ఐఏఎస్ భర్త.. ఐఏఎస్ భార్యను అంతలా వేధిస్తున్నాడట
అవును.. ఐఏఎస్ అధికారిణి అయిన మహిళను.. ఐఏఎస్ సర్వీసులో ఉన్న భర్త వేధింపులకు గురి చేసిన వైనం వెలుగు చూసింది.
By: Garuda Media | 12 Nov 2025 11:30 AM ISTఆమె సాదాసీదా మహిళ కాదు. దేశంలోనే అత్యుత్తమ సర్వీసులో ఉన్న అధికారిణి. అవును.. ఐఏఎస్ అధికారిణి అయిన మహిళను.. ఐఏఎస్ సర్వీసులో ఉన్న భర్త వేధింపులకు గురి చేసిన వైనం వెలుగు చూసింది. సంచలనంగా మారిన వీరి ఉదంతంలోకి వెళితే.. తాను ఎలాంటి వేధింపులకు గురవుతున్న విషయాన్ని వెల్లడిస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేసిన వైనం సంచలనంగా మారింది.
దీంతో సదరు ఐఏఎస్ భర్తపై పోలీసులు వేధింపుల కేసు నమోదు చేశారు. ఈ ఉదంతం రాజస్థాన్ లో చోటు చేసుకుంది. రాజస్థాన్ ఐఏఎస్ అధికారిణి అయిన భారతీ దీక్షిత్ తాజాగా పోలీసులకు తన భర్త మీద కంప్లైంట్ చేశారు. సామాజిక న్యాయం.. సాధికారత విభాగానికి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఆశిష్ మోదీపై ఆయన సతీమణి.. ఐఏఎస్ అధికారిణి అయిన భారతీ దీక్షిత్ జైపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె.. రాజస్థాన్ ప్రభుత్వ ఆర్థికశాఖలో జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు.
2014 బ్యాచ్ కు చెందిన వీరిద్దరూ రాజస్థాన్ కేడర్ కు చెందిన వారు. సివిల్స్ సాధించిన వీరిద్దరూ.. శిక్షణలో ఉండగా పరిచయమై.. శిక్షణ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. తమ పెళ్లైనప్పటి నుంచి ఆశిష్ మోదీ తరచూ మద్యం తాగి తనను శారీరకంగా.. మానసికంగా హింసకు గురి చేస్తున్నట్లుగా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు పాప పుట్టిన తర్వాత వేధింపులు మరింత పెరిగినట్లుగా ఆమె వెల్లడించారు.
తన ప్రాణాలకు అత్తింటి వారి నుంచి హాని ఉందన్న ఆమె.. పలువురు క్రిమినల్స్ తో ఆశిష్ కు సంబంధాలు ఉన్నట్లుగా ఆరోపించారు. గత నెలలో ఒక ఫ్రెండ్ తో కలిసి తనను ప్రభుత్వ వాహనంలో తరలించి.. కొన్ని గంటల పాటు నిర్బంధంలో ఉంచారన్నారు. విడాకులకు అంగీకరించకుంటే తనను.. తన కుటుంబాన్ని చంపేసతానని పిస్టల్ తో బెదిరింపులకు గురి చేసినట్లుగా పేర్కొన్నారు. దీంతో.. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సదరు ఐఏఎస్ అధికారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే.. భార్య తనపై ఇచ్చిన కంప్లైంట్ పై స్పందించేందుకు ఆయన నిరాకరించటం గమనార్హం.
