Begin typing your search above and press return to search.

'రాజాం'లో టీడీపీకి రంగు ప‌డుతోంద‌ట ..!

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజకవర్గం రాజాం నుంచి గత ఎన్నికల్లో కొండ్రు మురళీమోహన్ విజయం సాధించారు.

By:  Garuda Media   |   19 May 2026 9:00 AM IST
రాజాంలో టీడీపీకి రంగు ప‌డుతోంద‌ట ..!
X

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజకవర్గం రాజాం నుంచి గత ఎన్నికల్లో కొండ్రు మురళీమోహన్ విజయం సాధించారు. దాదాపు 20వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో ఆయన గెలుపు గుర్రం ఎక్కారు. గతంలో కాంగ్రెస్ తరపున విజయం సాధించిన కోండ్రు మురళి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీలోకి వ‌చ్చిన ఆయ‌న 2019 ఎన్నిక‌ల్లో ఓడినా గత ఎన్నికల్లో మరోసారి టిడిపి టికెట్‌ దక్కించుకుని నియోజకవర్గంలో విజయం సాధించారు.

అయితే అంతర్గత రాజకీయ పరిస్థితులు ఆయనను తీవ్రస్థాయిలో కుదిపేస్తున్నాయన్నది స్థానిక రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. రాజాం నియోజక వర్గంలో టిడిపి బలంగా ఉంది. ఇదే సమయంలో అంతర్గతంగా నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి.. అన్నది కూడా వాస్తవం. ఒకరి వాదనను మరొకరు, ఒకరి నిర్ణయాలను మరొకరు పాటించే పరిస్థితి లేదు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవటం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతోనే సమయం సరిపోతుందన్నది స్థానిక నాయకులు వ్యవహరిస్తున్న తీరును బట్టి స్పష్టం అవుతుంది.

వాస్తవానికి రాజాం నియోజకవర్గంలో వైసిపి కూడా బలంగానే ఉంది. 2014, 2019 రెండు ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా రెండుసార్లు గెలిచి 20 వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయినా క్షేత్ర‌స్థాయిలో ఉన్న బలంతో బాగా యాక్టివ్ అవుతోంది. ఈ క్రమంలో టిడిపి నాయకుల‌ మధ్య ఉన్న విభేదాలను తమకు అనుకూలంగా మార్చుకొని ఆ దిశగా రాజకీయాలను ముమ్మరం చేసిన పరిస్థితి వైసీపీలో కనిపిస్తోంది. కానీ, ఈ విషయాలపై టీడీపీ నాయకులు కానీ ఎమ్మెల్యే మురళీమోహన్ గాని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎన్నికల సమయానికి ఏదో ఒక రకంగా గెలవచ్చు అనే ధోర‌ణిలోనే ఉన్నారు.

నిజానికి ఇదే నియోజకవర్గానికి చెందిన కావలి గ్రీష్మ బలమైన వాయిస్ వినిపించే నాయకురాలుగా ఉన్నారు. ఆమె శాసన మండలికి కూడా ప్రాతినిధ్యం వారిస్తున్నారు. దీంతో అటు కొండ్రు మురళి వర్గం వేరుగా రాజకీయాలు చేస్తోంది. ఇటు కావలి రేష్మ వర్గం వేరుగా రాజకీయాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా ఇరు వర్గాల మధ్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్యం పోరులో రాజాం నియోజక వర్గం టిడిపి కార్యకర్తలు నలిగిపోతున్నారన్నది పరిశీలకు చెబుతున్న మాట. దీనిని వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకుంటుంది అన్నది వాస్తవం. ఈ పరిస్థితిని సరిదిద్దుకోకపోతే రాజాంలో తిరిగి వైసిపి ప‌ట్టు పెంచుకోవ‌డం ఖాయం.