Begin typing your search above and press return to search.

దివాళా నుండి 12,000 కోట్ల సామ్రాజ్యంగా.. గ్లోబల్ రీసైక్లింగ్ దిగ్గ‌జం స్ఫూర్తిదాయక ప్రయాణం!

ఆయనే 'గ్రావిటా ఇండియా' వ్యవస్థాపకుడు రజత్ అగర్వాల్. పదేపదే ఎదురైన వైఫల్యాలను తట్టుకుని.. నిలదొక్కుకున్న ఆయన సక్సెస్ జర్నీ వ్యాపార రంగంలో ఎంతోమందికి ఒక పాఠంలాంటిది.

By:  Sivaji Kontham   |   13 Sept 2026 1:00 AM IST
దివాళా నుండి 12,000 కోట్ల సామ్రాజ్యంగా.. గ్లోబల్ రీసైక్లింగ్ దిగ్గ‌జం స్ఫూర్తిదాయక ప్రయాణం!
X

వ్యాపారంలో ఎదురుదెబ్బలు తగిలి..దివాలా తీసి.. చివరికి ఇల్లు కూడా కోల్పోయిన ఓ సాధారణ వ్యక్తి నేడు రూ. 12,000 కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీకి అధినేతగా ఎదిగారు. ఆయనే `గ్రావిటా ఇండియా` వ్యవస్థాపకుడు రజత్ అగర్వాల్. పదేపదే ఎదురైన వైఫల్యాలను తట్టుకుని.. నిలదొక్కుకున్న ఆయన సక్సెస్ జర్నీ వ్యాపార రంగంలో ఎంతోమందికి ఒక పాఠంలాంటిది.

మాల్వియా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎం.ఎన్.ఐ.టి) నుండి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన రజత్ అగర్వాల్.. తనకు చిన్నతనం నుంచే సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేయాలనే కోరిక ఉండేది. చదువుకునే రోజుల్లోనే తల్లిదండ్రుల నుండి రూ. 1 లక్ష తీసుకుని వ్యవసాయం ప్రారంభించి.. తక్కువ కాలంలోనే మంచి లాభాలను సాధించారు. ఆ తర్వాత లార్సన్ అండ్ టూబ్రో (L&T) కంపెనీలో అనుభవం గడించిన అనంతరం రీసైక్లింగ్ రంగంపై దృష్టి పెట్టారు.

తొలుత ముడి పదార్థాలను దిగుమతి చేసుకుని విక్రయించిన ఆయనభారత్‌లో లెడ్-యాసిడ్ బ్యాటరీల రీసైక్లింగ్ అవకాశాలను గుర్తించి `గ్రావిటా`ను స్థాపించారు. అయితే ప్రభుత్వ నిబంధనలు మారడం... దిగుమతి సుంకాలు భారీగా తగ్గిపోవడం వంటి కారణాల వల్ల ఆయన పెట్టిన వ్యాపారాలు వరుసగా రెండుసార్లు దెబ్బతిన్నాయి. ఈ నష్టాల కారణంగా దివాలా తీశారు. బ్యాంకు అధికారులు కుటుంబసొంత ఇంటిని కూడా స్వాధీనం చేసుకుని వేలం వేశారు.

భారత్‌లో వ్యాపారం దెబ్బతినడంతో సింగపూర్‌కు వెళ్లిన రజత్ అగర్వాల్.. అక్కడ స్క్రాప్ వ్యాపారంలో అనుభవం గడించారు. ఆ తర్వాత శ్రీలంకలో బ్యాటరీ రీసైక్లింగ్ యూనిట్‌ను ప్రారంభించేందుకు అక్కడి పెట్టుబడిదారులను ఒప్పించారు. శ్రీలంక వెంచర్ విజయవంతం కావడంతో ఇథియోపియా, మడగాస్కర్, నమీబియా, ఘనా వంటి దేశాలకు తమ వ్యాపారాన్ని విస్తరించారు. విదేశాల్లో విజయాలు సాధించిన అనంతరం తిరిగి భారత్‌కు వచ్చి జైపూర్‌తో పాటు జమ్మూ కాశ్మీర్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లలో రీసైక్లింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు.

కేవలం `లెడ్‌`కే పరిమితం కాకుండా అల్యూమినియం, ప్లాస్టిక్ రీసైక్లింగ్ రంగాల్లోకి కూడా గ్రావిటాను విస్తరించారు. 2010లో కంపెనీ ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టింది. ట్రేడింగ్ డేటా ప్రకారం.. FY20లో రూ. 1348 కోట్లుగా ఉన్న కంపెనీ కన్సాలిడేటెడ్ రెవెన్యూ.. FY25 నాటికి ఏకంగా రూ. 3980 కోట్లకు పెరిగింది. అలాగే నికర లాభం రూ. 36 కోట్ల నుండి రూ. 312 కోట్లకు ఎగబాకింది.

ప్రస్తుతం ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి భారీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న గ్రావిటా ఇండియా మార్కెట్ విలువ సెప్టెంబర్ 2026 నాటికి రూ. 12,577 కోట్లకు చేరుకుంది. ఒకప్పుడు ఇల్లు కోల్పోయి రోడ్డున పడ్డ రజత్ అగర్వాల్ పట్టుదల, దూరపుచూపు నేడు ఆయనను గ్లోబల్ రీసైక్లింగ్ దిగ్గజంగా నిలబెట్టాయి.