తేజస్వి యాదవ్ భార్యపై దారుణ వ్యాఖ్యలు చేసిన పార్టీ మాజీ నేత
రోజులు గడుస్తున్న కొద్దీ.. రాజకీయ నేతలు వినియోగిస్తున్న భాష అంతకంతకూ తీసికట్టుగా మారుతోంది.
By: Garuda Media | 8 Sept 2025 11:00 AM ISTరోజులు గడుస్తున్న కొద్దీ.. రాజకీయ నేతలు వినియోగిస్తున్న భాష అంతకంతకూ తీసికట్టుగా మారుతోంది. అందునా.. ఎన్నికలు దగ్గరకు వస్తే చాలు.. మర్యాదల్ని వదిలేసి.. బజారున పడటం ఈ మధ్యన ఎక్కువైంది. మహిళలు అన్న గౌరవం లేకుండా.. ప్రత్యర్థుల్ని రాజకీయంగా దెబ్బ తీసేందుకు వాడుతున్న భాష.. తీసుకొస్తున్న పోలికల్ని చూస్తే.. ఎంత రాజకీయమైతే మాత్రం మరీ ఇంత నీచంగా వ్యాఖ్యలు చేయటమా? అన్న భావన కలుగక మానదు. బిహార్ అసెంబ్లీకి జరగాల్సిన ఎన్నికలకు సమయం దగ్గర పడింది.
దీంతో.. ఆ రాష్ట్రంలోని రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎన్నికలు దగ్గరకు రావటంతో నేతలు నోరు జారటం ఎక్కువైంది. తాజాగా ఆర్జేడీ ముఖ్యనేతల్లో ఒకరైన తేజస్వి యాదవ్ సతీమణిని ఉద్దేశించి ఆర్జేడీ మాజీ నేత రాజ్ బల్లభ్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
రాజ్ బల్లభ్ విషయానికి వస్తే.. అతగాడి మీద తీవ్ర ఆరరోపణలు ఉన్నాయి. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో తొమ్మిదిన్నరేళ్లు జైల్లో ఉన్న రాజ్ బల్లభ్ ను ఇటీవల నిర్దోషిగా ప్రకటస్తూ పాట్నా హైకోర్టు పేర్కొనటంతో అతను జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ సందర్భంగా తేజస్వి యాదవ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సతీమణిపై దారుణ రీతిలో వ్యాఖ్యలు చేశారు. విన్నంతనే జుగుప్సగా అనిపించే ఈ వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు.
ఇంతకూ అతనేం మాట్లాడారు? అన్న విషయంలోకి వెళితే.. ‘‘ఓట్ల కోసమే వాళ్లు కులాన్ని ఉపయోగించుకుంటారు. పెళ్లి వరకు వచ్చేసరికి వాళ్లు ఎక్కడ చేసుకున్నారు? హర్యానాలోనో, పంజాబ్‌లోనే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?. ఆయన మహిళను తెచ్చుకున్నారా.. జెర్సీ ఆవునా?. ఇక్కడ అమ్మాయిలు లేరా?’’ అంటూ నవడా జడిల్లా నర్దిగంజ్ లో ఈ దారుణ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.
తేజస్వి యాదవ్ విషయానికి వస్తే.. అతను తన స్కూల్ మేట్ అయిన రాచెల్ గోడిన్హోను 2021లో పెళ్లి చేసుకోవటం తెలిసిందే. పెళ్లి అనంతరం ఆమె తన పేరును రాజశ్రీ యాదవ్ గా మార్చుకున్నారు. ఒళ్లు బలుపుతో రాజ్ బల్లభ్ చేసిన వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. ఆర్జేడీ నేతలు.. పార్టీ క్యాడర్ ఉడికిపోతున్నారు.
