Begin typing your search above and press return to search.

రాజకీయాల్లోకి వచ్చి ఉంటే 100% గెలిచేవాడిని.. విజయ్ విజయం ఎన్టీఆర్, ఎంజీఆర్ కంటే గొప్పది!

తమిళనాడు రాజకీయాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర సంచలనంగా మారాయి.

By:  A.N.Kumar   |   17 May 2026 5:07 PM IST
రాజకీయాల్లోకి వచ్చి ఉంటే 100% గెలిచేవాడిని.. విజయ్ విజయం ఎన్టీఆర్, ఎంజీఆర్ కంటే గొప్పది!
X

తమిళనాడు రాజకీయాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర సంచలనంగా మారాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల పరిణామాల నేపథ్యంలో, కోలీవుడ్ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ సాధించిన రాజకీయ విజయంపై రజనీకాంత్ స్పందించిన తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ సాధించిన విజయం చూసి రజనీకాంత్ అసూయ పడుతున్నారంటూ వస్తున్న పుకార్లకు ఆయన తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు.

ఆదివారం చెన్నైలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన రజనీకాంత్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను రాజకీయాల నుంచి ఎప్పుడో వైదొలిగానని, అలాంటప్పుడు విజయ్‌పై అసూయ పడాల్సిన అవసరం తనకు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. "నేను ఒకవేళ రాజకీయాల్లో ఉండి ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే 100 శాతం గెలిచేవాడిని" అంటూ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి.

స్టాలిన్ భేటీపై తప్పుడు ప్రచారాలు.. రజనీ తీవ్ర ఆగ్రహం!

ఇటీవల డీఎంకే అధినేత ఎం. కె. స్టాలిన్‌ను రజనీకాంత్ కలవడం తమిళనాట తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై రజనీకాంత్ క్లారిటీ ఇస్తూ.. కొలత్తూరు నియోజకవర్గంలో స్టాలిన్ ఓడిపోవడం తనకు తీవ్ర బాధ కలిగించిందని చెప్పారు. దశాబ్దాలుగా ఉన్న తమ వ్యక్తిగత స్నేహం కారణంగానే స్టాలిన్‌ను పరామర్శించడానికి వెళ్లానని, దీనికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు.

అయితే ఈ భేటీని కొందరు సోషల్ మీడియాలో తప్పుగా వాడుకున్నారని రజనీ మండిపడ్డారు. డీఎంకే - అన్నాడీఎంకే పార్టీలను కలపడానికి రజనీ ప్రయత్నిస్తున్నాడని, విజయ్ సీఎం కాకుండా అడ్డుకోవడానికే స్టాలిన్‌తో చేతులు కలిపాడని వస్తున్న వార్తలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

"ఇవన్నీ పూర్తిగా నాన్‌సెన్స్. నేను అంత దిగజారిన రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు. స్నేహానికి, రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదు" అని రజనీ ఘాటుగా వ్యాఖ్యానించారు.

"ఎంజీఆర్, ఎన్టీఆర్ కంటే విజయ్ విజయం పెద్దది"

ఇక విజయ్ సాధించిన రాజకీయ విజయాన్ని రజనీకాంత్ ఆకాశానికెత్తారు. తనకు, విజయ్‌కు మధ్య దాదాపు 25 నుంచి 28 ఏళ్ల వయస్సు వ్యత్యాసం ఉందన్న రజనీ.. ఇంత చిన్న వయసులోనే విజయ్ అసాధారణమైన విజయాన్ని సాధించాడని కొనియాడారు.

ఒకవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బలమైన భారతీయ జనతా పార్టీ ని, మరోవైపు తమిళనాడును దశాబ్దాలుగా ఏలుతున్న ప్రధాన ద్రవిడ పార్టీలను ఒంటరిగా ఢీకొట్టి, స్వతంత్రంగా విజయం సాధించడం సామాన్యమైన విషయం కాదన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక సంచలన పోలికను తీసుకొచ్చారు. గతంలో ఎన్టీఆర్ , ఎంజీఆర్ వంటి దిగ్గజాలు రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించారు. కానీ అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలోని బలమైన శక్తులను ఎదుర్కొని విజయ్ సాధించిన ఈ విజయం.. నాటి ఎంజీఆర్, ఎన్టీఆర్ సాధించిన రాజకీయ విజయాల కంటే కూడా గొప్పదని రజనీకాంత్ అభిప్రాయపడ్డారు.

ఎయిర్‌పోర్ట్ వీడియో వైరల్‌పై క్లారిటీ

ఇటీవల విమానాశ్రయంలో మీడియా ప్రతినిధులు విజయ్ విజయంపై ప్రశ్నించినప్పుడు రజనీకాంత్ సమాధానం చెప్పకుండా నవ్వుతూ వెళ్లిపోయారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో విజయ్ విజయం రజనీకి ఇష్టం లేదనే ప్రచారం జరిగింది. దీనిపై రజనీ స్పందిస్తూ.. "అక్కడ ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని, వీడియో తీస్తూ వెనకాలే పరిగెడుతూ ప్రశ్నించాడు. ఆ పద్ధతి నచ్చకే నేను కేవలం నవ్వి వెళ్లిపోయాను. అంతకుమించి ఏమీ లేదు. ఇప్పటికే నేను విజయ్‌కు ఫోన్ చేసి వ్యక్తిగతంగా నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశాను" అని వివాదానికి తెరదించారు.

కమల్ హాసన్ సీఎం అయ్యుంటే అసూయ పడేవాడినేమో!

తన రాజకీయ ప్రస్థానం ముగిసిన అధ్యాయమని చెప్పిన రజనీకాంత్.. తమిళనాడు ప్రజలు ఇప్పుడు మార్పును కోరుకున్నారని, అందుకే విజయ్‌కు భారీ మద్దతు ఇచ్చి గెలిపించారని విశ్లేషించారు. ఇక ప్రెస్ మీట్ ముగిసే సమయంలో రజనీకాంత్ తనదైన శైలిలో నవ్వుతూ ఒక చమత్కారాన్ని విసిరారు. "ఒకవేళ నా సమకాలీనుడు, సుదీర్ఘ మిత్రుడు కమల్ హాసన్ సీఎం అయ్యి ఉంటే.. బహుశా నేను కొద్దిగా అసూయ పడేవాడినేమో" అంటూ నవ్వేశారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లోనే కాకుండా సౌత్ సినీ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్‌గా మారాయి. విజయ్ అభిమానులు రజనీకాంత్ వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ చేస్తున్నారు.