వైద్య విద్యార్థిని యాక్సిడెంట్ కేసు... ఎఫ్ఐఆర్ నమోదుకు మూడు రోజులు పట్టిందా? నిజమేంటి!
రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన వైద్య విద్యార్థిని ప్రియాంక కేసుపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం హాట్ టాపిక్ అవుతోంది.
By: Tupaki Political Desk | 8 Aug 2026 11:29 PM ISTరాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన వైద్య విద్యార్థిని ప్రియాంక కేసుపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం హాట్ టాపిక్ అవుతోంది. ఈ నెల 3న రాత్రి పది గంటల సమయంలో ప్రియాంక, ఆమె స్నేహితుడు ప్రయాణిస్తున్న స్క్రూటీని కారుతో ఢీకొట్టిన ఇద్దరు నిందితులు అత్యంత పాశవికంగా ఆమె తలను తొక్కించుకుంటూ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన మూడు రోజుల అనంతరం బయటకు రాగా, ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా మూడు గంటలు పట్టిందా? అనే విమర్శలు చెలరేగాయి. అయితే ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదని, రాజకీయం కోసమే కొందరు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) స్పష్టం చేశారు.
ఈ నెల 3న రాత్రి రాజమండ్రి నగరంలోని ప్రసాద్ ఆదిత్యామాల్ బయట స్కూటీపై వెళ్తున్న వైద్యవిద్యార్థిని ప్రియాంకను వెనుక నుంచి కారుతో ఢీకొట్టి ఆమె కిందపడిపోగా నిందితులు కారును వేగంగా ఆమె తలపై నుంచి నడపడంతో బ్రెయిన్ డెడ్ కు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి ప్రియాంకను తరలించగా, సమాచారం అందుకున్న గంట వ్యవధిలోనే పోలీసులు వెళ్లి స్టేట్మెంట్ నమోదు చేశారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. రాత్రి పది గంటలకు ప్రమాదం జరిగితే పోలీసులు 11.30 గంటల సమయంలో ఆస్పత్రికి వెళ్లారని, తిరిగి పోలీసుస్టేషన్ కు 12.30 నిమిషాలకు వచ్చారని తెలిపారు. 4వ తేదీ 1.30 నిమిషాలకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారని వివరించారు.
అయితే ప్రమాదంపై మూడు రోజుల తర్వాత పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో ఎఫ్ఐఆర్ కూడా మూడు రోజుల తర్వాతే నమోదు చేశారని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేయడాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తప్పుపట్టారు. ప్రమాదం జరిగిన మూడు గంటల్లోనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, సమగ్రంగా విచారించి నిందితులను వెనువెంటనే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారని వివరించారు. ఎఫ్ఐఆర్ ప్రక్రియ పూర్తిగా ఆన్ లైన్ లోనే ఉంటుందని, ఎవరూ మార్చడానికి వీలు ఉండదని గుర్తు చేశారు. ప్రభుత్వంపై బురద జల్లడానికి కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక తలకు తీవ్రగాయం కావడంతో హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రియాంక పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని చెబుతున్నారు. ప్రియాంకకు ఆప్నియా టెస్ట్ చేయాలని డాక్టర్లు ప్రయత్నిస్తున్నా, ఆమె శరీరం సహకరించడం లేదని చెబుతున్నారు. సోడియం లెవెల్స్ నియంత్రించడం సాధ్యం కావడం లేదని ఆ కారణంగా వైద్యులు ఏం చేయలేకపోతున్నారని సమాచారం. ప్రస్తుతం పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రియాంక తమ ఇంటికి పెద్ద కుమార్తె అని, చదువు పూర్తయిన తర్వాత తమను బాగా చూసుకుంటుందని అనుకుంటే పరిస్థితి ఇలా అయిపోయిందని ప్రియాంక తండ్రి కన్నీరుమున్నీరు అవుతున్నారు. రాజమండ్రి ఎమ్మెల్యే వాసు తమకు ఫోన్ చేసి ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారని తెలిపారు. కాగా, రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ తొలి సంవత్సరం చదువుతున్న ప్రియాంక స్వస్థలం కర్నూలు కాగా, ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్ లో స్థిరపడ్డారు. మద్యం సేవించిన నిందితులు పాశవికంగా కారుతో ప్రియాంకను ఢీకొట్టడంతో ఆమె ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడుతోంది.
