బీజేపీలో మోడీ స్వామ్యం...రాష్ట్రాలలో పార్టీ బలహీనం
రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఎదురైన పరాజయం రాష్ట్ర నాయకత్వంపై చర్చకు దారితీసింది. వసుంధరా రాజే వంటి సీనియర్ నేతలను పక్కన పెట్టడం, స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయకపోవడం పార్టీకి నష్టం కలిగిస్తున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రాల్లో బలమైన నాయకులను తయారు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
By: Satya P | 24 Nov 2026 1:59 PM ISTబీజేపీ వామపక్షాల వంటి పార్టీలను సంస్థాగతంగా అత్యంత పటిష్టంగా ఉండేవిగా పరిగణిస్తారు. అక్కడ వ్యవస్థకే గౌరవం, వ్యక్తి పూజ అనేది ఉండదు, ఎంతటి బలమైన నాయకుడు అయినా పార్టీ ఆదేశిస్తే దిగిపోవాల్సిందే. అలా గతంలో ఘనమైన నేతలు అంతా అలాగే పాటించారు. అయితే 2014 లో జాతీయ రాజకీయాల్లోకి వచ్చి నేరుగా ప్రధాని అయిన నరేంద్ర మోడీ చరిష్మాతో పార్టీ అద్భుతమైన విజయాలను సాధించింది. రెండుసార్లు బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించి కేంద్రంలో అధికారం అందుకుంది. మోడీ ప్రజాకర్షణ శక్తి ముందు బీజేపీ చిన్నబోయింది. అలా రాను రానూ పార్టీలో మోడీ చుట్టూనే రాజకీయం సాగే పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఎక్కడ ఎన్నిక అయినా :
దేశంలో 28 రాష్ట్రాలలో ఎక్కడ ఎన్నికలు ఉన్నా మోడీ అక్కడ రోజుల తరబడి ప్రచారం చేస్తూ రావడం ఒక విధానంగా మారింది. ఇది బీజేపీ పెద్దల వ్యూహం అనుకున్నా దాని వల్ల విజయాలు పార్టీకి దక్కినా కూడా రాష్ట్రాలలో బలమైన నాయకత్వం క్రమంగా లేకుండా పోయింది అన్న విమర్శలు వస్తున్నాయి. పైగా కేంద్ర నాయకత్వం ఎంపిక చేసిన వారే ముఖ్యమంత్రులుగా కుర్చీ ఎక్కే మరో సంస్కృతి కూడా మొదలైంది. ఇది నిజానికి కాంగ్రెస్ అలవాటు చేసుకున దుస్సంప్రదాయం. దానికి ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించింది కూడా. అన్నీ తెలిసిన బీజేపీలో కూడా ఈ రకమైన సంప్రదాయం తీసుకుని రావడం వల్ల బీజేపీ జాతీయంగా బలంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. అక్కడ కూడా బీజేపీ అంటే కూడా మోడీ అమిత్ షా అన్న ఇద్దరి పేర్లే వినిపించడం కూడా మరో కీలక అంశం.
రాజస్థాన్ ఓటమి :
ఈ నేపధ్యం నుంచి చూసినపుడు రాజస్థాన్ లో బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయం పాలు అయింది. డెబ్బై శాతం స్థానాలు ప్రతిపక్షాలు గెలుచుకుంటే కేవలం 30 శాతం స్థానాలే బీజేపీకి దక్కాయి. మరో చిత్రమైన విషయం ఏమిటి అంటే ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ సొంత జిల్లాలో కూడా బీజేపీ ఓటమి అందుకుంది. దీంతో రాజస్థాన్ లో బీజేపీకి రానున్నవి గడ్డురోజులు అని అర్థం అయిపోతోంది. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్న రాష్ట్రంలో ఇలా జరగడంతో బీజేపీ పెద్దలు సైతం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది.
బలమైన నేతలేరీ :
బీజేపీకి రాజస్థాన్ అనగానే వసుంధరా రాజే వంటి బలమైన నేతలు కనిపిస్తారు. అయితే వారిని తీసి పక్కన పెట్టేశారు. భజన్ లాల్ శర్మ తొలిసారి ఎమ్మెల్యే అయితే ఆయనను ముఖ్యమంత్రిగా చేశారు. ఇది పాత నాయకత్వం నుంచి కొత్త తరానికి మార్పుగా బీజేపీ పెద్దలు చెబుతున్నప్పటికీ బలమైన పాత నాయకులకు కూడా సముచితమైన స్థానం కల్పించినపుడే ఆ కోఆర్డినేషన్ కుదురుతుంది. అలా కాకుండా చేయడం వల్లనే బీజేపీ తన బలాన్ని కోల్పోతోంది అని విశ్లేషిస్తున్నారు. అయితే భజన్ లాల్ శర్మ ముఖ్యమంత్రి అయ్యాక 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్లోని 25 స్థానాలకు గాను బీజేపీ 14 స్థానాలకే పరిమితమంది. అంటే ఆరు నెలలు తిరగకుండానే బీజేపీ బలం తగ్గింది అన్న మాట. ఇపుడు చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పావు వంతు బలం తగ్గింది. సీనియర్ నేత రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వసుంధరా రాజేను పక్కన పెట్టడం పార్టీలో అంతర్గత విభేదాలు ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు.
నాయకత్వం పెంచాలి
బీజేపీ రాష్ట్రాలలో బలమైన నాయకత్వం పెంచాల్సిన అవసరాన్ని ఈ ఫలితాలు సూచిస్తున్నాయని అంటున్నారు. ఈ రోజున చూస్తే బీజేపీకి బలమైన ముఖ్యమంత్రులుగా యూపీ నుంచి యోగీ, మహారాష్ట్ర నుండి దేవేంద్ర ఫడ్నవీస్ కనిపిస్తారు. అస్సాం లో హిమంత శర్మ ఉన్నా ఆయన కాంగ్రెస్ లో నాయకుడిగా తయారై వచ్చిన వారు. దేశమంతా బీజేపీని పటిష్టం చేసుకోవాల్సిన అవసరాన్ని రాజస్థాన్ ఫలితం గుర్తు చేస్తోంది అని అంటున్నారు. అంతే కాదు రాష్ట్రాలలో జరిగే ఎన్నికల్లో అక్కడి నాయకులనే ముందు పెట్టి యుద్ధంలో గెలిచేలా చేస్తేనే బీజేపీ పటిష్టం అవుతుందని అని అంటున్నారు.
