Begin typing your search above and press return to search.

'స‌త్యం' రామ‌లింగ‌రాజు త‌ర‌హాలో 'బంగారం వ్యాపారి' కుంభ‌కోణం?

భారతీయ కార్పొరేట్ చరిత్రలో స్టాక్ మార్కెట్లో తమ బ్రాండ్ విలువను, షేర్ ధరలను కృత్రిమంగా పెంచుకోవడానికి కంపెనీల అధినేతలు చేసిన ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌లు ఎప్పటికప్పుడు ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి.

By:  Sivaji Kontham   |   5 Jun 2026 3:00 PM IST
స‌త్యం రామ‌లింగ‌రాజు త‌ర‌హాలో బంగారం వ్యాపారి కుంభ‌కోణం?
X

భారతీయ కార్పొరేట్ చరిత్రలో స్టాక్ మార్కెట్లో తమ బ్రాండ్ విలువను, షేర్ ధరలను కృత్రిమంగా పెంచుకోవడానికి కంపెనీల అధినేతలు చేసిన ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌లు ఎప్పటికప్పుడు ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. గతంలో దేశాన్ని అట్టుడికించిన `సత్యం కంప్యూటర్స్` రామలింగరాజు కుంభకోణం తరహాలోనే, తాజాగా ప్రముఖ బంగారం వ్యాపార సంస్థ `రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్` అధినేత రాజేష్ మెహతా ఉదంతం వెలుగులోకి వచ్చింది. దశాబ్దాలుగా ఒక సాధారణ కుటుంబ వ్యాపారాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు ప్రాసెసింగ్ - ఎగుమతి సంస్థగా మార్చిన పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన రాజేష్ మెహతా ఇప్పుడు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) విచారణలో భారీ అకౌంటింగ్ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

గతంలో సత్యం రామలింగరాజు తన కంపెనీలో లేని లాభాలను.. రికార్డు స్థాయి ఆదాయాన్ని ఉన్నట్లుగా చూపిస్తూ.. నకిలీ బ్యాంక్ ఖాతాలు, తప్పుడు ఇన్‌వాయిస్‌ల ద్వారా `సత్యం` షేర్ల విలువను ఆకాశానికి తీసుకెళ్లారు. కంపెనీ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుకోవడానికి, పెట్టుబడిదారులను ఆకర్షించడానికి సాగించిన ఈ పరుగు చివరకు దేశంలోనే అతిపెద్ద అకౌంటింగ్ స్కామ్‌గా తేలింది. సరిగ్గా అదే తరహాలో రాజేష్ మెహతా సైతం 2021 ఆర్థిక సంవత్సరం నుండి 2025 ఆర్థిక సంవత్సరం మధ్య కాలంలో తన కంపెనీ ఆదాయాన్ని ఏకంగా 15.15 లక్షల కోట్ల రూపాయల మేర ఎక్కువగా చూపించారని సెబీ తన తాత్కాలిక ఉత్తర్వుల్లో పేర్కొంది. కంపెనీ అనుబంధ సంస్థలు చూపిన ఆదాయంలో దాదాపు 99.8 శాతం భాగం కృత్రిమంగా సృష్టించినదేనని సెబీ తీవ్ర ఆరోపణలు చేసింది.

రాజేష్ మెహతా ప్రస్థానం 1988లో తన సోదరుడు ప్రశాంత్ మెహతాతో కలిసి బెంగళూరులో ప్రారంభమైంది. 1994 నాటికి భారతదేశంలోనే అతిపెద్ద బంగారు ఆభరణాల ఎగుమతి సంస్థగా ఎదిగిన రాజేష్ ఎక్స్‌పోర్ట్స్- 2015లో స్విస్ రిఫైనరీ `వాల్‌కాంబి`ని కొనుగోలు చేయడంతో అంతర్జాతీయ స్థాయికి చేరింది. ప్రపంచంలోని 35 శాతం బంగారాన్ని తామే ప్రాసెస్ చేస్తున్నామని కంపెనీ క్లెయిమ్ చేసుకుంది. అయితే సత్యం కంపెనీ తరహాలోనే భారీ టర్నోవర్ చూపిస్తున్నా రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ లాభాల మార్జిన్ ఎప్పుడూ చాలా తక్కువగా ఉండటం మార్కెట్ నిపుణుల‌లో మొదటి నుంచీ అనుమానాలకు తావిచ్చింది. ఉదాహరణకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ టర్నోవర్ రూ. 9,188.8 కోట్లు కాగా.. నికర లాభం కేవలం రూ. 32.09 కోట్లు మాత్రమే కావడం గమనార్హం.

ఈ వ్యవహారం బయటపడటంతో సెబీ తక్షణ చర్యలు చేపట్టింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ షేర్ల కొనుగోలు- విక్రయాలపై రాజేష్ మెహతాపై నిషేధం విధించడమే కాకుండా.. కంపెనీ పుస్తకాలపై సరికొత్త ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశించింది. ఈ వార్తతో కంపెనీ స్టాక్ మార్కెట్లో 5 శాతం పతనమైంది. మరోవైపు కంపెనీ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. సెబీ కేవలం `వాల్‌కాంబి` సంస్థ ఎబిటా - ఆపరేటింగ్ లాభాలను పరిగణనలోకి తీసుకుని.. దానిని రెవెన్యూగా భావించడం వల్లే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ .. 97 శాతం వ్యత్యాసం వచ్చిందని.. తమ ఆర్థిక నివేదికలు సరైనవేనని కంపెనీ సమర్థించుకుంది.

సత్యం స్కామ్ తరహాలోనే ఈ ఉదంతం కూడా కార్పొరేట్ గవర్నెన్స్, ఆడిటర్ల పాత్ర - బోర్డు ఆడిట్ కమిటీల నిఘా లోపాలను తీవ్రంగా ప్రశ్నిస్తోంది. కంపెనీలో ప్రమోటర్లకు 54.55 శాతం వాటా ఉండగా.. ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్.ఐ.సి) గత పదేళ్లలో తన వాటాను క్రమంగా పెంచుకుంటూ 10.80 శాతానికి చేర్చింది. ఇంతటి గొప్ప ప్ర‌జాద‌ర‌ణ ఉన్న‌ భారీ సంస్థల పెట్టుబడులు ఉన్నా.. ఆర్థిక పారదర్శకతపై సరైన సమీక్ష జరగకపోవడం గమనార్హం. ఒకప్పుడు అద్భుత పారిశ్రామికవేత్తగా ప్ర‌శంస‌లు అందుకున్న‌ రాజేష్ మెహతా వారసత్వం.. రామలింగరాజు లాగే ఒక వివాదాస్పద ఆర్థిక కుంభకోణంగా మిగిలిపోతుందా లేదా అనేది సెబీ తుది దర్యాప్తు తేల్చనుంది.