.. చేతిలో మాత్రం యంగ్ డైరెక్టర్లు!

సీనియర్ హీరోలు కూడా రెగ్యులర్ ఫార్మాట్ ను పక్కన పెట్టీ ప్రయోగాలు చేస్తున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   27 Aug 2026 10:31 AM IST
100, 173 సినిమాల హీరోలు.. చేతిలో మాత్రం యంగ్ డైరెక్టర్లు!
X

సీనియర్ హీరోలు కూడా రెగ్యులర్ ఫార్మాట్ ను పక్కన పెట్టీ ప్రయోగాలు చేస్తున్న విషయం తెలిసిందే. రిస్క్ తీసుకోవడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తక్కువ అనుభవం ఉన్న దర్శకులతో కూడా పెద్ద సినిమాలను పెట్టేస్తున్నారు. నాగార్జున తన 100వ సినిమాను రా.కార్తీక్ చేతిలో పెట్టగా, రజినీకాంత్ 173వ సినిమాను అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్నాడు. ఇద్దరు హీరోల కెరీర్ కౌంట్ చూస్తే చాలా పెద్దది. కానీ వాళ్ల సినిమాలు తీస్తున్న దర్శకులకు మాత్రం ఇంకా చేతివేళ్ల మీద లెక్కపెట్టే సినిమాలే ఉన్నాయి.

అశ్వత్ మారిముత్తుకు ధర్మన్ మూడో సినిమా మాత్రమే. ఓ మై కడవులే తర్వాత డ్రాగన్‌తో పెద్ద హిట్ కొట్టాడు. ఆ ఒక్క సినిమా తర్వాతే రజినీ 173వ సినిమా చేసే అవకాశం వచ్చింది. పైగా ధర్మన్ కూడా చిన్న ప్రాజెక్ట్ కాదు. కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజినీ డాక్టర్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం షూటింగ్ కూడా జరుగుతోంది.

నాగార్జున దగ్గర కూడా దాదాపు ఇదే లెక్క. 100వ సినిమా అంటే కెరీర్‌లో గోల్డెన్ రికార్డ్. అలాంటి సినిమాకు పెద్ద ట్రాక్ రికార్డ్ ఉన్న దర్శకుడిని తీసుకోకుండా రా.కార్తీక్‌కు అవకాశం ఇచ్చాడు. కార్తీక్ తమిళంలో నితమ్ ఒరు వానమ్ తెరకెక్కించాడు. తెలుగులో దర్శకుడిగా మాత్రం నాగ్ సినిమాతోనే అడుగు పెడుతున్నాడు.

రజినీకి కొత్త తరం దర్శకులతో వెళ్లడం ఇప్పుడు కొత్తేమీ కాదు. జైలర్‌ను నెల్సన్‌తో చేయగా, కూలీ కోసం లోకేష్ కనగరాజ్‌తో కలిశాడు. ఇప్పుడు అశ్వత్‌కు ఛాన్స్ ఇచ్చాడు. అంటే తన వయసుకు దగ్గరగా ఉన్న దర్శకుడా, ఎక్కువ సినిమాలు చేశాడా అన్నదానికంటే కథలో తనను కొత్తగా చూపించే అవకాశం ఉందా అన్నదే ముందు చూస్తున్నట్లు ఉంది.

నాగార్జున కెరీర్‌లో కూడా ఇలాంటి ప్రయోగాలు చాలానే ఉన్నాయి. గీతాంజలి సమయంలో మణిరత్నంతో వెళ్లడం అప్పట్లో రిస్క్ అని నాగ్ ఇటీవలే గుర్తుచేసుకున్నాడు. ఇప్పుడు 100వ సినిమా దగ్గర కూడా సేఫ్ కాంబినేషన్ కోసం కాకుండా కొత్త దర్శకుడితోనే వెళ్తున్నాడు.

అశ్వత్‌కు రజినీ సినిమా ఎంత పెద్ద అవకాశమో, రా.కార్తీక్‌కు నాగ్ 100 కూడా అంతే పెద్ద చాలెంజ్. హీరోలు వందకు పైగా సినిమాల అనుభవంతో వస్తున్నారు. దర్శకులు మాత్రం కెరీర్ ప్రారంభ దశలోనే ఉన్నారు. ఈ రెండు సినిమాలు బాగా కుదిరితే మరో ట్రెండ్ స్టార్ట్ కావచ్చు. సీనియర్ హీరోలు టాలెంట్ ఉన్న నెక్స్ట్ జనరేషన్ ను మరింత నమ్మే అవకాశం ఉంటుంది.