యాపిల్‌లో భారతీయ ఇంజినీర్‌కు కీలక బాధ్యతలు.. ఎవరీ రాజేష్ అంబటి? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
ప్రపంచంలోనే అగ్రగామి సాంకేతిక పరిజ్ఞాన సంస్థ అయిన ‘యాపిల్’ మళ్లీ ఒక సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టింది.
By: A.N.Kumar | 26 Oct 2026 10:49 PM ISTప్రపంచ టెక్నాలజీ రంగంలో భారతీయ ప్రతిభ మరోసారి సత్తా చాటింది. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌లో భారతీయ మూలాలున్న రాజేష్ అంబటికి కీలక పదవి దక్కింది. దాదాపు 18 ఏళ్లుగా యాపిల్‌లో పనిచేస్తున్న ఆయనను ఇంజినీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా ప్రమోట్ చేసినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. కేవలం ఒక ఉద్యోగికి పదోన్నతి లభించడమే కాకుండా.. యాపిల్ భవిష్యత్ ఇంజినీరింగ్ నాయకత్వంలో చోటుచేసుకుంటున్న మార్పులకు ఈ పరిణామం సంకేతంగా నిలుస్తోంది.
ప్రపంచంలోనే అగ్రగామి సాంకేతిక పరిజ్ఞాన సంస్థ అయిన ‘యాపిల్’ మళ్లీ ఒక సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టింది. గ్లోబల్ టెక్ రంగంలో శరవేగంగా మారుతున్న టెక్నాలజీ అవసరాలకు అనుగుణంగా తన నాయకత్వ బృందాన్ని పునర్వ్యవస్థీకరిస్తోంది. ఈ క్రమంలో భారతీయ సాంకేతిక ప్రతిభకు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. దాదాపు 18 ఏళ్ల పాటు సంస్థ విజయాల్లో భాగస్వామిగా ఉన్న రాజేష్ అంబటి.. ఇప్పుడు యాపిల్ ఇంజనీరింగ్ విభాగంలో కీలకమైన వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలను చేపట్టనున్నారు. రాజేష్ పూర్వీకులు గుంటూరు ప్రాంతం నుంచి వలసవెళ్లి అమెరికాలో సెటిల్ అయ్యారని సమాచారం. రాజేశ్ అమెరికాలోని స్టీవెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో మాస్టర్ డిగ్రీతో పాటు, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం, రట్జర్స్ బిజినెస్ స్కూల్లో అదనపు అధ్యయనాలు చేశారు.
రాజేష్ అంబటి స్ఫూర్తిదాయక ప్రయాణం
మనోధైర్యం, కఠిన శ్రమ, నిరంతర ఆవిష్కరణలే ఒక సాధారణ ఇంజనీర్‌ను అంతర్జాతీయ స్థాయి నాయకుడిగా నిలబెడతాయని రాజేష్ అంబటి కెరీర్ నిరూపిస్తుంది. మోటోరోలా వంటి ప్రముఖ సంస్థలో కెరీర్ ప్రారంభించి.. 2009లో యాపిల్‌లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మేనేజర్‌గా చేరిన ఆయన, స్టెప్ బై స్టెప్‌గా ఎదిగారు. వైర్లెస్ సాంకేతికత, సెల్యులార్ కనెక్టివిటీ, 5జీ నెట్వర్క్స్, ఉపగ్రహ కమ్యూనికేషన్ సాఫ్ట్వేర్ అభివృద్ధిలో ఆయన చూపిన చొరవ అసాధారణమైనది. మొదటి తరం ఐప్యాడ్ నుండి నేటి ఐఫోన్ల వరకు వైర్లెస్ అనుసంధానతను మెరుగుపరచడంలో రాజేష్ బృందం అత్యంత కీలక పాత్ర పోషించింది. నిశ్శబ్దంగా వెనుక ఉండి సరికొత్త సాంకేతికతలను రూపొందించిన ఆయన కృషికి ఈ ప్రమోషన్ ఒక గొప్ప గుర్తింపు.
భవిష్యత్ డిస్ప్లే విప్లవానికి యాపిల్ సన్నాహాలు
ఒకవైపు కనెక్టివిటీ రంగాన్ని బలోపేతం చేస్తూనే మరొకవైపు భవిష్యత్ ఉత్పత్తుల్లో నూతన డిస్ప్లే టెక్నాలజీని పరిచయం చేసేందుకు యాపిల్ విస్తృత వేగంతో అడుగులు వేస్తోంది. డిస్ప్లే విభాగం నాయకత్వంలో మార్పులు చోటుచేసుకుంటున్న ఈ సమయంలో విక్టర్ యిన్ ఇప్పటికే కొత్త తరం డిస్ప్లేల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఓఎల్.ఈ.డీ టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్ ప్రో లో 14 అంగుళాలు, 16 అంగుళాల సైజుల్లో సరికొత్త ఓఎల్.ఈ.డీ టచ్స్క్రీన్లతో కూడిన మ్యాక్‌బుక్ ప్రో మోడళ్లను తీసుకురావడానికి కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది. ఐఫోన్లలో ఎంతో పాపులర్ అయిన డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌ను ఇప్పుడు ల్యాప్‌టాప్‌లలోకి ప్రవేశపెట్టే అవకాశాలున్నట్లు పరిశ్రమ వర్గాల అంచనా. ప్రస్తుతం వీటి రూపకల్పన ప్రక్రియ సాగుతోంది. ఇందులోనే రాజేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు ప్రమోషన్ దక్కేలా చేసింది.
ప్రపంచంలోని అగ్రగామి టెక్ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి కంపెనీల సరసన ఇప్పుడు యాపిల్ కీలక నాయకత్వ హోదాలోనూ భారతీయులు తమ ముద్ర వేస్తున్నారు. 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో రాజేష్ అంబటి సాధించిన ఈ విజయం.. సాంకేతిక రంగాన్ని ఎంచుకునే ప్రతీ భారతీయ యువతకు ఒక గొప్ప ప్రేరణ.
రాజేష్ నాయకత్వంలో ఐఫోన్లు, ఐప్యాడ్లు, మ్యాక్‌బుక్‌ల కనెక్టివిటీ సాంకేతికత ఏ స్థాయికి చేరుకుంటుందో.. నూతన నెట్వర్కింగ్ ఆవిష్కరణలు తదుపరి తరం పరికరాలను ఎలా మార్చబోతున్నాయో చూడటం నిజంగానే అత్యంత ఆసక్తికరం..
