Begin typing your search above and press return to search.

మిథున్‌రెడ్డికి ఎదురు గాలి.. రాజంపేట‌లో క‌ష్ట‌మేనా.. ?

రాజంపేట నియోజకవర్గంలో రాజకీయాలు ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేవా?

By:  Garuda Media   |   22 Sept 2026 4:00 AM IST
మిథున్‌రెడ్డికి ఎదురు గాలి.. రాజంపేట‌లో క‌ష్ట‌మేనా.. ?
X

రాజంపేట నియోజకవర్గంలో రాజకీయాలు ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేవా? ఒక‌ప్పుడు ఎంపీ మిథున్‌రెడ్డి చ‌క్రం తిప్పిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు ఆ పార్టీ ప్రభావం కొన్ని ప్రాంతాల‌కే ప‌రిమితం అయిందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆకేపాటి అమరనాథ రెడ్డి విజయం సాధించారు. అయిన‌ప్ప‌టికీ.. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న స్థానిక ఎన్నిక‌ల‌పై ఆయ‌న ప్ర‌భావం పెద్ద‌గా క‌నిపించేలా లేద‌ని అంటున్నారు.

రాజంపేట శాసనసభ నియోజకవర్గం అన్నమయ్య, కడప జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. పార్టీల బలం చూస్తే.. ఇక్కడ ప్రధానంగా వైఎస్సార్సీపీ, టీడీపీ కూటమి మధ్యే రాజకీయ పోటీ నెలకొంది. స్థానిక ఎన్నికలు, సమీకరణాల పరంగా ఈ నియోజకవర్గం ఇప్పుడు మ‌రింత‌ రసవత్తరంగా మారింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మిథున్‌రెడ్డి పలు సవాళ్లను ఎదుర్కొంటున్నారు: మద్యం కుంభకోణం కేసులో మిథున్‌రెడ్డి 4వ నిందితుడిగా ఉన్నారు.

ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనను సుదీర్ఘంగా విచారించాయి . రిమాండ్ కూడా గ‌తంలో విధించారు. ప్ర‌స్తుతం మిథున్‌రెడ్డి బెయిల్‌పై ఉన్నారు. వాస్త‌వానికి మిథున్‌రెడ్డి రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుండి వరుసగా మూడు సార్లు ఎంపీగా విజయం సాధించి హ్యాట్రిక్ సృష్టించారు. 2024 ఎన్నికల విజయం: వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఎదురుదెబ్బ తింది. దీంతో రాజంపేటలో మిథున్‌రెడ్డి బలం కూడా దెబ్బ‌తింద‌న్న వాద‌న వినిపిస్తోంది.

మ‌రోవైపు వైసీపీలో మాజీ ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున రెడ్డి వ‌ర్గం వేరుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. గ‌త ఎన్నికల్లో టికెట్ రాలేద‌న్న ఆవేద‌న‌లో ఆయ‌న.. అప్ప‌టి నుంచి పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో త‌న హ‌వాను ప్ర‌ద‌ర్శించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇది సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యేల‌కు ఇబ్బందిగానే మారుతోంది. మ‌రోవైపు.. ప్ర‌స్తుత ఎమ్మెల్యే ఆకేపాటి కేసుల‌కు భ‌య‌ప‌డుతున్నార‌న్న చ‌ర్చ కూడా ఉంది. ఇక‌, ఎంపీ మిథున్‌రెడ్డి కొన్నాళ్లుగా మౌనంగా ఉండ‌డంతో రాజంపేట స్థానిక పోరులో వైసీపీ ఏమేర‌కు గెలుపు గుర్రం ఎక్కుతుంద‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.