రాజమండ్రి వాసులు ఇది తప్పకుండా తెలుసుకోవాలి!
తాజాగా రాజమండ్రికి ఓఆర్ఆర్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిందని మున్సిపల్ మంత్రి నారాయణ వెల్లడించారు.
By: Tupaki Political Desk | 21 Nov 2025 3:15 PM ISTమెట్రో నగరాలకే కాదు.. ద్వితీయశ్రేణి నగరాలకు ట్రాఫిక్ సమస్యలను తీర్చాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించుకుంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాలతోపాటు రాజమండ్రి, కర్నాలు వంటి చోట్ల ఔటర్ రింగురోడ్డు నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే రాజధాని అమరావతిలో భాగంగా విజయవాడకు ఔటర్ రింగు రోడ్డు నిర్మిస్తుంటే.. తాజాగా రాజమండ్రికి ఓఆర్ఆర్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిందని మున్సిపల్ మంత్రి నారాయణ వెల్లడించారు. తాజాగా రాజమండ్రిలో నగరాభివృద్ధిపై రుడా అధికారులతో మంత్రి నారాయణ సమీక్షించారు. ఈ సందర్భంగా కొత్తగా నిర్మించబోయే రాజమండ్రి ఓఆర్ఆర్ పై పూర్తి వివరాలను ఆయన వెల్లడించారు.
చెన్నై-కలకత్తా జాతీయరహదారికి ఆనుకుని ఉన్న నగరంలో నిత్యం ట్రాఫిక్ సమస్యలు వేధిస్తున్నాయి. అంతేకాకుండా నగరం చుట్టూ ఉన్న ప్రాంతాల నుంచి విపరీతమైన రద్దీ ఎదురవుతోంది. ఈ ట్రాఫిక్ సమస్య నగరాభివృద్ధిపైనా చూపిస్తోంది. చెంతనే గోదావరి ఉన్నా.. పారిశ్రామికంగా రాజమండ్రి అభివృద్ధి చెందడం లేదని ప్రభుత్వం గుర్తించింది. దీంతో విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధిలో భాగంగా రాజమండ్రిపై ఫోకస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న మధురపూడి, రాజానగరం, దివాన్ చెరువు, సంపత్ నగర్, కడియం మీదుగా రింగ్ రోడ్డు నిర్మిస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గడంతోపాటు ఆయా ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి మార్గం పరిచినట్లు అవుతుందని ప్రభుత్వం నిర్ణయించింది.
రాజమండ్రి నగరం చుట్టూ సుమారు 25 నుంచి 30 కిలోమీటర్ల మేర ఈ రింగు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం సుమారు రూ.వెయ్యి కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. రాజమండ్రి నగరానికి చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. విమానాశ్రయం, రైల్వేస్టేషన్ ఇలా మౌలిక సౌకర్యాలతోపాటు అందుబాటులో పెద్దనీటి వనరులు ఉన్నా నగరం పారిశ్రామికంగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. ప్రధానంగా ట్రాఫిక్ సమస్య, ఇరుకైన రహదారుల వల్ల నగరాభివృద్ది కుంటుపడుతోందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో నగరాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయాలంటే చుట్టూ రింగు రోడ్డు నిర్మించడం ఒక్కటే మార్గమని ప్రభుత్వం భావించిందని అంటున్నారు. ఇక పుస్కరాలు వస్తున్నందున నగరంలోని అంతర్గత రహదారులు కూడా మెరుగుపరుస్తున్నారు. నగర శివారు ప్రాంతాల్లో రోడ్లు, కాలువల విస్తరణ పనులకు నిధులు విడుదల చేశారు. బొమ్మూరు నుంచి సరస్వతి ఘాట్ వరకు 80 అడుగుల వెడల్పు కోసం రూ.100 కోట్లు వెచ్చిస్తున్నారు. అదేవిధంగా మరో రూ.100 కోట్లతో నగరంలో ముంపు సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.
